icon icon icon
icon icon icon

హనుమాన్‌ చాలీసా విన్నా నేరమేనా

హనుమాన్‌ చాలీసా విన్నా కాంగ్రెస్‌  నేతలు నేరంగానే పరిగణిస్తున్నారని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ అదికారంలో ఉన్న కర్ణాటకలో ఇటీవల ఓ దుకాణదారు హనుమాన్‌ చాలీసా వింటుండగా కొందరు మూకదాడికి పాల్పడినట్లు మోదీ తెలిపారు.

Updated : 24 Apr 2024 05:23 IST

కాంగ్రెస్‌ అలాగే చూస్తోంది
విపక్షం కుట్రలు బయటపెట్టా
ప్రధాని మోదీ వ్యాఖ్యలు

జైపుర్‌: హనుమాన్‌ చాలీసా విన్నా కాంగ్రెస్‌  నేతలు నేరంగానే పరిగణిస్తున్నారని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ అదికారంలో ఉన్న కర్ణాటకలో ఇటీవల ఓ దుకాణదారు హనుమాన్‌ చాలీసా వింటుండగా కొందరు మూకదాడికి పాల్పడినట్లు మోదీ తెలిపారు. రాజస్థాన్‌లోని టోంక్‌లో మంగళవారం నిర్వహించిన ఎన్నికల సభలో ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీపై మళ్లీ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రజలు తమ విశ్వాసాలను పాటించడం కూడా కష్టంగా ఉందన్నారు. గతంలో రాజస్థాన్‌లోనూ ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీరామనవమి ఉత్సవాలపై ఆంక్షలు విధించారని గుర్తు చేశారు. ‘‘మూడు రోజుల క్రితం కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలను నేను బయటపెట్టా. ప్రజల సంపదను దోచుకొని కొంతమంది ‘ఎంపికచేసిన వ్యక్తులకు’ పంచిపెట్టాలన్న వారి కుట్రలను దేశ ప్రజల ముందుంచా. దీంతో విపక్ష కూటమి ఆగ్రహానికి గురై మోదీని తిట్టడం మొదలుపెట్టింది. సంపద పునఃపంపిణీ కోసం సర్వే చేస్తామని వారి నేతలే చెప్పారు. దమ్ముంటే వాస్తవాన్ని అంగీకరించి పోరాడండి. ఎదుర్కోడానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అని మోదీ సవాలు విసిరారు. బడుగు, బలహీనవర్గాలకు చెందినవారి రిజర్వేషన్లు లాక్కొని కొందరు ప్రత్యేక వ్యక్తులకు పంచాలని చూస్తున్నవారి కుట్రను బయటపెడితే కాంగ్రెస్‌ ఉలిక్కి పడుతోందని మోదీ అన్నారు. 2004లో ఆ పార్టీ కేంద్రంలో పగ్గాలు చేపట్టిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తగ్గించి ముస్లింలకు ప్రత్యేకకోటా కల్పించే ప్రయత్నం చేసిందని గుర్తు చేశారు.


గోవాకు రాజ్యాంగం వర్తించదని అంబేడ్కర్‌ను అవమానిస్తారా?

ధంతరీ, సక్తీ (ఛత్తీస్‌గఢ్‌): దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని గతంలో కర్ణాటకకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ కోరగా, ఇప్పుడు అదే పార్టీకి చెందిన గోవా అభ్యర్థి తమ తీరప్రాంత రాష్ట్రంపై రాజ్యాంగాన్ని బలవంతంగా రుద్దారని అంటున్నారని ప్రధాని మోదీ విస్మయం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తమ ‘యువరాజు’కు (రాహుల్‌గాంధీ అనే ఉద్దేశంతో) కూడా చెప్పినట్లు ఆ అభ్యర్థి (వి.ఫెర్నాండెజ్‌, దక్షిణ గోవా) బహిరంగంగా చెబుతున్నాడని తెలిపారు. దేశాన్ని విభజించే ఈ కుట్ర బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ను అవమానించినట్టు కాదా? అని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌లోని ధంతరీ, సక్తీ జిల్లాల్లో మంగళవారం ఎన్నికల ర్యాలీలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుక ఆహ్వానాన్ని కాంగ్రెస్‌ తిరస్కరించిందని, ఇది రాముడి మాతృసంబంధ మూలాలు ఉన్న నేల, మాత శబరి జన్మస్థలమైన ఛత్తీస్‌గఢ్‌ను అవమానించడమే అన్నారు. కాంగ్రెస్‌ తన అవినీతిని దాచుకునేందుకు ఈ ప్రాంతంలో హింసను ప్రోత్సహించిందని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజాన్ని కూకటివేళ్లతో పెకలిస్తామని, ఇది తన గ్యారంటీ అని మోదీ తెలిపారు.


మోదీపై ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ

దిల్లీ: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ చేసిన ‘చొరబాటుదారు’ వ్యాఖ్యలపై తమకు ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలిస్తున్నామని ఈసీ వర్గాలు వెల్లడించినట్లు ఓ మీడియా కథనం పేర్కొంది. ఇటీవల రాజస్థాన్‌లోని బాంస్వాడాలో జరిగిన ర్యాలీలో మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌, మరికొందరు కాంగ్రెస్‌ ప్రతినిధులు విడివిడిగా ఎన్నికల కమిషనర్లను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఈసీ వర్గాల నుంచి స్పందన వచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img