icon icon icon
icon icon icon

నా అంత్యక్రియలకైనా హాజరవ్వండి

కాంగ్రెస్‌కు ఓటు వేసినా వేయకపోయినా.. తానెంతో కొంత చేశానని భావిస్తే కనీసం తన అంత్యక్రియలకైనా హాజరు కావాలని సొంత జిల్లా కలబురగి వాసులకు మల్లికార్జున ఖర్గే విజ్ఞప్తి చేశారు.

Published : 25 Apr 2024 04:10 IST

ఎన్నికల సభలో ఖర్గే భావోద్వేగం

ఈనాడు, బెంగళూరు: కాంగ్రెస్‌కు ఓటు వేసినా వేయకపోయినా.. తానెంతో కొంత చేశానని భావిస్తే కనీసం తన అంత్యక్రియలకైనా హాజరు కావాలని సొంత జిల్లా కలబురగి వాసులకు మల్లికార్జున ఖర్గే విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం కర్ణాటకలోని కలబురగిలో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘నేను ఎన్నికల్లో పోటీ చేసినా, చేయకున్నా నా చివరి శ్వాస వరకు రాజకీయాల్లోనే ఉంటాను. ఈసారి మా అల్లుడు రాధాకృష్ణ దొడ్డమనిని కలబురగి నుంచి నిలబెట్టాం. మీరు ఆయనను ఓడిస్తే మీ హృదయంలో నేను లేనట్లు. కనీసం నా అంతిమ సంస్కారానికైనా రండి. నన్ను దహనం చేస్తే నా సమాధిపై బత్తీలు వెలిగించండి.. పూడిస్తే నాపై మన్ను వేయండి’’ అంటూ ఖర్గే భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘గత ఎన్నికల్లో నన్ను ఓడించారు. నా ప్రజలు నన్ను ఓడించలేదు. అమిత్‌ షా, ఆరెస్సెస్‌ నేతలు.. కలిసి నన్ను లక్ష్యంగా చేసుకుని చివరికి ఓడించారు. ఇక్కడి ప్రజలు నన్ను మరచిపోరు. నా చివరి శ్వాస వరకు భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుతునే ఉంటాను’’ అని ఆయన అన్నారు. మోదీ, అమిత్‌ షాలు దేశం కోసం కాదు.. ఈ దేశాన్ని అంబానీ, అదానీలకు విక్రయించేందుకు ఉన్నారంటూ మండిపడ్డారు.


మోదీకి అదృశ్య ఓటర్ల భయం    

కాంగ్రెస్‌కు ఓటు వేసే అదృశ్య ఓటర్లను చూసి మోదీకి భయం పట్టుకుందని,  అందుకే మతవిద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఆయన చేస్తున్నారని తిరువనంతపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఖర్గే పేర్కొన్నారు. మోదీ ‘మంగళసూత్రం’ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహిళల మంగళసూత్రాలకు రక్షణ ఉండదని మోదీ అంటున్నారు. 55 ఏళ్లు పాలించిన మా పార్టీ పాలనలో అలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగాయా?’’ అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img