icon icon icon
icon icon icon

సంక్షిప్త వార్తలు (5)

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) జోలికి కాంగ్రెస్‌ నేతలు గానీ, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతగానీ వెళ్లలేరు.

Updated : 24 Apr 2024 06:01 IST

సీఏఏ జోలికి ఎవరూ వెళ్లలేరు

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) జోలికి కాంగ్రెస్‌ నేతలు గానీ, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతగానీ వెళ్లలేరు. అధికారంలోకి వస్తే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని వారు చెబుతున్నారు. చొరబాటుదారులకు సాయపడడానికే ఆ నేతలు చూస్తున్నారు. మేం అధికారంలోకి వస్తే బెంగాల్‌లో అవినీతిని, చొరబాట్లను అడ్డుకుంటాం. 370 అధికరణం, ముమ్మారు తలాక్‌ పద్ధతుల్ని పునరుద్ధరించాలని కాంగ్రెస్‌ అనుకుంటోంది. మేం దానికి అంగీకరించబోం.

బెంగాల్‌, మహారాష్ట్ర సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా


లౌకిక కూర్పును కాంగ్రెస్‌ ధ్వంసం చేస్తోంది

దేశంలో లౌకిక కూర్పును కాంగ్రెస్‌ ధ్వంసం చేస్తోంది. హిందువులు, ముస్లింలు అని విభజిస్తూ రాజకీయాలతో ఆడుకుంటోంది. ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్‌ వ్యతిరేకం. కులమతాల ప్రాతిపదికన భాజపా ఎలాంటి వివక్ష చూపడం లేదు.

ఝార్ఖండ్‌లోని ఖూంటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌


ఎన్నికల ఫలితాలేమిటో మోదీ మాటల్లో కనిపిస్తోంది

లోక్‌సభ మొదటి దశ ఎన్నికలు జరిగిన చోట్ల భాజపా పరిస్థితి అధ్వానంగా ఉంది. అధికారం నుంచి దిగిపోబోయే దిల్లీ (ప్రధాని మోదీ), లఖ్‌నవూ (యూపీ సీఎం ఆదిత్యనాథ్‌) పాలకుల తాజా ప్రసంగాలు వింటే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది అర్థమవుతోంది. 

అలీగఢ్‌, హాథ్రస్‌ సభల్లో సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌


బుజ్జగింపుపై ఒక్క పేరా చూపించగలరా?

కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ‘బుజ్జగింపు’ ధోరణిని ప్రతిబింబించేలా ఒక్క పేరా అయినా చూపగలరా? సమాజంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా మా పార్టీ మ్యానిఫెస్టో రూపొందించింది. అందరికీ మేం న్యాయం చేస్తాం. భాజపా మ్యానిఫెస్టో గురించి ఎవ్వరూ మాట్లాడుకోవటం లేదు.

శిమ్లాలో మీడియాతో కాంగ్రెస్‌ నేత చిదంబరం


హిందూ మహిళ మంగళ సూత్రాన్ని ముస్లింలు తెంచరు

మోదీ వ్యాఖ్యలు దురదృష్టకరం. ఇతర మతాల్లోకి చూడమని మా మతం చెప్పదు. హిందూ మహిళ మంగళసూత్రాన్ని ముస్లింలు ఎప్పుడూ తెంచుకుపోరు. అలా చేస్తే వాళ్లు ముస్లింలు కారు. ఇతర మతాలను గౌరవించాలని ఇస్లాం చెబుతుంది.

శ్రీనగర్‌లో విలేకరులతో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా



మోదీ విశ్వ గురు కాదు.. విష గురు: జైరాం రమేశ్‌

జైపుర్‌: మహిళల మంగళసూత్రాన్ని ప్రధాని మోదీ ఎన్నడూ గౌరవించలేదని, ఆయన విశ్వ గురు కాదని.. విష గురు అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ విమర్శించారు. విజయం విషయంలో ఆయన భయపడిపోయి, ప్రజల్లో విభజన తెచ్చేలా మాట్లాడుతున్నారని మంగళవారం విలేకరుల సమావేశంలో చెప్పారు. దేశ ప్రధానులెవరూ ఇలాంటి భాష మాట్లాడలేదన్నారు.


ఎల్‌డీఎఫ్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యల దుమారం

పాలక్కాడ్‌: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలన్న కేరళ ఎల్‌డీఎఫ్‌ ఎమ్మెల్యే పి.వి.అన్వర్‌ వ్యాఖ్యలు మంగళవారం వివాదాస్పదంగా మారాయి. ఓ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..‘‘రాహుల్‌ 4వ తరగతి పౌరుడిలా వ్యవహరిస్తున్నారు. ఆయన గాంధీ ఇంటిపేరుకు అనర్హుడు. నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన ఆయన కేరళ సీఎం విజయన్‌పై చేసిన వ్యాఖ్యలు అనుచితం. రాహుల్‌ డీఎన్‌ఏను పరీక్షించాలి’’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్‌ దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.


