icon icon icon
icon icon icon

భాజపా దుర్గం గుజరాత్‌!

భాజపాకు పెట్టని కోట గుజరాత్‌.. 1998 నుంచి ఆ పార్టీ రాష్ట్రంలో అప్రతిహత విజయాలను సాధిస్తూ వస్తోంది. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో 26 సీట్లకు 26 సీట్లనూ గెలుచుకుని చరిత్ర సృష్టించింది.

Published : 27 Apr 2024 04:51 IST

1998 నుంచీ కమలదళానికి పట్టం 
మళ్లీ క్లీన్‌స్వీప్‌నకు అవకాశం!
సూరత్‌ ఏకగ్రీవంతో బోణీ
మిగిలిన 25 చోట్ల మే 7న పోలింగ్‌

భాజపాకు పెట్టని కోట గుజరాత్‌.. 1998 నుంచి ఆ పార్టీ రాష్ట్రంలో అప్రతిహత విజయాలను సాధిస్తూ వస్తోంది. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో 26 సీట్లకు 26 సీట్లనూ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది. మరోసారి అదే మ్యాజిక్‌తో లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ క్లీన్‌స్వీప్‌నకు సిద్ధమవుతోంది. వాస్తవానికి మధ్యలో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇచ్చింది. కానీ ఆ తరువాత మళ్లీ చతికిలపడింది. అప్పటి నుంచీ ఇక కోలుకోలేకపోయింది. మూడో విడతలో భాగంగా మే 7వ తేదీన రాష్ట్రంలోని 25 నియోజకవర్గాలకు (ఒక చోట ఏకగ్రీవం) ఒకేసారి పోలింగ్‌ జరగనుంది. మొత్తం 26 సీట్లలో భాజపా పోటీ చేస్తుండగా.. పొత్తులో భాగంగా 24 సీట్లలో కాంగ్రెస్‌, 2 చోట్ల ఆమ్‌ ఆద్మీ పార్టీ పోటీ చేస్తున్నాయి.

  •  గత ఎన్నికల్లో 26 నియోజకవర్గాల్లోనూ లక్షకుపైగా మెజారిటీలతోనే భాజపా గెలిచింది.
  •  2019 ఎన్నికల్లో భాజపా సాధించిన అత్యల్ప మెజారిటీ 1,27,596. అత్యధిక మెజారిటీ 6,89,668.  

తొలి విజయం

పోలింగ్‌కు ముందే సూరత్‌ లోక్‌సభ నియోజకవర్గంలో భాజపా తొలి విజయం సాధించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి నీలేశ్‌ కుంభానీ నామినేషన్‌ను తిరస్కరించడం, స్వతంత్ర అభ్యర్థులు సహా ఇతరులంతా ఉపసంహరించుకోవడంతో భాజపా అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి సంతకాలు చేసిన ముగ్గురు ప్రతిపాదకులు తమ సంతకాలను ఫోర్జరీ చేశారని అడ్డం తిరగడంతో నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. మిగిలిన స్వతంత్ర అభ్యర్థులతో భాజపా మాట్లాడి ఉపసంహరింపజేసింది. దీంతో ఈ సీటు ఏకగ్రీవమైంది. మరోవైపు నీలేశ్‌ భాజపాతో కుమ్మక్కై ఇలా చేశారని పేర్కొంటూ ఆయనను కాంగ్రెస్‌ పార్టీ బహిష్కరించింది.


ప్రాంతాల వారీగా..

గుజరాత్‌లో నాలుగు ప్రాంతాలున్నాయి. అవి..

1. సౌరాష్ట్ర, కచ్‌, 2. ఉత్తర గుజరాత్‌,
3. దక్షిణ గుజరాత్‌, 4.మధ్య గుజరాత్‌.

