icon icon icon
icon icon icon

ముస్లింల ఓట్ల కోసం బడుగుల రిజర్వేషన్లను గుంజుకుంటారు

ముస్లిం ఓటుబ్యాంకు కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బడుగువర్గాల రిజర్వేషన్లు గుంజుకునేలా రాజ్యాంగాన్ని మార్చాలన్నది ‘ఇండియా’ కూటమి విధానమని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు.

Updated : 26 Apr 2024 05:55 IST

ఆ మేరకు రాజ్యాంగాన్ని మారుస్తారు
ఇండియా కూటమిపై మోదీ ధ్వజం

మురైనా, ఆగ్రా, బరేలీ: ముస్లిం ఓటుబ్యాంకు కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బడుగువర్గాల రిజర్వేషన్లు గుంజుకునేలా రాజ్యాంగాన్ని మార్చాలన్నది ‘ఇండియా’ కూటమి విధానమని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ అనేకమంది ముస్లింలను అక్రమంగా ఓబీసీ జాబితాలో చేర్చిందని ఆరోపించారు. గురువారం మధ్యప్రదేశ్‌లోని మురైనా, యూపీలోని ఆగ్రా, షాజహాన్‌పుర్‌, బరేలీ సభల్లో మాట్లాడిన మోదీ కాంగ్రెస్‌పై మరోసారి నిప్పులు చెరిగారు. ‘‘నేను కూడా ఓబీసీ వర్గీయుణ్నే. కాంగ్రెస్‌ కర్ణాటక మోడల్‌ చూసి నేనే భయపడ్డా. ఇక సామాన్యుల మాటేమిటి?’’ అని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో యూపీలోనూ ఇదే ఆట ఆడాలని కాంగ్రెస్‌ చూస్తున్నట్లు తెలిపారు. ఓటుబ్యాంకు రాజకీయాల్లో పడి తనను ఎంతగానో నమ్ముకొన్న యాదవులకు, బీసీలకు అఖిలేశ్‌ పార్టీ ద్రోహం చేస్తోందన్నారు. ఈమధ్య ‘కామ్‌దార్‌’ (పనిమంతుడు) అయిన తనను దుర్భాషలాడుతూ ‘నామ్‌దార్‌’ (పేరున్న వ్యక్తి) యువరాజు ఆనందిస్తున్నారంటూ రాహుల్‌గాంధీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. యూపీలో ‘ఇద్దరు యువరాజులు’ బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని రాహుల్‌, అఖిలేశ్‌లపై విమర్శలు గుప్పించారు. దేశ వనరులపై ముస్లింలకు తొలిహక్కు ఉందని కాంగ్రెస్‌ అంటుండగా, పేదలకు ఉందని తాను అంటున్నట్లు మోదీ తెలిపారు. దేశ ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టి మతపరమైన బుజ్జగింపుల ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రమాదకరమైన ‘పంజా’ (కాంగ్రెస్‌ చిహ్నం) చూస్తోందన్నారు. దీన్ని అడ్డుకునేందుకే భాజపాకు 400 స్థానాలు కావాలని తాను కోరుతున్నట్లు మోదీ చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో జూన్‌ 4 తర్వాత తన ప్రభుత్వం వచ్చాక అవినీతిపరుల భరతం పడతానన్నారు.


ఇందిర సంపద కోసం వారసత్వ పన్నును రద్దుచేసిన రాజీవ్‌: ప్రధాని

రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నపుడు తన తల్లి ఇందిరాగాంధీ సంపద ప్రభుత్వపరం కాకుండా కాపాడుకునేందుకు 1985లో వారసత్వ హక్కును (ఎస్టేట్‌ సుంకం) రద్దు చేశారని నరేంద్ర మోదీ తెలిపారు. ఇందిర కుటుంబంలో నాలుగు తరాలు లబ్ధి పొందాక మళ్లీ ఇపుడు దేశ ప్రజలపై వారసత్వ పన్నును మరింత బలంగా రుద్దాలని కాంగ్రెస్‌ చూస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందిరాజీ తన ఆస్తిని కుమారుడు రాజీవ్‌గాంధీ పేరున రాసినట్లు అప్పట్లో చర్చలు జరిగాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల సంపాదనలో సగభాగాన్ని ‘ఎక్స్‌రే’ (సర్వే) చేసి మరీ ఈ పన్ను కింద లాక్కొంటుందని మోదీ హెచ్చరించారు. భాజపా ఉన్నంతవరకు ఈ పనిని జరగనివ్వబోమని.. ప్రజలకు, కాంగ్రెస్‌ పార్టీ లూటీ ప్రణాళికలకు మధ్య 56 అంగుళాల ఛాతీ గల ‘చౌకీదార్‌’ గోడలా నిలబడ్డాడని ప్రధాని అన్నారు. ఆర్థిక సర్వే ఒక్కటే కాదు.. దేశంలోని వివిధ సంస్థలు, కార్యాలయాలను కూడా సర్వే చేయాలని విపక్షం చూస్తున్నట్లు తెలిపారు. నాడు మత ప్రాతిపదికన దేశ విభజనకు అంగీకరించిన కాంగ్రెస్‌ పార్టీ తల్లి భారతి చేతులు తెగనరికిందని దుయ్యబట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img