icon icon icon
icon icon icon

ఎడ్లబళ్లలో.. చక్రాల కుర్చీల్లో.. నిబద్ధత చాటుకున్న ఓటర్లు

కదల్లేని పరిస్థితుల్లో ఉన్నా చక్రాల కుర్చీల్లో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చినవారు ఒకరైతే, ఎడ్లబళ్లలో తరలివచ్చి హక్కు వినియోగించుకున్నవారు మరికొందరు. ఎండ పెరిగితే కష్టమని భావించి ఉదయాన్నే ఓటు వేయడానికి వచ్చినవారు ఇంకొందరు.

Updated : 27 Apr 2024 06:31 IST

బెంగళూరులో ఓటు వేసినవారికి దోశ, లడ్డూ ఫ్రీ
పోలింగ్‌ బూత్‌లకు రావాలంటూ అగ్రనేతల పిలుపు

దిల్లీ: కదల్లేని పరిస్థితుల్లో ఉన్నా చక్రాల కుర్చీల్లో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చినవారు ఒకరైతే, ఎడ్లబళ్లలో తరలివచ్చి హక్కు వినియోగించుకున్నవారు మరికొందరు. ఎండ పెరిగితే కష్టమని భావించి ఉదయాన్నే ఓటు వేయడానికి వచ్చినవారు ఇంకొందరు. ఓటు వేసినట్లు వేలికి సిరాగుర్తు చూపిస్తే అల్పాహారం ఉచితంగా తీసుకోవచ్చని అవకాశం ఇచ్చిన రెస్టారెంట్లు మరికొన్ని. లోక్‌సభ ఎన్నికల రెండోదశ కింద శుక్రవారం పోలింగ్‌ జరిగిన ప్రాంతాల్లో ఇలాంటి భిన్న దృశ్యాలు కనిపించాయి.

రెస్టారెంట్ల ముందు బారులు

ఓటువేసి వచ్చినవారికి బెంగళూరు నగరంలోని వివిధ హోటళ్లు దోశ, లడ్డూ, కాఫీతో పాటు ఇతర ఆహార పదార్థాలను ఉచితంగా లేదా తక్కువ ధరకు అందించాయి. దీంతో పలు రెస్టారంట్ల వద్ద భారీసంఖ్యలో జనం బారులుదీరారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. బేకరీలు, వినోద కేంద్రాలు, పార్కులు, కొన్ని టాక్సీ సర్వీసులు 20-30 శాతం రాయితీ ఇచ్చాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరులో పోలింగ్‌ 54% దాటకపోవడంతో ఈసారి కొత్త ఆలోచనలతో చాలామంది ముందుకు వచ్చారు.

క్యూలో నిర్మలా సీతారామన్‌

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బెంగళూరులోని పోలింగ్‌బూత్‌ వద్ద క్యూలో నిల్చొని ఓటు వేశారు. మాజీ క్రికెటర్లు రాహుల్‌ ద్రవిడ్‌, అనిల్‌ కుంబ్లే, ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి, కేంద్రమంత్రి శోభా కరంద్లాజె తదితరులు ఇదే నగరంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. వేర్వేరు రాష్ట్రాల్లో ఓట్లు వేసిన ప్రముఖుల్లో విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా, రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ కుటుంబం, పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ శెకావత్‌, మళయాళ నటుడు సురేశ్‌ గోపి తదితరులున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో ఓ పోలింగ్‌ కేంద్రాన్ని పెళ్లిమంటపంలా అలంకరించారు. సంప్రదాయ వివాహ క్రతువుల్ని అక్కడ ప్రదర్శించారు. కాంకేర్‌తో పాటు రాజ్‌నంద్‌గావ్‌, మహాసముంద్‌ లోక్‌సభ స్థానాల్లో సంప్రదాయ దుస్తుల్లో పలువురు వధూవరులు హాజరై ఓటువేశారు. యూపీలోని బులంద్‌శహర్‌లో మహిళా ఓటర్లు డోలు వాయించుకుంటూ ఎడ్లబళ్లలో వచ్చారు. రాజస్థాన్‌లో 108 ఏళ్ల వృద్ధురాలు, జమ్మూ-కశ్మీర్‌లో 102 ఏళ్ల వృద్ధుడు తమ వయసును లెక్కచేయకుండా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. రాజస్థాన్‌లోని జాలోర్‌లో ఒకే కుటుంబంలో మూడుతరాలకు చెందిన ఓటర్లు (తాత, తండ్రి, మనవడు) హాజరై అందరినీ ఆకట్టుకున్నారు. మహారాష్ట్రలోని అమరావతిలో ఓటు వేయడానికి భాజపా అభ్యర్థి నవనీత్‌ రాణా తన భర్తతో కలిసి బైక్‌పై వచ్చారు.


ఓటును గుర్తుచేసేలా గూగుల్‌ డూడుల్‌

ఆయా సందర్భాలకు తగ్గట్టు హోంపేజీని తీర్చిదిద్దే గూగుల్‌ ఈసారి ఓటును గుర్తుచేసే చిహ్నాన్ని ప్రదర్శించింది. చేతి చూపుడువేలుకు సిరాముద్ర కనిపించేలా ఏర్పాటు చేసింది. తమ ప్రాంతంలో అభివృద్ధి పనులు జరగకపోవడాన్ని నిరసిస్తూ మహారాష్ట్రలోని పర్భణీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర, తూర్పు త్రిపుర నియోజకవర్గాల పరిధిలో కొందరు గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. చేతితో రూపొందించిన పట్టువస్త్రాలను ప్రోత్సహించాలంటూ కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలో ఎనిమిది మంది ఎన్నికల అధికారిణులు ప్రత్యేక చీరలు ధరించి విధులు నిర్వర్తించారు. ‘ఎన్నికల పర్వం.. దేశానికి గర్వం’ అనే అర్థమిచ్చే కన్నడ నినాదాన్ని వాటిపై అల్లారు.


బలోపేతం చేయాలని ఒకరు.. కాపాడుకోవాలని ఇంకొకరు.. 

ఓటర్లంతా పెద్దఎత్తున తరలి రావాలంటూ పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు ప్రధాని నరేంద్రమోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తమతమ సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా పిలుపునిచ్చారు. ‘మీ ఓటు మీ వాణి. పెద్దఎత్తున పోలింగ్‌ జరిగితే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. ముఖ్యంగా యువత, మహిళలు స్పందించాలి’ అని ప్రధాని కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ముందుకు రావాలంటూ ఖర్గేతో పాటు రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని, రాజ్యాంగాన్ని కాపాడే సైనికుల్లా నిలవాలని ఖర్గే కోరారు. తదుపరి సర్కారు కొద్దిమంది కుబేరులతో ఏర్పడాలా, 140 కోట్ల మంది భారతీయులతోనా అనేది మీ ఓటు నిర్ణయిస్తుందని దేశ పౌరులకు రాహుల్‌ చెప్పారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓట్లు వేయాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img