icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో హిందువులకు అన్యాయం

ముస్లింలీగ్‌ ముద్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టో ద్వారా హిందువులకు తలపెట్టిన అన్యాయం బట్టబయలైందని ప్రధాని  మోదీ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Updated : 27 Apr 2024 06:35 IST

బిహార్‌ ర్యాలీలో ప్రధాని మోదీ

అరరియా, ముంగేర్‌(బిహార్‌)/ బరేలీ (యూపీ): ముస్లింలీగ్‌ ముద్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టో ద్వారా హిందువులకు తలపెట్టిన అన్యాయం బట్టబయలైందని ప్రధాని  మోదీ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం బిహార్‌లోని అరరియా, ముంగేర్‌ ఎన్నికల ర్యాలీల్లో ఆయన మాట్లాడారు. కర్ణాటకలో ఓబీసీల రిజర్వేషన్లలో కోత పెట్టి ముస్లింలకు లబ్ధి చేకూర్చాలని చూసిన కాంగ్రెస్‌ కుట్రపై మిత్రపక్షమైన ఆర్జేడీ ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు. ‘‘ఓబీసీగా వెనుకబడిన తరగతుల కష్టాలు నాకు తెలుసు. భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకూ గండి కొట్టాలని వారు చూస్తారు. నాటి మన్మోహన్‌ ప్రభుత్వం సైతం ముస్లిం రిజర్వేషన్లకు ‘ఆమోదం’ తెలిపింది. రిజర్వేషన్లను ఓటుబ్యాంకు రాజకీయాలకు మళ్లించే ప్రయత్నాన్ని నేను అనుమతించను. ఇది మోదీ గ్యారంటీ. అందుకే కాంగ్రెస్‌ నేతలు నన్ను బెదిరించాలని విఫలయత్నం చేస్తున్నారు’’ అని ప్రధాని తెలిపారు. యూపీలోని బరేలీలోనూ శుక్రవారం మోదీ రోడ్‌ షో నిర్వహించారు.  


యువత జీవితాలతో టీఎంసీ చెలగాటం

మాల్దా (పశ్చిమబెంగాల్‌): మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం 26,000 మంది బెంగాలీ యువత జీవితాలతో చెలగాటమాడుతోందని ప్రధాని మోదీ మండిపడ్డారు. శుక్రవారం పశ్చిమబెంగాల్‌లోని మాల్దాలో నిర్వహించిన  సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పాఠశాలల ఉద్యోగాల నియామకాల్లో జరిగిన భారీ కుంభకోణంపై మమత సర్కారును తప్పుబట్టారు. కలకత్తా హైకోర్టు ఈ నియామకాలను కొట్టివేయడంతో అప్పులు చేసి టీఎంసీ నేతలకు లంచాలు చెల్లించి ఉద్యోగాల్లో చేరినవారు ఇప్పుడు వీధిన పడ్డారన్నారు. ‘‘ఒకప్పుడు దేశం మొత్తానికి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో బెంగాల్‌ ఆదర్శంగా నిలిచింది. తొలుత వామపక్ష కూటమి, తర్వాత టీఎంసీ ప్రభుత్వాలు ఇక్కడి అభివృద్ధిని పూర్తిగా కుంటుపడేలా చేశాయి. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) టీఎంసీ, కాంగ్రెస్‌ రెండూ వ్యతిరేకిస్తున్నాయి. బంగ్లాదేశ్‌ చొరబాటుదారులు ఇక్కడ స్థిరపడేలా టీఎంసీ ప్రభుత్వం కృషి చేస్తోంది. మీ (ప్రజల) సంపదను వారికి పంచాలని కాంగ్రెస్‌ పార్టీ చూస్తోంది’’ అని మోదీ విరుచుకుపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img