icon icon icon
icon icon icon

‘వారసత్వ పన్ను’పై రాజకీయ దుమారం

ఎండలతోనే కాకుండా సార్వత్రిక ఎన్నికల ప్రచారంతో దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కిన తరుణంలో ‘ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌’ అధ్యక్షుడు శాం పిట్రోడా షికాగోలో చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేకెత్తించాయి.

Published : 25 Apr 2024 04:16 IST

ఆర్జించిన సొమ్ములో వారసులకు 45 శాతమే
అమెరికాలో ఆ పద్ధతి  బాగుందన్న పిట్రోడా
మండిపడ్డ మోదీ, అమిత్‌షా, నిర్మల
పార్టీకి సంబంధం లేదు: కాంగ్రెస్‌

దిల్లీ: ఎండలతోనే కాకుండా సార్వత్రిక ఎన్నికల ప్రచారంతో దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కిన తరుణంలో ‘ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌’ అధ్యక్షుడు శాం పిట్రోడా షికాగోలో చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేకెత్తించాయి. అమెరికాలో వారసత్వ పన్ను (ఇన్‌హెరిటెన్స్‌ టాక్స్‌) అమల్లో ఉందని దీని ప్రకారం.. ఒక వ్యక్తి సంపాదనలో సుమారు 45 శాతమే అతని మరణానంతరం వారసులకు బదిలీ అవుతుందని, 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, ఇది తనకు న్యాయంగా అనిపిస్తోందని పిట్రోడా వ్యాఖ్యానించారు. ‘..ఇదో ఆసక్తికర చట్టం. దీని ప్రకారం మీ సంపాదనలో ప్రజల కోసం కొంత వదిలేయాలి. భారత్‌లో మాత్రం ఎవరైనా వెయ్యికోట్ల డాలర్లు సంపాదించి చనిపోతే ఆయన వారసులకు ఆ వెయ్యికోట్ల డాలర్లూ వస్తాయి. ప్రజలకు ఏమీ లభించదు. ఇది చర్చించాల్సిన విషయం. సంపద పునఃపంపిణీ గురించి మాట్లాడేటప్పుడు కొత్త విధానాల గురించి ఆలోచించాలి. అవి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉండాలి.. ధనవంతుల ప్రయోజనాల కోసం కాదు’ అని ఆయన పేర్కొన్నారు. పిట్రోడా వ్యాఖ్యలకు కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని కాంగ్రెస్‌ వివరణ ఇచ్చుకుంది.


ఇవి పౌరులకు న్యాయం చేస్తాయా?

-భాజపా

పిట్రోడా వ్యాఖ్యలపై భాజపా తీవ్రంగా మండిపడింది. అలాంటి విధానాలు పౌరులకు న్యాయం చేస్తాయా అని ప్రశ్నించింది. ఒక వ్యాపారవేత్త సంపదకు, ఒక రైతు సొత్తుకు మధ్య చాలాతేడా ఉంటుందని పేర్కొంది.


నేను చెప్పింది వక్రీకరించారు

-శాం

కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో గురించి ప్రధాని మోదీ చెబుతున్న అబద్ధాల నుంచి దృష్టి మళ్లించడానికి ప్రయత్నం జరుగుతోందని, ఒక వ్యక్తిగా ఒక టీవీ ఛానల్‌కు తాను చెప్పిన మాటల్ని ‘గోడీ మీడియా’ వక్రీకరించడం దురదృష్టకరమని పిట్రోడా ఎక్స్‌ వేదికగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ వస్తే ప్రజల మంగళసూత్రాలను, బంగారాన్ని దోచుకుంటుందని మోదీ చెప్పింది అవాస్తవమని, అలాగే 55 శాతం సంపద తీసుకుంటామని ఎవరూ అనలేదని వివరించారు. ‘ఇలాంటివి చేయాలని ఎవరు చెప్పారు? నేను యథాలాపంగా, ఒక ఉదాహరణగా మాత్రమే ప్రస్తావించాను. కాంగ్రెస్‌తో సహా ఏ పార్టీకీ దీనితో సంబంధం లేదు’ అని చెప్పారు. వారసత్వ పన్ను గురించి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి హోదాలో జయంత్‌ సిన్హా 2014లోనే చెప్పారని, ఆ తర్వాత కూడా ఆర్థిక మంత్రులు వాటి గురించి అనుకూలంగా మాట్లాడారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్‌ చెప్పారు.


