icon icon icon
icon icon icon

అమేఠీ నుంచీ రాహుల్‌ పోటీ?

ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ కంచుకోటలైన అమేఠీ, రాయ్‌బరేలీలలో ఆ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది.

Updated : 26 Apr 2024 04:51 IST

రాయ్‌బరేలీలో ప్రియాంక!
నేడో రేపో ప్రకటించే అవకాశం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ కంచుకోటలైన అమేఠీ, రాయ్‌బరేలీలలో ఆ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది. అమేఠీ నుంచి రాహుల్‌ గాంధీ, రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు స్థానాల్లో ప్రచారం ప్రారంభించడానికి ముందు శ్రీరాముడి పూజల నిమిత్తం వీరు అయోధ్యలో నూతన రామాలయానికి వెళ్లనున్నట్లు సమాచారం. జనవరి 22న జరిగిన బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్‌ దూరంగా ఉండడంపై అధికారపక్షం పెద్దఎత్తున విమర్శలు చేస్తూ వస్తోంది. ఎన్నికల ప్రచారంలో దానినో ప్రధానాంశంగా ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్‌, ప్రియాంక అక్కడికి వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఐదో విడతలో భాగంగా మే 20న పోలింగ్‌ జరిగే స్థానాల్లో ఈ రెండూ ఉన్నాయి. నామినేషన్‌ దాఖలుకు మే 3 వరకు గడువు ఉంది.  రాహుల్‌, ప్రియాంక వేర్వేరు రోజుల్లో నామపత్రాలు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. కేరళలోని వయనాడ్‌ నుంచి రాహుల్‌ పోటీచేస్తున్న విషయం తెలిసిందే. రెండో విడతలో భాగంగా అక్కడ శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. అది ముగిసిన తర్వాత అమేఠీపై కాంగ్రెస్‌ అధికారిక ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. 2004 నుంచి వరుసగా మూడుసార్లు అమేఠీకి ప్రాతినిధ్యం వహించిన రాహుల్‌.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ ఓటమిపాలయ్యారు. అప్పుడు భాజపా నుంచి నెగ్గిన స్మృతి ఇరానీ ప్రస్తుత ఎన్నికల్లోనూ అదే స్థానంలో పోటీ చేస్తున్నారు. రాయ్‌బరేలీకి 2004 నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించి ఇటీవల రాజ్యసభకు ఎన్నికవ్వడంతో ఆ స్థానం నుంచి ప్రియాంక పోటీ చేస్తారని ప్రచారంలో ఉంది. సోదరి వరసయ్యే ప్రియాంకపై రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయడానికి భాజపా ఎంపీ వరుణ్‌గాంధీ నిరాకరించారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతవరకు ఆ పార్టీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించలేదు.

ఎన్నికలు మోదీ చేజారిపోయాయి: రాహుల్‌

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలు కమలం చేజారిపోయాయన్నది ప్రధాని నరేంద్రమోదీకి తెలుసునని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. తమ పార్టీ ఇస్తున్న గ్యారంటీలకు, మోదీ గ్యారంటీలకు మధ్య స్పష్టమైన తేడా ఉందన్నారు. ‘భారతీయుల ప్రభుత్వం’ (గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియన్స్‌) ఏర్పాటుకు కాంగ్రెస్‌ హామీ ఇస్తోందని గురువారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. పేద మహిళలకు నెలకు రూ.8,500 ఇవ్వడం, యువతకు ఏటా రూ.లక్ష లభించే ఉద్యోగాలు కల్పించడం, 30 లక్షల ఖాళీల భర్తీ, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత వంటి హామీలను తాము ఇస్తున్నామని గుర్తుచేశారు. ‘‘మోదీ మాత్రం అదానీ సర్కారు ఏర్పాటుకు హామీ ఇస్తున్నారు. దేశ సంపద అంతా కొద్దిమంది బిలియనీర్ల జేబుల్లోకి వెళ్తుంది. విరాళాల వ్యాపారంతో దోచుకుంటారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి పాతర వేస్తారు. రైతులకు రుణాలందవు. రెండు పార్టీల హామీల మధ్య తేడా సుస్పష్టం’’ అని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, దీనిలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని ఆయన మరో వీడియో సందేశంలో ఓటర్లను కోరారు. ప్రజల అంశాలతో మ్యానిఫెస్టోను తాము రూపొందించామని, దానిలో ప్రజావాణి ఉందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img