icon icon icon
icon icon icon

భాజపా, కాంగ్రెస్‌.. నువ్వానేనా!

దేశంలోకెల్లా అతిచిన్న రాష్ట్రమైన గోవాలో సార్వత్రిక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రంలో రెండు లోక్‌సభ స్థానాలు (ఉత్తర గోవా, దక్షిణ గోవా) ఉన్నాయి.

Updated : 28 Apr 2024 07:05 IST

గోవాలోని రెండు స్థానాల్లోనూ హోరాహోరీ

దేశంలోకెల్లా అతిచిన్న రాష్ట్రమైన గోవాలో సార్వత్రిక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రంలో రెండు లోక్‌సభ స్థానాలు (ఉత్తర గోవా, దక్షిణ గోవా) ఉన్నాయి. రెండుచోట్లా భాజపా, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. వికసిత్‌ భారత్‌, మోదీ గ్యారంటీల ప్రస్తావనతో కమలనాథులు ప్రచారంలో దూసుకుపోతుండగా.. కాంగ్రెస్‌ అభ్యర్థులు తమ పార్టీ గ్యారంటీలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పార్లమెంటులో తమ వాణికి అంతగా ప్రాధాన్యం దక్కడం లేదంటూ కొన్నేళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న గోవా ప్రజలు ఈ దఫా ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది.


ఉత్తర గోవా: పాత పోరు

ఇది భాజపాకు కంచుకోట! ఆ పార్టీ తరఫున కేంద్రమంత్రి శ్రీపాద్‌ నాయక్‌ (71) మరోసారి పోటీ చేస్తున్నారు. పాతికేళ్లుగా ఇక్కడ ఆయనదే విజయం. అయితే దీర్ఘకాలంగా అధికారంలో ఉండటంతో నియోజకవర్గ ప్రజల్లో ఆయనపై కొంత వ్యతిరేకత పెరిగింది! స్థానికంగా కొందరు ఎమ్మెల్యేలు కూడా ఆయనకు పెద్దగా సహకరించడం లేదని తెలుస్తోంది. వరుసగా ఆరోసారి విజయం సాధించాలన్న ఆయన ప్రయత్నాలకు ఇవి కొంత విఘాతం కలిగించేవే. అయితే మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ (ఎంజీపీ) మద్దతు ఉండటం నాయక్‌కు కలిసొచ్చే విషయం. కాంగ్రెస్‌ ఇక్కడ 77 ఏళ్ల కేంద్ర మాజీ మంత్రి రమాకాంత్‌ ఖలప్‌కు టికెట్‌ ఇచ్చింది. ఆయన 1999లో ఇదే స్థానంలో శ్రీపాద్‌ నాయక్‌పై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అప్పటికి ఖలప్‌ సిట్టింగ్‌ ఎంపీ. పాతికేళ్ల తర్వాత నాయక్‌, ఖలప్‌ ఉత్తర గోవాలో మరోసారి ముఖాముఖి తలపడుతుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు- రెవల్యూషనరీ గోవన్స్‌ పార్టీ తరఫున 39 ఏళ్ల మనోజ్‌ పరబ్‌ బరిలో నిలిచారు. సీనియర్‌ నేతలకు తాను గట్టి పోటీ ఇస్తున్నానని, భాజపా కంచుకోటను బద్ధలు కొట్టి విజయం సాధిస్తానని ఆయన ధీమాగా చెబుతున్నారు.


దక్షిణ గోవా: యువ జోరు

ఇది కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానం. అయితే ఈ దఫా ఇక్కడ భాజపా, కాంగ్రెస్‌ రెండూ కొత్తవారిని బరిలో దింపాయి. మీడియా రంగంలో ఉన్న పల్లవి డెంపోకు కమలదళం టికెట్‌ ఇచ్చింది. ఆమె పారిశ్రామికవేత్తల కుటుంబం నుంచి వచ్చారు. పల్లవి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆలయాలు, చర్చిలను ఎక్కువగా సందర్శిస్తున్నారు. అభివృద్ధి, ప్రధాని మోదీ విజన్‌ గురించి ప్రసంగాల్లో తరచూ ప్రస్తావిస్తున్నారు. నౌకాదళంలో కెప్టెన్‌గా పనిచేసిన విరియాటో ఫెర్నాండెజ్‌ ఇక్కడ హస్తం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రజాగళాన్ని పార్లమెంటులో బలంగా వినిపిస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గోవాను నాశనం చేస్తోందంటూ మండిపడుతున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మద్దతు ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం.


ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img