icon icon icon
icon icon icon

దేశం కోసం మా అమ్మ మంగళసూత్రం త్యాగం చేసింది

మంగళసూత్రం విలువ తెలియకుండా కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోపణలు చేస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ నిప్పులు చెరిగారు.

Published : 24 Apr 2024 05:29 IST

ఆ విలువ మోదీకి ఏం తెలుసు?
ప్రధానిపై ప్రియాంక నిప్పులు

ఈనాడు, బెంగళూరు: మంగళసూత్రం విలువ తెలియకుండా కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోపణలు చేస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ నిప్పులు చెరిగారు. తండ్రి రాజీవ్‌గాంధీ హత్యోదంతాన్ని ప్రస్తావిస్తూ.. దేశం కోసం తన తల్లి సోనియాగాంధీ- మంగళసూత్రాన్ని త్యాగం చేశారని చెప్పారు. యుద్ధం సమయంలో తన నానమ్మ ఇందిరాగాంధీ సొంత బంగారాన్ని దేశం కోసం ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. దేశాన్ని 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ ఎప్పుడైనా ప్రజల బంగారాన్ని, మంగళసూత్రాలను దోచుకుందా? అని ప్రశ్నించారు. మంగళవారం బెంగళూరులో ఎన్నికల ప్రచార సభలో ప్రియాంక ప్రసంగించారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే మన తల్లులు, చెల్లెళ్ల బంగారాన్ని చొరబాటుదారులకు, ఎక్కువ సంతానం ఉండేవారికి దోచి పెడుతుందని ప్రధాని మోదీ ఇటీవల ఆరోపించడాన్ని ప్రియాంక తప్పుబట్టారు.

విలువలు మరచి నాటకాలు

‘‘ఏం మాట్లాడుతున్నారు? ప్రధానికి మంగళసూత్రం విలువ తెలిసుంటే ఇలా అనైతికంగా మాట్లాడేవారా? దేశంలో అన్ని సంప్రదాయాలకూ మహిళల సేవాస్ఫూర్తే పునాది. అవసరమైతే తాను పస్తు ఉంటుందే గానీ కుటుంబంలో ఎవరినీ ఆకలితో పడుకోనివ్వదు. ఇంట్లో అందరూ నిద్రించాక విశ్రమించేది గృహిణి. కుటుంబానికి కష్టం వస్తే ఆభరణాలను ఆమె తాకట్టుపెడుతుంది. వాళ్ల త్యాగాల విలువ వీళ్లకేం తెలుసు? ప్రపంచానికి నాయకుడిగా ప్రకటించుకునే నేత- విలువలు మరచి నాటకాలాడుతున్నారు. దేశ చరిత్రలో ఎన్నికల ముందు ఇద్దరు ముఖ్యమంత్రులను జైళ్లకు పంపిన సంఘటన మనం చూడలేదు. వాస్తవాలను ప్రశ్నించిన వారికి ప్రస్తుతం ఇదే గతి పడుతోంది’’ అని ప్రియాంక ఆవేదన వ్యక్తంచేశారు. మహిళల్ని బెదరగొట్టి ఓట్లు రాబట్టుకునేలా మాట్లాడుతున్నందుకు మోదీ సిగ్గుపడాలన్నారు. నైతికత- నాటకీయత, అధికారం- నిజాయతీ, పరోపకారం- అహంకారం.. వీటిల్లో ఏం కావాలో తేల్చుకోవాలని ప్రజల్ని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img