icon icon icon
icon icon icon

హస్తినలో తెలుగు వెలుగులు

భారత పార్లమెంటులో తెలుగువారిది ఘన చరిత్ర. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్‌, ఉభయసభల్లో ప్రతిపక్ష నేతల వంటి అత్యున్నత పదవులన్నీ మనవారిని వరించాయి.

Updated : 27 Apr 2024 06:34 IST

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అత్యున్నత పదవులన్నీ దాసోహం

ఈనాడు, దిల్లీ: భారత పార్లమెంటులో తెలుగువారిది ఘన చరిత్ర. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్‌, ఉభయసభల్లో ప్రతిపక్ష నేతల వంటి అత్యున్నత పదవులన్నీ మనవారిని వరించాయి. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌ పదవులతో తెలుగుజాతి కీర్తికిరీటానికి వన్నెలద్దితే.. ఎం.వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టి చట్టసభలకు సమయం నేర్పారు. రాజకీయ చాణక్యుడిగా పేరొందిన పీవీ నరసింహారావు ప్రధానమంత్రి పీఠాన్ని, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత పదవిని అధిష్ఠించగా.. దళిత బిడ్డ జీఎంసీ బాలయోగి లోక్‌సభ స్పీకర్‌ పదవిని అలంకరించారు. తెలుగు జాతి ఘనతను హస్తిన వేదికగా వారు చాటిచెప్పారు. ఇందిరాగాంధీ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఓబీసీ నేత పి.శివశంకర్‌ రాజ్యసభపక్ష నేతగా, ఆ సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా పనిచేశారు. అద్భుత వాగ్ధాటితో పార్లమెంటు చర్చలకు విలువ పెంచిన ఎస్‌.జైపాల్‌రెడ్డి  కూడా రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించి దిల్లీలో తెలుగువారి ప్రాబల్యాన్ని పదునెక్కించారు. దేశంలో వీపీ సింగ్‌ హయాంలో ఏర్పడిన తొలి సంకీర్ణ ప్రభుత్వ కూటమి అయిన నేషనల్‌ ఫ్రంట్‌కు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు ఛైర్మన్‌గా వ్యవహరించి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు.


రాష్ట్రపతిగా ఏకగ్రీవ ఎన్నిక

రాష్ట్రపతి పదవికి ఇప్పటివరకూ ఏకగీవ్రంగా ఎన్నికైన నాయకుడు మన నీలం సంజీవరెడ్డి ఒక్కరే. 1967లో హిందూపురం లోక్‌సభ స్థానంలో గెలిచిన ఆయన.. ఆ వెంటనే స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1969 వరకు ఆ పదవిలో కొనసాగారు. జాకీర్‌ హుస్సేన్‌ మరణంతో కాంగ్రెస్‌ ఆయన్ను తమ అధికారిక అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలో దింపింది. ఆయన అభ్యర్థిత్వం నచ్చని ఇందిరాగాంధీ.. ఆత్మప్రబోధానుసారం ఓటేయాలని పార్టీ సభ్యులకు పిలుపునిచ్చారు. దాంతో నీలం ఓడిపోయారు. స్వతంత్ర అభ్యర్థి వీవీ గిరి గెలిచారు. అనంతరం నీలం క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలగి అనంతపురం వెళ్లిపోయారు. జయప్రకాశ్‌ నారాయణ్‌ పిలుపునందుకొని 1975లో మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి జనతా పార్టీలో చేరారు. ఆత్యయిక స్థితి అనంతరం 1977లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి జనతా పార్టీ తరఫున గెలిచిన ఏకైక అభ్యర్థిగా నిలిచి, లోక్‌సభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే ఏడాది ఫకృద్దీన్‌ అలీఅహ్మద్‌ మరణంతో రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లోనూ ఏకగీవ్రంగా విజయం సాధించారు. రెండుసార్లు స్పీకర్‌, ఒకసారి రాష్ట్రపతి పదవి చేపట్టిన అరుదైన రికార్డూ నీలంకే సొంతం.


తొలి తెలుగు స్పీకర్‌ అనంతశయనం అయ్యంగార్‌

లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన తొలి తెలుగు నేత మాడభూషి అనంతశయనం అయ్యంగార్‌. తిరుచానూరులో జన్మించిన ఈయన.. తొలి లోక్‌సభ ఎన్నికల్లో తిరుపతి నుంచి, రెండో లోక్‌సభ ఎన్నికల్లో చిత్తూరు నుంచి గెలుపొందారు. 1952లో లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 1956లో జీవీ మావలంకర్‌ మరణం తర్వాత అయ్యంగార్‌ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1962 ఏప్రిల్‌ 16 వరకు ఆ పదవిలో కొనసాగారు.


