icon icon icon
icon icon icon

మాటల మంటలపై కదిలిన ఈసీ

ప్రధాని మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ విపక్షాలు చేసిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం (ఈసీ) పరిశీలనలోకి తీసుకుంది. దీనిపై భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డాకు గురువారం నోటీసు జారీ చేసింది.

Published : 26 Apr 2024 04:49 IST

భాజపా, కాంగ్రెస్‌ అధ్యక్షులకు నోటీసులు
మోదీ, రాహుల్‌, ఖర్గే పేర్లు ప్రస్తావించకుండానే జారీ
ప్రధానిపై ఫిర్యాదును పరిశీలనలోకి తీసుకోవడం ఇదే తొలిసారి

దిల్లీ: ప్రధాని మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ విపక్షాలు చేసిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం (ఈసీ) పరిశీలనలోకి తీసుకుంది. దీనిపై భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డాకు గురువారం నోటీసు జారీ చేసింది. రాజస్థాన్‌లో ప్రధాని మోదీ చేసిన వివాదాస్పద ప్రసంగంపై సోమవారం(ఈనెల 29)లోగా సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. ప్రధాని మోదీ పేరును ఆ నోటీసులో నేరుగా ప్రస్తావించకపోవడం గమనార్హం. అయితే, ఒక ప్రధాన మంత్రి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ వచ్చిన ఫిర్యాదులను ఈసీ పరిశీలనకు తీసుకోవడం ఇదే మొట్టమొదటి సారని సీనియర్‌ అధికారులు తెలిపారు. ఆ నోటీసుతో పాటు ప్రధాని మోదీ రాజస్థాన్‌ ప్రసంగంపై కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఐ(ఎం), పౌర సమాజ బృందాలు చేసిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం జత చేసింది. పార్టీ స్టార్‌ క్యాంపెయినర్ల రాజకీయ ప్రసంగాలు ఉన్నత ప్రమాణాలను పాటించేలా ఉండాలని భాజపా అధ్యక్షుడు నడ్డాకు ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని చిత్తశుద్ధితో పాటించేలా చూసుకోవాలని తెలిపింది. ఉన్నత పదవుల్లోని నేతలు చేసే ప్రసంగాలకు ప్రభావ తీవ్రత అధికంగా ఉంటుందని గుర్తు చేసింది. స్టార్‌ క్యాంపెయినర్ల వివాదాస్పద ప్రసంగాలపై చర్యలకు ఉపక్రమించే తొలి అడుగులో భాగంగా ఆయా పార్టీల అధ్యక్షులను బాధ్యులను చేయడానికి ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనలను ఈసీ వర్తింపజేస్తోంది.

2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రధాని మోదీపై విపక్షాలు ఫిర్యాదు చేయగా ఈసీ క్లీన్‌చిట్‌ ఇచ్చింది. అయితే, అప్పటి ఎలక్షన్‌ కమిషనర్‌ అశోక్‌ లావాసా ఈసీ నిర్ణయంపై తన అసమ్మతిని తెలిపారు.

కాంగ్రెస్‌కూ అదే తరహాలో నోటీసు

ప్రధాని మోదీ వివాదాస్పద ప్రసంగంపై భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డాకు నోటీసు పంపిన తరహాలోనే కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గేపై వచ్చిన ఫిర్యాదులపైనా ఈసీ స్పందించింది. హస్తం పార్టీ నేతల పేర్లు ప్రస్తావించకుండానే కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గేకు విడిగా నోటీసు పంపించింది. వారిపై భాజపా చేసిన ఫిర్యాదులను జత చేసింది. సోమవారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రాహుల్‌ గాంధీ కేరళలో చేసిన ప్రసంగాలపై, ప్రధాని మోదీపై వ్యాఖ్యలకు భాజపా తీవ్ర అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. దళితుడిననే కారణంతో తనను అయోధ్య రామాలయం ప్రారంభానికి ఆహ్వానించలేదంటూ ఖర్గే ఆరోపించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని భాజపా ఫిర్యాదులో పేర్కొంది.

ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందే: సీపీఎం

ప్రధాని మోదీ వివాదాస్పద ప్రసంగంపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వర్గం మనోభావాలను దెబ్బతీసినందుకు, విద్వేషాలను రెచ్చగొట్టినందుకు ప్రధానిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఈసీని కోరారు.


ప్రధానిపై ఫిర్యాదులకు జాగ్రత్తగా స్పందించిన ఈసీ : జైరాం రమేశ్‌

ప్రధాని మోదీపై ఫిర్యాదుల విషయానికి వచ్చే సరికి ఎన్నికల సంఘం చాలా చాలా జాగ్రత్తగా స్పందించిందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ వ్యాఖ్యానించారు. ఈసీ నోటీసులపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వినియోగిస్తున్న భాష.. ప్రజాప్రాతినిధ్య చట్టం, సుప్రీంకోర్టు తీర్పులను తీవ్రంగా ఉల్లంఘించేలా ఉంటోందన్నారు. ‘మరికొందరు భాజపా అభ్యర్థులు చేస్తున్న ప్రసంగాలపైనా ఫిర్యాదు చేశాం. ఈసీ నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. కాంగ్రెస్‌ పార్టీకి ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇస్తామ’ని జైరాం రమేశ్‌ తెలిపారు. మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, అటల్‌ బిహారీ వాజ్‌పేయీ, మన్మోహన్‌ సింగ్‌లపై ఎన్నడూ ఈసీకి ఫిర్యాదులు రాలేదని గుర్తు చేశారు. ప్రధాని మోదీపై ఫిర్యాదు చేయడం ఇది రెండోసారని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img