icon icon icon
icon icon icon

రెండోవిడతలో 63.5% పోలింగ్‌

దేశంలో సార్వత్రిక ఎన్నికల రెండోదశలో సుమారు 63.5% మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పూర్తి సమాచారం వచ్చాక ఇది మరికొంత పెరిగే అవకాశం ఉంది.

Updated : 27 Apr 2024 06:37 IST

88 స్థానాల్లో పూర్తయిన ప్రక్రియ
స్వల్ప ఘటనలు మినహా దాదాపు ప్రశాంతం

దిల్లీ, ఈనాడు-బెంగళూరు: దేశంలో సార్వత్రిక ఎన్నికల రెండోదశలో సుమారు 63.5% మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పూర్తి సమాచారం వచ్చాక ఇది మరికొంత పెరిగే అవకాశం ఉంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. దాదాపు 65.5 శాతం పోలింగ్‌ నమోదైంది. రెండో విడత కింద 13 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 నియోజకవర్గాలకు శుక్రవారం నిర్వహించిన పోలింగ్‌ చాలావరకు ప్రశాంతంగానే ముగిసింది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలింగ్‌ బహిష్కరణ వంటివి కొన్నిచోట్ల కనిపించాయి. శతాధిక వృద్ధులు, ఆసుపత్రుల్లోని రోగులు సయితం ఉత్సాహంగా స్పందించి ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లేలా చేశారు. కొంతమంది ఉదయాన్నే పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లారు. మధ్యాహ్నం వేడిమి ఎక్కువగా ఉండడంతో అనేకమంది సాయంత్రం చల్లబడ్డాక ఇళ్లనుంచి బయటకు వచ్చారు. 6 గంటలకు పోలింగ్‌ ముగియాల్సి ఉన్నా, ఆ సమయంలోపు ఆయా కేంద్రాలకు చేరుకున్నవారంతా ఓటువేసేందుకు అవకాశం ఉండటంతో ఆ తర్వాత కూడా పోలింగ్‌ కొనసాగింది.

ఈవీఎంలలో లోపాలు

ఛత్తీస్‌గఢ్‌లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా కారణాల రీత్యా మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్‌ ముగించారు. కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో కొన్ని పోలింగ్‌ బూత్‌ల ఈవీఎంలలో లోపాలు తలెత్తాయి. ఆ రెండు రాష్ట్రాల్లో బోగస్‌ ఓట్ల ఆరోపణలూ వచ్చాయి. బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న 41 మంది రోగులు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటేసేందుకు ఆస్పత్రి యాజమాన్యంతో పాటు ప్రభుత్వ అధికార యంత్రాంగం సహకరించింది.  దక్షిణ కన్నడ జిల్లా బెల్థంగడి తాలూకాలోని మారుమూల గ్రామంలో 111 మంది ఓటర్లలో అందరూ ఓట్లు వేయడంతో అక్కడ 100% పోలింగ్‌ నమోదైనట్లయింది.  చామరాజనగర జిల్లాలో రెండువర్గాల మధ్య ఘర్షణలో ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌, కాంకేర్‌లలో 46 గ్రామాలవారు తమ సొంతగ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల్లో తొలిసారి ఓటువేశారు.

   కేరళలో ఓటు వేశాక 8 మంది మృతి

కేరళలోని పాలక్కాడ్‌, అలప్పుజ, మలప్పురం తదితర చోట్ల ఓటువేసి వచ్చాక వడదెబ్బ తగలడం వంటి కారణాలతో 8 మంది చనిపోయారు.ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్‌ స్థానంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఎన్నికల విధులకు వచ్చిన మధ్యప్రదేశ్‌ ప్రత్యేక సాయుధ దళం జవాను ఒకరు తన సర్వీసు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మత ప్రాతిపదికన ఓట్లు అడుగుతూ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేసినందుకు బెంగళూరు దక్షిణ నియోజకవర్గ భాజపా అభ్యర్థి తేజస్వీ సూర్యపై కేసు నమోదైంది. ప్రతిసారీ బెంగళూరులో నాలుగు స్థానాల్లో నమోదయ్యే పోలింగ్‌ కంటే 10శాతం అదనంగా ఓటర్లు ఈసారి పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చారు.  


రాష్ట్రాల వారీగా పోలింగ్‌ శాతం

అస్సాం 71.11, బిహార్‌ 55.08, ఛత్తీస్‌గఢ్‌ 73.62, జమ్మూకశ్మీర్‌ 71.91, కర్ణాటక 69.23, కేరళ 65.91, మధ్యప్రదేశ్‌ 57.88, మహారాష్ట్ర 57.83, మణిపుర్‌ 77.32, రాజస్థాన్‌ 64.07, త్రిపుర 79.46, ఉత్తరప్రదేశ్‌ 54.85, పశ్చిమబెంగాల్‌ 71.84 శాతం చొప్పున పోలింగ్‌ నమోదు చేశాయి. తొలిదశలో తమిళనాడు, ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, మేఘాలయ, అండమాన్‌-నికోబార్‌, మిజోరం, నాగాలాండ్‌, పుదుచ్చేరి, సిక్కిం, లక్షద్వీప్‌లలో పోలింగ్‌ ముగిసింది. తాజాగా రెండోదశ ఎన్నికలతో కేరళ, రాజస్థాన్‌, త్రిపురల్లో పోలింగ్‌ ముగిసినట్లయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img