చనిపోయినవారి ఆస్తుల్నీ వదలరట

-మోదీ

నిపోయిన వ్యక్తుల ఆస్తుల్నీ కాంగ్రెస్‌ దోచుకుంటుందని మోదీ తీవ్రంగా విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ మేరకు స్పందించారు. ‘‘మధ్యతరగతిపై మరిన్ని పన్నులు విధించాలని కొంతకాలం క్రితం యువరాజు, రాజకుటుంబ సలహాదారు చెప్పారు. యువరాజు తండ్రికీ ఆయనే సలహాదారు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా పొందిన సంపదపై పన్ను విధించాలని ఆయన బహిరంగంగా చెబుతున్నారు. మీరు చెమటోడ్చి కూడబెట్టిన సంపద.. మీ పిల్లలకు లభించదు. ప్రజలు బతికి ఉన్నప్పుడే కాకుండా మరణించిన తర్వాత కూడా వారి సొమ్మును దోచుకోవడం ఒక్కటే (జిందగీ కే సాథ్‌ భీ లూట్‌.. ఔర్‌ జిందగీ కే బాద్‌ భీ లూట్‌) ఆ పార్టీ సూత్రంలా ఉంది. కాంగ్రెస్‌ పార్టీని తమ పూర్వీకుల ఆస్తిగా ఆ వ్యక్తులు (గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి) భావిస్తున్నారు. దానిని వారి పిల్లలకు అందించారు. దేశ ప్రజలు తమ ఆస్తుల్ని పిల్లలకు ఇవ్వడానికి మాత్రం వారు ఇష్టపడట్లేదు. ప్రమాదకర ఉద్దేశాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’’ అని దుయ్యబట్టారు.


లాక్కొని ఎవరికిస్తారో తెలుసా?

‘మన విలువలే ఇన్నాళ్లూ మనల్ని పరిరక్షిస్తున్నాయి. మన తల్లిదండ్రులు, తాతముత్తాతలు తమకున్న కొద్దిపాటి ఆభరణాలను వారసుల కోసం భద్రంగా ఉంచేవారు. రుణాలు తీసుకోవడం, కష్టపడి సంపాదించి కొద్దికొద్దిగా డబ్బు కూడబెట్టుకోవడం ప్రజలకు అలవాటు. మన మూలాలను దెబ్బతీయాలని కాంగ్రెస్‌ చూస్తోంది. ప్రజల రిజర్వేషన్లపైనే కాకుండా ఆదాయం, ఆస్తిపాస్తులపైనా ఆ పార్టీ కళ్లు పడ్డాయి. ప్రతి ఇంటినీ, కప్‌బోర్డులను, ప్రతి కుటుంబాన్నీ ఎక్స్‌రే తీసి, ఆభరణాలు, మంగళసూత్రాలు వంటివాటిని లాక్కొని వాళ్లు ఎవరికి ఇస్తారో మీకు తెలుసా? ఆ పాపాన్ని చూస్తూ వదిలేయాలా?’ అని మోదీ ప్రశ్నించారు. మెజారిటీ ప్రజల ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని మైనారిటీలకు పంచాలన్న కాంగ్రెస్‌ బుజ్జగింపు రాజకీయాలకు పిట్రోడా వ్యాఖ్యలు నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు. వారసత్వ ఆస్తులపై పన్నువల్ల పేదలు, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలపై నీళ్లు జల్లినట్లవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఇలాంటి వ్యవస్థీకృత దోపిడీకి తెరలేస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img