icon icon icon
icon icon icon

కులగణనను ఏ శక్త్తీ అడ్డుకోలేదు

ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. తమను తాము దేశభక్తులుగా చెప్పుకునే వారు కుల గణన అనే ఎక్స్‌రే రిపోర్టుకు భయపడుతున్నారని విమర్శించారు.

Updated : 25 Apr 2024 06:36 IST

90 శాతం ప్రజలకు న్యాయ భద్రత కల్పనే నా జీవితాశయం
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌

దిల్లీ, సోలాపుర్‌: ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. తమను తాము దేశభక్తులుగా చెప్పుకునే వారు కుల గణన అనే ఎక్స్‌రే రిపోర్టుకు భయపడుతున్నారని విమర్శించారు. దాన్ని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదని, కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలుత జరగబోయే ప్రక్రియ కులగణనే అని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని 90 శాతం ప్రజలకు న్యాయ భద్రత కల్పించడం తన జీవితాశయమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ప్రస్తావించిన ‘సామాజిక-ఆర్థిక సర్వే’ హామీ గురించి ప్రధాని మోదీ చేసిన విమర్శలపై బుధవారం దిల్లీలో సామాజిక న్యాయ్‌ సమ్మేళన్‌ సభలో రాహుల్‌ వివరణ ఇచ్చారు. ‘‘నాకు కులం మీద ఆసక్తి లేదు..కానీ న్యాయంపై ఉంది. అన్యాయం జరిగిన 90 శాతం దేశ జనాభాకు న్యాయం చేయాలనే ఆసక్తి ఉంది. వారికి న్యాయం చేయడమే నా జీవిత ధ్యేయం. దాన్నే మా మ్యానిఫెస్టోలో చేర్చాం. దేశంలోని 90 శాతం జనాభాకు అన్యాయం జరుగుతుండటాన్ని చూసి తట్టుకోలేకే కులగణన చేయాలని నిర్ణయించాం. దీనిపై అభ్యంతరాలు ఉండకూడదు. కేంద్రంలో మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటగా కులగణనను చేపడతాం. ఇది రాజకీయ అంశం కాదు. ఇది నా జీవిత ఆశయం’’ అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. దేశంలో ప్రధాని మోదీ సృష్టించిన ఆదాయ అసమానతలు, ఎక్స్‌రే లాంటి కులగణనపై స్పందించిన కాంగ్రెస్‌ విప్లవాత్మక మ్యానిఫెస్టోను చూసి మోదీ నిశ్చేష్టులవుతున్నారన్నారు.

‘‘దేశంలోని అగ్రశ్రేణి 200 కంపెనీల్లోని 25 కంపెనీలకు ప్రధాని మోదీ రూ. 16 లక్షల కోట్లు ఇచ్చారు. ఆ డబ్బుతో 25 సార్లు రైతుల రుణాలను మాఫీ చేసే అవకాశం ఉండేది. కానీ ఆ 25 మందికి ఇచ్చేందుకే మోదీ మొగ్గుచూపారు. 90 శాతం దేశ జనాభాకు ఎంతో కొంత మొత్తాన్ని కాంగ్రెస్‌ పార్టీ తిరిగి ఇవ్వబోతోంది’’ అని రాహుల్‌ పేర్కొన్నారు.  


అనుకోకుండా లాతూర్‌లో బస

రాహుల్‌ బుధవారం సాయంత్రం అనుకోని రీతిలో మహారాష్ట్రలోని లాతూర్‌లో బస చేయాల్సి వచ్చింది. స్థానిక విమానాశ్రయంలో రాత్రిపూట విమానాల రాకపోకలకు అవకాశం లేకపోవడం దీనికి కారణం. అమరావతి (మహారాష్ట్ర) నుంచి మధ్యాహ్నం లాతూర్‌కు వచ్చిన ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సోలాపుర్‌కు వెళ్లారు. సాయంత్రం ఆరుగంటలకు తిరిగి వచ్చారు. వాస్తవంగా ఆయన దిల్లీకి వెళ్లాలి. చీకటిపడ్డాక విమానాలు వెళ్లే వీల్లేక లాతూర్‌లోని హోటల్లో బస చేశారు. గురువారం ఉదయం దిల్లీ వెళ్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img