icon icon icon
icon icon icon

‘అసత్యమేవ జయతే’కు ప్రతీక ప్రధాని మోదీ

ప్రధాని మోదీ మాట్లాడటానికి నోరు తెరిచిన ప్రతిసారీ తన అబద్ధాలకు, సంకుచిత ఆలోచనలకు కొత్త ఆధారాలు చూపిస్తుంటారని కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది.

Published : 26 Apr 2024 05:33 IST

1985 నాటి వి.పి.సింగ్‌ ప్రసంగాన్ని షేర్‌ చేసిన కాంగ్రెస్‌

దిల్లీ: ప్రధాని మోదీ మాట్లాడటానికి నోరు తెరిచిన ప్రతిసారీ తన అబద్ధాలకు, సంకుచిత ఆలోచనలకు కొత్త ఆధారాలు చూపిస్తుంటారని కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. మోదీ ‘అసత్యమేవ జయతే’కు ప్రతీకగా నిలుస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భాజపా తయారుచేసిన పిచ్‌పై తాము ఆడబోమని అన్నారు. మాజీ ప్రధాని ఇందిర ఆస్తులపై మోదీ విమర్శలను ఉటంకిస్తూ ఇందిరాగాంధీ అలహాబాద్‌లోని తన పూర్వీకుల ఆస్తిని 1970లోనే జవహర్‌లాల్‌ నెహ్రూ స్మారకనిధికి ఇచ్చారని గుర్తు చేశారు. 1985లో ఎస్టేట్‌ సుంకాన్ని రద్దు చేస్తూ నాటి ఆర్థికమంత్రి వి.పి.సింగ్‌ చేసిన బడ్జెట్‌ ప్రసంగంలోని ముఖ్యభాగాన్ని ‘ఎక్స్‌’ ద్వారా ఆయన షేర్‌ చేశారు. ‘‘వ్యక్తుల ఆస్తులకు సంబంధించి సంపద పన్ను, ఎస్టేట్‌ సుంకం పేరిట రెండు వేర్వేరు చట్టాల ఉనికి విధానపరమైన వేధింపులకు సమానం. ఈ రెండు చట్టాల ఫలితాలను పరిశీలించాక సంపద అసమాన పంపిణీని తగ్గించడం, రాష్ట్రాల అభివృద్ధి పథకాలకు ఆర్థికసహాయం చేయడమనే రెండు లక్ష్యాలను ఎస్టేట్‌ సుంకం చేరుకోలేకపోయినట్లు స్పష్టమవుతోంది. ఎస్టేట్‌ సుంకం మీద వచ్చే రాబడి కంటే దాని నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంది. కాబట్టి, ఈ సుంకాన్ని రద్దు చేయాలని ప్రతిపాదిస్తున్నాను’’ అని వి.పి.సింగ్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వాస్తవానికి అరుణ్‌జైట్లీ, జయంత్‌ సిన్హా వంటి భాజపా నేతలు వారసత్వ హక్కుకు అనుకూలంగా వాదించినట్లు జైరాం రమేశ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img