icon icon icon
icon icon icon

ఓబీసీలకు శత్రువు కాంగ్రెస్‌

కర్ణాటకలో ఓబీసీల కోటా తగ్గించి, ఆ కేటగిరీలో ముస్లింలను చేర్చిన కాంగ్రెస్‌ పార్టీ దేశమంతా అదే విధానాన్ని అనుసరించాలని చూసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

Updated : 25 Apr 2024 06:57 IST

మళ్లీ చెబుతున్నా.. అది ‘ముస్లింలీగ్‌’ మ్యానిఫెస్టో
మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ సభల్లో ప్రధాని మోదీ

సాగర్‌, అంబికాపుర్‌: కర్ణాటకలో ఓబీసీల కోటా తగ్గించి, ఆ కేటగిరీలో ముస్లింలను చేర్చిన కాంగ్రెస్‌ పార్టీ దేశమంతా అదే విధానాన్ని అనుసరించాలని చూసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మతం ఆధారంగా రిజర్వేషన్ల అమలుకు దొడ్డి దారిన ప్రయత్నించిన కాంగ్రెస్‌ ఓబీసీలకు పెద్ద శత్రువని ధ్వజమెత్తారు. బుధవారం మధ్యప్రదేశ్‌లోని సాగర్‌, హర్దాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపుర్‌ ఎన్నికల ర్యాలీల్లో మోదీ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటా కాపాడుకోవాలంటే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 400కు పైగా స్థానాల్లో విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కారణంగానే తాను ‘‘అబ్‌ కీ బార్‌ 400 పార్‌’’ నినాదం ఇచ్చినట్లు తెలిపారు. భారత్‌ స్వావలంబన (ఆత్మనిర్భర్‌) సాధిస్తే తమ దుకాణాలు మూతపడతాయని భావిస్తున్న కొన్ని శక్తులు కాంగ్రెస్‌ సారథ్యంలోని ఇండియా కూటమి ఏర్పాటుచేసే బలహీన ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాయని మోదీ అన్నారు. ‘‘కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో విడుదలైన రోజే చెప్పాను. ఇపుడు మళ్లీ చెబుతున్నా. అది ముస్లింలీగ్‌ ముద్ర గల మ్యానిఫెస్టో. ఓటుబ్యాంకు ఆకలితో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మతప్రాతిపదికన రిజర్వేషన్లు వద్దన్న రాజ్యాంగ పెద్దల మాటలను ఏనాడూ ఖాతరు చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకల్లో వాళ్లు ఇదే చేయాలని చూశారు. తాజాగా తెలంగాణాలోని కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి కూడా ఇదే హామీ ఇచ్చారు’’ అని ధ్వజమెత్తారు. ఉగ్రవాదులు చనిపోతే కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కన్నీరు కారుస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు. బుధవారం సాయంత్రం భోపాల్‌లో ప్రధాని రోడ్‌ షో నిర్వహించారు.


ఏడాదికి ఒకరు ప్రధానిగా ‘ఇండియా’ ప్రణాళిక

విపక్ష ఇండియా కూటమిలో నాయకత్వ సమస్య పరిష్కారానికి ఏడాదికి ఒకరు ప్రధానిగా ఉండేలా రాజీ సూత్రాన్ని పరిశీలిస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ ఏర్పాటును ప్రపంచం అపహాస్యం చేయదా? అని మోదీ ప్రశ్నించారు. అయిదేళ్లలో అయిదుగురు ప్రధానులు మారే ఈ సూత్రానికి ఓటర్లు కూడా సిద్ధపడితే అది విపక్ష కూటమి ఆడే ప్రమాదకరమైన ఆటగా మారుతుందన్నారు. ‘‘ఈ దేశ పాలనను ఎవరికి అప్పగించాలనేది భాజపాకు ఓ స్పష్టత ఉంది.. అది మోదీయే. విపక్షాల మాటేమిటి? ‘ముంగేరీలాల్‌ కే సప్నే’ (పగటి కలలు) కంటున్న ఈ నేతల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ అని ప్రధాని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img