  • 8 లోక్‌సభ నియోజకవర్గాలున్న సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతం ఎంతోకాలంగా భాజపాకు అండగా నిలుస్తోంది.
  • ఉత్తర గుజరాత్‌లో వీఐపీ నియోజకవర్గమైన గాంధీనగర్‌తోపాటు 7 స్థానాలున్నాయి. అహ్మదాబాద్‌లోని రెండు నియోజకవర్గాలూ ఇందులోకే వస్తాయి.
  • మధ్య గుజరాత్‌లో 6 నియోజకవర్గాలున్నాయి. ఇందులో వడోదరా, దాహోద్‌, పంచమహల్‌, ఛోటా ఉదయ్‌పుర్‌ వస్తాయి. ఈ ప్రాంతంలో గిరిజనుల ఓట్లు భాజపాకు కీలకం.
  •  దక్షిణ గుజరాత్‌లో 5 సీట్లున్నాయి. ఇందులో సూరత్‌, భరూచ్‌, నవ్‌సారీ ఉన్నాయి. గుజరాత్‌ భాజపా అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ నవ్‌సారీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి భాజపా గతంలో భారీ మెజారిటీతో గెలిచింది.
  •  భరూచ్‌లో ఈసారి పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఆప్‌ పోటీ చేస్తోంది. ఆ పార్టీకి కాంగ్రెస్‌ మద్దతిస్తోంది. ఇక్కడ పోటీ చేసేది కూడా ఈ ప్రాంత గిరిజనుల్లో బాగా పట్టున్న, ఎమ్మెల్యేగా గెలిచిన ఛైతర్‌ వసావా. ఆయన ఇక్కడ పలుమార్లు గెలిచిన భాజపా అభ్యర్థి మన్‌సుఖ్‌ వసావాతో పోటీ పడుతున్నారు.

కొన్నిచోట్ల అసంతృప్తి ఉన్నా..

భాజపా అభ్యర్థుల ఎంపికపై కొన్ని చోట్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది. అమ్రేలీ, రాజ్‌కోట్‌, సాబర్‌ కాంఠా, సురేంద్ర నగర్‌, వడోదరాలలో అభ్యర్థుల ఎంపిక తీరును పార్టీ వర్గాలతోపాటు ఓటర్లు తప్పుబడుతున్నారు. ఈ అసంతృప్తులను మోదీ బ్రాండ్‌, పరిపాలన, సైద్ధాంతిక మద్దతు వంటి అంశాలతో భాజపా తట్టుకోగలదని విశ్లేషకులు చెబుతున్నారు.


బ్రాండ్‌ మోదీ

గుజరాత్‌లో బ్రాండ్‌ మోదీ అధికంగా పనిచేస్తోంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరినీ ప్రచారం చేయకుండానే 182 సీట్లలో 156 స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. ఇది మోదీ ప్రభావంవల్లేననేది నిర్వివాదాంశం. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఆప్‌ విడివిడిగా పోటీ చేశాయి. అయితే ఆ రెండు పార్టీలకు పోలైన ఓట్లను కలిపినా భాజపాకు అధికంగా వచ్చాయి. 1995 నుంచి గుజరాత్‌లో వరుసగా 7 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా గెలిచింది. 2027లో ప్రస్తుత అసెంబ్లీ ముగిసేనాటికి గుజరాత్‌లో భాజపా 32 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంటుంది. పశ్చిమ బెంగాల్‌లో 1977 నుంచి 2011 వరకూ 34 ఏళ్ల పాలించిన లెఫ్ట్‌ కంటే ఇది రెండేళ్లే తక్కువ.


