icon icon icon
icon icon icon

కన్నడనాడు.. ఎవరికో గ్యారంటీ!

కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కన్నడసీమలో లోక్‌సభ ఎన్నికల తొలిదశ సమరం రెండు పార్టీలకూ ప్రతిష్ఠాత్మకంగా మారింది.

Updated : 26 Apr 2024 05:49 IST

నేడు 14 నియోజకవర్గాల్లో తొలివిడత
రెండు కూటములకూ కీలక సమరం

ఈనాడు, బెంగళూరు: కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కన్నడసీమలో లోక్‌సభ ఎన్నికల తొలిదశ సమరం రెండు పార్టీలకూ ప్రతిష్ఠాత్మకంగా మారింది. అసెంబ్లీ పోరు సాగిన ఏడాదిలోపే రెండు ప్రధాన పార్టీలూ మరోసారి తలపడుతున్నాయి. కాకపోతే ఆ ఎన్నికల్లో త్రిముఖ పోరు సాగితే ఇప్పుడు ద్విముఖ పోరే. అప్పట్లో జేడీ-ఎస్‌ విడిగా పోటీచేయగా ఈసారి భాజపాతో జట్టుకట్టి, ఉనికి చాటేందుకు పోరాడుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో గెలుచుకున్న 25 స్థానాలను మళ్లీ సాధించుకోవాలని భాజపా, ఈ లక్ష్యానికి గంటికొట్టాలని కాంగ్రెస్‌ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నాయి. మోదీ గ్యారంటీల పేరుతో భాజపా, ఐదు గ్యారంటీలంటూ కాంగ్రెస్‌.. ప్రచారం పూర్తిచేశాయి. 14 స్థానాల్లో కాంగ్రెస్‌ అన్నిచోట్లా పోటీ చేస్తుండగా ఎన్డీయే పక్షాలుగా భాజపా 11 చోట్ల, జేడీ-ఎస్‌ మూడుచోట్ల బరిలో ఉన్నాయి. గతసారి ఈ 14లో కాంగ్రెస్‌, జేడీ-ఎస్‌ ఒక్కో స్థానాన్నే గెలుచుకోగా మిగిలినవి భాజపా పరమయ్యాయి. ఈసారి బరిలో ఉన్న ప్రముఖుల్లో హెచ్‌.డి.కుమారస్వామి, శోభా కరంద్లాజె, సి.ఎన్‌.మంజునాథ, యదువీర్‌ కృష్ణదత్త చామరాజ వడియార్‌, డి.కె.సురేశ్‌, తేజస్వీసూర్య తదితరులు ఉన్నారు.


భాజపా: సామాజిక అస్త్రాలు

ప్రచారం కోసం ప్రధాని నాలుగుసార్లు రాష్ట్రానికి వచ్చి.. గత ఐదేళ్లలో అందించిన నిధులు, చేపట్టిన అభివృద్ధి పథకాలపై విస్తృత ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ హామీలు ఆచరణ సాధ్యం కానివంటూ- భాజపా గ్యారంటీలపై విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు. బెంగళూరులో చివరి పర్యటనలో సామాజిక అస్త్రాలను సంధించారు. స్వేచ్ఛగా ప్రార్థనలు చేయలేని స్థితిలో హిందువులు ఉంటారని, కాంగ్రెస్‌ వంటి ప్రమాదకారి పార్టీకి అవకాశం ఇవ్వొద్దని హెచ్చరించారు.


కాంగ్రెస్‌: అభయ హస్తం

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేసిన ఐదు గ్యారంటీలనే కాంగ్రెస్‌ ఈ ఎన్నికలకు రక్షగా భావిస్తోంది. జాతీయ స్థాయిలో ప్రకటించిన 25 గ్యారంటీలనూ ఈ ఎన్నికల్లో ప్రచారం చేసింది. పది నెలలుగా అమలుచేసిన పథకాల లబ్ధిదారులను విస్తృతంగా ప్రచారం చేసింది. ఎన్‌డీయే సర్కారు పదేళ్లలో రాష్ట్రానికి ఇచ్చింది శూన్యమంటూ ఖాళీ చెంబుతో ప్రచారం చేసింది. లౌకికవాదాన్ని పార్టీ విధానంగా ప్రకటించుకునే జేడీ-ఎస్‌.. భాజపాతో చేయి కలపటాన్ని విమర్శిస్తూ మైనారిటీల ఓట్లను రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.


ఎన్డీయే: దళపతులకు అండ

2019 ఎన్నికల్లో అప్పటి విపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, జేడీ-ఎస్‌ సమాజంలో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని మోదీ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో పరిస్థితి మారిపోయింది. 92 ఏళ్ల వయసులోనూ తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనేది మోదీని మళ్లీ ప్రధానిగా చూడడానికే అంటూ మాజీ ప్రధాని దేవెగౌడ ఇటీవల భావోద్వేగానికి లోనయ్యారు. తన లక్ష్యం కాంగ్రెస్‌ను ఓడించటమేనని ప్రచారం చేసిన జేడీ-ఎస్‌.. ఈ ఎన్నికల్లో మూడింటిలో కనీసం రెండైనా సాధించాలని చూస్తోంది.


తొలి విడత ఇలా..

మొత్తం స్థానాలు: 14

  • నియోజకవర్గాలు: ఉత్తర, కేంద్ర, దక్షిణ, గ్రామీణ బెంగళూరు; ఉడుపి - చిక్కమగళూరు, హాసన, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ, తుమకూరు, మండ్య, మైసూరు, చామరాజ నగర, చిక్కబళ్లాపుర, కోలారు
  • పోలింగ్‌ కేంద్రాలు : 30,602
  • ఓటర్లు : 2,88,19,342
  • పురుషులు : 1,44,28,099
  • మహిళలు : 1,43,88,176
  • ఇతరులు  : 3,067
  • అభ్యర్థులు : 247 (పురుషులు - 226, మహిళలు-21)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img