icon icon icon
icon icon icon

మళ్లీ ప్రత్యేక ‘గూర్ఖాలాండ్‌’ వాదం!

లోక్‌సభ ఎన్నికల వేళ మరోసారి ప్రత్యేక గూర్ఖాలాండ్‌ రాష్ట్ర డిమాండు అంశం తెరపైకి వచ్చింది. దీంతో ఆయా పార్టీలు ఈసారి సమస్యకు ‘శాశ్వత పరిష్కారం’ చూపుతామని హామీ ఇస్తున్నాయి.

Updated : 25 Apr 2024 04:41 IST

లోక్‌సభ ఎన్నికల వేళ తెరపైకి..  
‘శాశ్వత’ పరిష్కారానికి పార్టీల హామీ

దార్జీలింగ్‌: లోక్‌సభ ఎన్నికల వేళ మరోసారి ప్రత్యేక గూర్ఖాలాండ్‌ రాష్ట్ర డిమాండు అంశం తెరపైకి వచ్చింది. దీంతో ఆయా పార్టీలు ఈసారి సమస్యకు ‘శాశ్వత పరిష్కారం’ చూపుతామని హామీ ఇస్తున్నాయి. 2014 ఎన్నికల వరకూ ప్రత్యేక గూర్ఖాలాండ్‌ అంశం ప్రధానంగా ఉన్నా.. 2019 నాటికి ఈ అంశం మరుగునపడింది. మళ్లీ ఈ ఎన్నికల్లో తెరపైకి వచ్చింది. 2019లో గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం), జీఎన్‌ఎల్‌ఎఫ్‌ లాంటి పార్టీలు అభివృద్ధి, ప్రజాస్వామ్య పునరుద్ధరణ వంటి అంశాలను తెరపైకి తెచ్చాయి. గత ఆరేళ్లలో ఇక్కడి రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు ఈ ప్రాంతంలో బలంగా ఉన్న జీజేఎం పూర్తిగా బలహీనపడింది. దార్జీలింగ్‌లో రెండో విడతలో భాగంగా ఈ నెల 26వ తేదీన పోలింగ్‌ జరగనుంది.

కొత్త పార్టీల రాకతో..

ఈ ప్రాంతంలో కొత్తగా రెండు పార్టీలు పుట్టుకొచ్చాయి. అందులో ఒకటి.. అజోయ్‌ ఎడ్వర్డ్స్‌ నేతృత్వంలోని హమ్రో పార్టీ. 2022లో జరిగిన దార్జీలింగ్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఈ పార్టీ విజయం సాధించింది.

  • అనిల్‌ థాపా నేతృత్వంలో భారతీయ గూర్ఖా ప్రజాతాంత్రిక్‌ మోర్చా (బీజీపీఎం) పేరుతో మరో పార్టీ ఏర్పాటైంది. ఈ పార్టీ 2022లో గూర్ఖాలాండ్‌ ప్రాంతీయ పాలక మండలి (జీటీఏ) ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.
  • ఈ రెండు పార్టీలు కనీస సౌకర్యాలు, జీవన ప్రమాణాల మెరుగుదలపై దృష్టి సారించాయి.