పటేల్‌ల మద్దతు

గుజరాత్‌లో పటేల్‌లు (పాటీదార్‌) భాజపాకు గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. దీంతో ఆ పార్టీ సునాయాస విజయాలను సాధిస్తోంది. దీనికి కారణం 1980లో అప్పటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి మాధవ్‌సిన్హ్‌ సోలంకి. ఆయన క్షత్రియులు, దళితులు, ఆదివాసీలు, ముస్లింలను కేహెచ్‌ఏం పేరుతో దగ్గరికి తీశారు. ఇది పటేల్‌లకు ఆగ్రహం తెప్పించింది. వారు భాజపాకు దగ్గరయ్యారు. అప్పటి నుంచి ఆ పార్టీ వెంటే నడుస్తున్నారు. 2017లో మాత్రం హార్థిక్‌ పటేల్‌.. పాటీదార్‌లకు రిజర్వేషన్లు కోరుతూ ఆందోళనలు చేపట్టి కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 99 స్థానాలే గెలుచుకుంది. ప్రస్తుతం హార్థిక్‌ పటేల్‌ భాజపాలో ఉన్నారు.

  •  రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమ సమయంలో అగ్ర కులాల వారికి భాజపా మద్దతుగా నిలిచింది. బ్రాహ్మణులు, పటేల్‌లు, బనియాలు, క్షత్రియులు ఇందులో ఉన్నారు. వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు మద్దతుగా నిలిచింది. ఆ తర్వాత హిందుత్వ అంశం తెరపైకి రావడంతో భాజపా దానిని అందిపుచ్చుకుంది.
  •  ప్రస్తుతం జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ హిందుత్వతోపాటు భాజపా సోషల్‌ ఇంజినీరింగ్‌ పనిచేసే అవకాశమే కనిపిస్తోంది.

కీలక నియోజకవర్గాలివే..

గాంధీనగర్‌

అత్యధిక పట్టణ ప్రాంత ఓటర్లున్న గాంధీ నగర్‌ సీటు వీఐపీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి వాజ్‌పేయీ, ఆడ్వాణీ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి కేంద్ర హోం మంత్రి, భాజపాలో, ప్రభుత్వంలో నంబర్‌ 2గా ఉన్న అమిత్‌ షా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థిపై 5.57 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంతకంటే ఎక్కువ మెజారిటీని ఈసారి అమిత్‌ షా ఆశిస్తున్నారు.

పోర్‌బందర్‌

పటేల్‌ సామాజిక వర్గంలోని ఉప వర్గమైన లెవూవా పాటీదార్లు అధికంగా ఉన్న పోర్‌బందర్‌లో 1991 నుంచి భాజపా గెలుస్తూ వస్తోంది. మధ్యలో ఒకసారి 2009 మాత్రమే కాంగ్రెస్‌ గెలిచింది. ఇక్కడి నుంచి కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయాను భాజపా పోటీకి నిలిపింది. ఆయన లవూవా పాటీదార్‌ వర్గానికి చెందినవారే. భావ్‌నగర్‌కు చెందిన ఆయన ఇప్పటిదాకా రాజ్యసభకు ఎన్నికవుతూ వచ్చారు. తొలిసారిగా లోక్‌సభ బరిలోకి దిగారు.

రాజ్‌కోట్‌

2009 మినహా 1989 నుంచి రాజ్‌కోట్‌లో భాజపా గెలుస్తూ వస్తోంది. ఈ నియోజకవర్గంలోనూ లెవూవా పాటీదార్లు అధికంగా ఉన్నారు. భాజపా తరఫున పురుషోత్తం రూపాలా బరిలో ఉన్నారు. ఆయన కడవా పాటీదార్‌ వర్గానికి చెందినవారు. రూపాలా సౌరాష్ట్రలోని అమ్రేలీ జిల్లాకు చెందినవారు.

భరూచ్‌

గిరిజనుల ప్రాబల్యమున్న భరూచ్‌లో కాంగ్రెస్‌ మద్దతుతో ఆప్‌ అభ్యర్థి, డేడియాపడా ఎమ్మెల్యే ఛైతర్‌ వసావా పోటీ చేస్తున్నారు. ఆయన 1999 నుంచి ఎంపీగా గెలుస్తూ వస్తున్న మన్‌సుఖ్‌ వసావాతో తలపడుతున్నారు. గత ఎన్నికల్లో మన్‌సుఖ్‌కు 3.3 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. గతంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ నాలుగు సార్లు గెలిచారు.

 ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img