కాంగ్రెస్‌ను విస్మరిస్తున్న ప్రధాన మీడియా
-  అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్‌

గువాహటి: ప్రజలతో మమేకం కావడానికి కాంగ్రెస్‌ పార్టీకి సోషల్‌ మీడియా తోడ్పడుతుంటే, ప్రధాన స్రవంతి మీడియా మాత్రం దేశంలోనే అత్యంత పురాతన పార్టీని విస్మరిస్తోందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్‌ పేర్కొన్నారు. దేశ భిన్నత్వాన్ని గౌరవిస్తూ వీలైనన్ని ఎక్కువ ప్రాంతీయ భాషల్లో తాము కంటెంట్‌ను రూపొందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా, డిజిటల్‌ వేదికల విభాగాలకు ఆమె నేతృత్వం వహిస్తున్నారు. ప్రత్యర్థి భాజపాతో పోల్చితే తమ పార్టీ ఎంగేజ్‌మెంట్‌ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ‘‘మా వాస్తవ ఫాలోవర్ల సంఖ్య భాజపా కంటే తక్కువగా ఉన్నప్పటికీ ప్రజలకు మాత్రం చాలా ఎక్కువగా చేరువవుతున్నాం (రీచ్‌)’’ అని మంగళవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీనేత్‌ తెలిపారు.


రాహుల్‌, ప్రియాంక సనాతన ధర్మ వ్యతిరేకులు

కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ ‘సనాతన ధర్మ వ్యతిరేకులు’. హిందువుల్ని బలహీనపరిచేందుకే వారు అన్నివేళలా ప్రయత్నించారు. హిందుత్వాన్నే కాకుండా శ్రీరాముడినీ కాంగ్రెస్‌వారు వ్యతిరేకించారు. దేశాన్ని ముక్కలు చేయాలన్న వ్యక్తిని వీరు తమ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు. అమేఠీ అభివృద్ధికి గాంధీ కుటుంబం చేసిందేమీ లేదు.

అమేఠీ సభలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ


ప్రత్యేక రాష్ట్రంగా పశ్చిమ యూపీ

కేంద్రంలో మేం అధికారంలోకి వస్తే పశ్చిమ యూపీతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తాం. చిరకాల డిమాండును నెరవేరుస్తాం. రాష్ట్రంలో మేం అధికారంలో ఉన్నప్పుడే దీనిపై తీర్మానించి కేంద్రానికి పంపించాం. అలహాబాద్‌ హైకోర్టుకు చెందిన ధర్మాసనాన్ని మేరఠ్‌లో నెలకొల్పుతాం.

మేరఠ్‌లో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి


ఆస్తులు దోచుకునే కాంగ్రెస్‌కు అవకాశమిస్తారా?

వైయక్తిక చట్టాన్ని.. అంటే షరియా చట్టాన్ని దేశంలో అమలుచేసి, ప్రజల ఆస్తులను స్వాధీనం చేసుకుని పంచాలని కాంగ్రెస్‌ కోరుకుంటోంది. ఆ పార్టీ మ్యానిఫెస్టో దానిని చాటుతోంది. మీ ఆస్తులు దోచుకునేందుకు కాంగ్రెస్‌, సమాజ్‌వాదీలకు అవకాశమిస్తారా?

యూపీలోని అమరోహాలో యోగి ఆదిత్యనాథ్‌


ముస్లింలపై ప్రధాని వ్యాఖ్యలు తగవు

ముస్లింల విషయంలో విద్వేషాన్ని రగిల్చే రీతిలో ప్రధాని మోదీ మాట్లాడడం తగదు. అలాంటి ప్రసంగాలను రాజకీయ నాయకులు విడనాడాలి. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లౌకిక దేశంలో సబబు కాదు. వీటిని పూర్తిగా పరిహరించాలి.

చెన్నైలో ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి


బిహార్‌కు సేవ నా ధర్మం

బిహార్‌ అంతా నా కుటుంబంలాంటిది. బిహార్‌కు సేవ చేయడం నా ధర్మం. మునుపటి ప్రభుత్వాల హయాంలో బిహార్‌ ఎంత దయనీయంగా ఉండేదో గుర్తుచేసుకుని ఎన్డీయేనే గెలిపించండి. బిహార్‌ అంటే కుంభకోణాలు, హత్యలు, దోపిడీలు, ఇతర నేరాలే అన్నట్లు ఉండేది. బిహార్‌ కోసం 2005 నుంచి నేను ఎన్ని త్యాగాలు చేశానో మీకు తెలుసు.

ప్రజలకు బహిరంగ లేఖలో బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌


ఎన్డీయేకైనా ఓటు వేయండి.. ఆయనకు వద్దు

ఈ ఎన్నికలు ఒక వ్యక్తికి సంబంధించినవి కావు. రెండు సిద్ధాంతాల మధ్య పోరు ఇది. పూర్ణియాలో ఇండియా కూటమి అభ్యర్థి భీమా భారతికి ఓటు వేయకపోతే ఎన్డీయేకైనా వేయండి గానీ స్వతంత్ర అభ్యర్థి పప్పూ యాదవ్‌కు మాత్రం వద్దు.

పట్నాలో ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img