ప్రధానిగా నవభారత నిర్మాణం

తెలుగువారి వరపుత్రుడు భారతరత్న పీవీ నరసింహారావు. అపార రాజకీయ, సాహిత్య జ్ఞానం ఆయన సొంతం. సౌమ్యంగా వ్యవహరిస్తూనే కీలక పదవులను అధిష్ఠించారు. రాజీవ్‌ హత్యానంతరం కాంగ్రెస్‌లో ఏర్పడిన నాయకత్వ శూన్యతను చాకచక్యంతో అందిపుచ్చుకొని 1991 నుంచి 1996 వరకు ప్రధాని పదవిని చేపట్టారు. తెలుగువారి  శక్తిసామర్థ్యాలను చాటిచెప్పారు. సాహసోపేత ఆర్థిక సంస్కరణలతో దేశ ముఖచిత్రాన్ని మార్చేశారు. నవభారత నిర్మాతగా చరిత్రలో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు. 1996లో కాంగ్రెస్‌ ఓడిపోయిన తర్వాత వాజ్‌పేయీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో 15 రోజులపాటు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగానూ పీవీ వ్యవహరించారు.  


అట్టడుగు నుంచి లోక్‌సభ స్పీకర్‌ స్థాయికి..

తూర్పు గోదావరి జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టి పెరిగి లోక్‌సభ స్పీకర్‌ స్థాయి వరకు ఎదిగిన దళిత బిడ్డ బాలయోగి. 1998లో తెలుగుదేశం పార్టీ తరఫున లోక్‌సభకు ఎన్నికై స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి సభాపతి పదవిని అలంకరించారు. పదవిలో ఉండగానే 2002 మార్చి 3న హెలికాప్టర్‌ ప్రమాదంలో ఆయన అర్ధంతరంగా కన్నుమూయడం తెలుగువారి దురదృష్టం.

ఉపరాష్ట్రపతిగా బలమైన ముద్ర

వర్తమాన రాజకీయాల్లో తెలుగువారి ప్రాభవం తగ్గిపోతున్న దశలో ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టి దిల్లీలో తెలుగువారి గౌరవాన్ని పెంచిన వ్యక్తి ఎం.వెంకయ్యనాయుడు. 2017 నుంచి 2022 వరకు ఆ పదవిలో కొనసాగారు. రాజ్యసభ ఛైర్మన్‌గా ఆ సభ గౌరవాన్ని ఇనుమడింపజేశారు. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి ముద్రను బలంగా వేశారు. 1978లో ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. ఉపరాష్ట్రపతి హోదాలో క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలిగినా ప్రజాజీవితంలో ఇంకా చురుగ్గానే వ్యవహరిస్తున్నారు.


రాజ్యసభలో ప్రతిపక్ష నేతలుగా ఇద్దరు

రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేతలుగా పనిచేసిన తెలుగువారిగా పి.శివశంకర్‌, ఎస్‌.జైపాల్‌రెడ్డి ఖ్యాతి గడించారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ మంత్రివర్గాల్లో అత్యంత ప్రభావశీల మంత్రుల్లో ఒకరిగానూ శివశంకర్‌ పేరుపొందారు. 1988-89 మధ్య శివశంకర్‌ రాజ్యసభపక్ష నేతగానూ విధులు నిర్వర్తించారు. గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడిగా ఉండటంతో.. 1989లో కాంగ్రెస్‌ ఓడిపోయిన తర్వాత రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఏడాదిపాటు ఆ హోదాలో విధులు నిర్వహించారు.

1991లో కేంద్రంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనతా పార్టీ తరఫున జైపాల్‌రెడ్డి రాజ్యసభలో ఏడాదిపాటు ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత కొన్నేళ్లకు కాంగ్రెస్‌లో చేరి కేంద్రమంత్రిగా పనిచేశారు.


తెదేపా అరుదైన ఘనత

లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన ఏకైక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం గుర్తింపు పొందింది. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో దేశవ్యాప్తంగా వీచిన సానుభూతి పవనాలతో  కాంగ్రెస్‌ 414 సీట్లు దక్కించుకొని రాజీవ్‌గాంధీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎన్టీఆర్‌ పదవీచ్యుతుడవడం వెనుక ఇందిర హస్తం ఉందన్న కోపం వల్ల ఆమె హత్య తాలూకు సానుభూతి ప్రభావం కనిపించలేదు. ఆ ఎన్నికల్లో ఏపీలోని 42 స్థానాల్లో తెలుగుదేశం 30 గెల్చుకుంది. కాంగ్రెస్‌ తర్వాత అతిపెద్ద పార్టీగా తెదేపా ఆవిర్భవించి.. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించింది. ఆదిలాబాద్‌లో గెలిచిన ఆ పార్టీ ఎంపీ సి.మాధవరెడ్డి ప్రతిపక్షనేతగా వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img