మళ్లీ ప్రత్యేక డిమాండ్‌

  • లోక్‌సభ ఎన్నికలు రావడంతో మళ్లీ ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తెరపైకి వచ్చింది. ఈ ప్రాంతానికి శాశ్వత పరిష్కారం అంశాన్ని పార్టీలు గుర్తు చేస్తున్నాయి.
  • వచ్చే ఐదేళ్లలో శాశ్వత పరిష్కారం చూపుతామని భాజపా హామీ ఇచ్చింది. ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభమైందని, ఐదేళ్లలో తుది పరిష్కారం లభిస్తుందని దార్జీలింగ్‌ నుంచి మళ్లీ ఎన్నిక కోసం ప్రయత్నిస్తున్న భాజపా అభ్యర్థి రాజు బిస్తా తెలిపారు. రాజ్యాంగానికి కట్టుబడి నిర్ణయం ఉంటుందని ఆయన చెప్పారు. అయితే అది ప్రత్యేక రాష్ట్రమేనా అనే అంశాన్ని ఆయన స్పష్టం చేయలేదు. 2009 నుంచి జీజేఎం మద్దతుతో ఈ సీటును భాజపా గెలుస్తూ వస్తోంది. ఈసారి శాశ్వత పరిష్కారం చూపకపోతే వచ్చే ఎన్నికల్లో భాజపాకు మద్దతు ఇవ్వబోమని జీజేఎం ప్రధాన కార్యదర్శి రోషన్‌ గిరి స్పష్టం చేశారు. శాశ్వత పరిష్కారం అంటే తమ ఉద్దేశంలో ప్రత్యేక గూర్ఖాలాండ్‌ అనే అని తేల్చి చెప్పారు.
  • బిమల్‌ గురుంగ్‌ నేతృత్వంలోని జీజేఎం ప్రత్యేక రాష్ట్రంపై తుది అల్టిమేటం ఇచ్చింది. కొండ ప్రాంత సమస్యకు స్పష్టమైన హామీ ఇస్తేనే భాజపాతో కలిసి పని చేస్తామని చెబుతోంది.
  • 2019లో దార్జీలింగ్‌ సీటును బిస్తా 4 లక్షలకుపైగా మెజారిటీతో గెలుచుకున్నారు. 59శాతం ఓట్లు ఆయనకు వచ్చాయి. 2017లో 104 రోజులపాటు జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా తృణమూల్‌ వేధింపులపై కోపంతో అప్పట్లో ప్రజలు బిస్తాకు మద్దతుగా నిలిచారు.

టీ, టూరిజానికి ప్రసిద్ధి

దార్జీలింగ్‌ ప్రాంతం టీ తోటలు, టూరిజం, కలప పరిశ్రమలకు ప్రసిద్ధి. ప్రత్యేక రాష్ట్రం కోసం ఇక్కడ 1980 నుంచి హింసాత్మక ఉద్యమాలు జరుగుతున్నాయి. చివరిసారిగా 2017లో 104 రోజులపాటు ఆందోళనలు సాగాయి. దార్జీలింగ్‌ ప్రాంతంలో గూర్ఖా వర్గంతోపాటు లేప్చాలు, షెర్పాలు, భూటియాలు ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌ నుంచి గూర్ఖాలాండ్‌ విడిపోవాలనే డిమాండు శతాబ్దం కిందటి నుంచి ఉన్నా 1986లో జీఎన్‌ఎల్‌ఎఫ్‌ నాయకుడు సుభాశ్‌ ఘీషింగ్‌ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించడంతో తీవ్ర రూపం దాల్చింది. 1988లో దార్జీలింగ్‌ గూర్ఖా హిల్‌ కౌన్సిల్‌ ఏర్పాటు సందర్భంగా జరిగిన హింసలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 2011 వరకూ కౌన్సిల్‌ కొనసాగింది. 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్‌ కాంగ్రెస్‌.. జీటీఏ ఏర్పాటు చేసింది. కేంద్రం, రాష్ట్రం, జీజేఎం మధ్య ఒప్పందంలో భాగంగా ఇది ఏర్పాటైంది. దీనికి గురుంగ్‌ నాయకత్వం వహించారు. ఆ తర్వాత మళ్లీ 2013లో, 2017లో ఉద్యమాలు జరిగాయి.

సొంత పార్టీ నుంచే పోటీ

ఈసారి బిస్తాపై భాజపా ఎమ్మెల్యే బిష్ణు ప్రసాద్‌ శర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీలు ఈ ప్రాంత సమస్యను సరిగా అర్థం చేసుకోవడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. రాజ్యాంగ పరిధిలోనే ఈ ప్రాంత సమస్యకు రాజకీయ పరిష్కారం చూపుతామని ఆయన చెబుతున్నారు.

  • కాంగ్రెస్‌, లెఫ్ట్‌, హమ్రో పార్టీ కూటమి తరఫున భారతీయ గూర్ఖా పరిసంఘ్‌ అధ్యక్షుడు మునీశ్‌ తమాంగ్‌ బరిలోకి దిగారు. గూర్ఖాలాండ్‌కు చెందిన న్యాయవాది అయిన ఆయన.. భాజపా ఇక్కడి ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తున్నారు.
  • బీజీపీఎంతో జట్టు కట్టిన తృణమూల్‌ తమ అభ్యర్థిగా మాజీ ఉన్నతాధికారి గోపాల్‌ లామాను పోటీకి నిలిపింది. తృణమూల్‌ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని ఆయన అంటున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img