icon icon icon
icon icon icon

వలస నేతలకే టికెట్లు

లోక్‌సభ ఎన్నికల టికెట్లలో ఒడిశాలోని ప్రధాన రాజకీయ పార్టీలు వలస నేతలకే ప్రాధాన్యమిచ్చాయి.

Updated : 28 Apr 2024 07:03 IST

ఒడిశాలో బిజద, భాజపాల తీరిదీ..
లోక్‌సభ ఎన్నికల్లో వారికే చోటు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల టికెట్లలో ఒడిశాలోని ప్రధాన రాజకీయ పార్టీలు వలస నేతలకే ప్రాధాన్యమిచ్చాయి. ఇలా వచ్చిన వారికి అలా టికెట్లు కేటాయించాయి. రాష్ట్రంలో బిజూ జనతాదళ్‌ (బిజద), భాజపాలు రెండూ వలస నేతలకే ప్రాధాన్యమివ్వడం గమనార్హం. అందులో కీలక నియోజకవర్గాలున్నాయి.


నవీన్‌ పట్నాయక్‌ పాలనా వైఫల్యాలపై విమర్శలు చేస్తూ బిజద పక్కలో బల్లెంలా మారిన భువనేశ్వర్‌ భాజపా సిటింగ్‌ ఎంపీ అపరాజిత సారంగిని ఓడించాలన్న లక్ష్యంతో ఆమెకు ప్రత్యర్థిగా ఎవర్ని నిలబెట్టాలన్న దానిపై సీఎం గట్టి కసరత్తు చేశారు. పార్టీ నుంచి 12 మంది అగ్ర నేతలు ఆసక్తి కనబరిచినా చివరకు కాంగ్రెస్‌ అగ్ర నేత సురేష్‌ రౌత్రాయి చిన్న కుమారుడు సిద్ధార్థ రౌత్రాయికు టికెట్‌ ఖరారు చేశారు. ప్రైవేటు విమానయాన సంస్థలో పైలట్‌గా పని చేసి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన సిద్ధార్థను నవీన్‌ పార్టీలో చేర్చుకుని భువనేశ్వర్‌ అభ్యర్థిగా చేశారు.


బొలంగీర్‌లో సురేంద్ర రాణిస్తారా?

పశ్చిమ ఒడిశాలోని మరో కీలకమైన బొలంగీర్‌ లోక్‌సభ పరిధిలోని ఓటర్లు ప్రతిసారీ రాజ పరివారానికి చెందిన వారినే ఆదరిస్తున్నారు. ఇక్కడ భాజపా తరఫున బరిలోకి దిగుతున్నవారే ఎన్నికవుతున్నారు. సిటింగ్‌ ఎంపీ సంగీతా కుమారి సింగ్‌దేవ్‌ను భాజపా మళ్లీ అభ్యర్థిగా నిలిపింది. బొలంగీర్‌ రాణిగా ప్రజల్లో ఆమెకు ఆదరణ ఉంది. ఈ స్థానంలో సంగీత మరిది, యువరాజు కాళికేష్‌ నారాయణ్‌ సింగ్‌దేవ్‌ను బిజద నుంచి నిలపాలని నవీన్‌ నిర్ణయించారు. ఇంతలో కాంగ్రెస్‌ వీడి వచ్చిన మాజీ మంత్రి సురేంద్ర సింగ్‌ బోయ్‌కు సీటు కేటాయించారు.


అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సంబల్‌పూర్‌

రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా గమనిస్తున్న సంబల్‌పూర్‌ సీటు ఈసారి ఎవరిపరం కానుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. పదిహేనేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సంబల్‌పూర్‌ భాజపా అభ్యర్థిగా రంగంలోకి దిగారు. నవీన్‌ ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేస్తున్న ధర్మేంద్రను ఓడించడానికి తీవ్రంగా ఆలోచించిన నవీన్‌ రాజకీయాల్లో ఘనాపాటిగా ఖ్యాతి ఉన్న బిజద రాజకీయ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి ప్రణవ ప్రకాష్‌ దాస్‌ అలియాస్‌ బొబిని నిలబెట్టారు.


పూరీ ప్రతిష్ఠాత్మకం

ప్రతిష్ఠాత్మక పూరీ లోక్‌సభ స్థానంలో గతసారి భాజపా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈసారి ఆ స్థానాన్ని ఎలాగైనా నిలుపుకోవాలన్న ధ్యేయంతో ఉంది. బహుముఖ ప్రజ్ఞాశాలి, భాజపా జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రను మళ్లీ అభ్యర్థిగా చేసింది. అధికారంలో లేకపోయినా గడిచిన ఐదేళ్లు సంబిత్‌ పూరీ వాసులకు సేవలందించారు. పూరీ సిటింగ్‌ (బిజద) ఎంపీ పినాకి మిశ్ర ఎన్నికైన తర్వాత ప్రజలకు దూరమయ్యారు. హస్తినకే పరిమితమయ్యారు. ఆయన పట్ల వ్యతిరేకత ఉందని గమనించిన సీఎం మహారాష్ట్ర ఐపీఎస్‌ క్యాడర్‌ మాజీ అధికారి అరూప్‌ పట్నాయక్‌ను నిలబెట్టారు. ఈయన పూరీ వాసి.


రాజకీయాల్లో ఘనాపాటి భర్తృహరి

మాజీ సీఎం దివంగత హరేకృష్ణ మెహతాబ్‌ కుమారుడు భర్తృహరి మెహతాబ్‌ ఆరు సార్లు కటక్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. బిజద ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన ఆయన రాజకీయాల్లో ఘనాపాటిగా ముద్రపడ్డారు. ఒడిశా నుంచి వెలువడుతున్న ప్రముఖ ఒడియా దినపత్రిక ‘ప్రజాతంత్ర’కు భర్తృహరి ప్రధాన సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో భర్తృహరి తన పత్రికలో బిజద వైఫల్యాలను ఎండగట్టి అధినేతకు కొరకరాని కొయ్యగా మారారు. ఆయనకు ఈసారి బిజద టికెట్‌ దక్కకపోవచ్చన్న అంచనాల మధ్య భర్తృహరి ఆ పార్టీ వీడి కషాయం కండువా ధరించి కటక్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన దూకుడుకు అడ్డుకట్ట వేసే నేత ఎవరన్న దానిపై కసరత్తు చేసిన సీఎం పారిశ్రామిక రంగంలో ప్రతిభాశాలిగా ఖ్యాతి గాంచిన సంతృప్తి మిశ్రను పార్టీలోకి చేర్చుకుని బరిలోకి దించారు.


బ్రహ్మపురకు భృగు

మరో ప్రతిష్ఠాత్మక బ్రహ్మపుర స్థానంలో సిట్టింగ్‌ ఎంపీ చంద్రశేఖర్‌ సాహును కాదని భాజపా నుంచి వచ్చిన భృగుబక్షి పాత్రను బిజద అభ్యర్థిగా నవీన్‌ ప్రకటించారు. గతంలో బిజదలో అగ్ర నేతగా చలామణి అయిన గోపాల్‌పూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ప్రదీప్‌ కుమార్‌ పాణిగ్రహిని పార్టీ నుంచి తొలగించిన తర్వాత ఆయన కాషాయం కండువా ధరించారు. మంత్రిగా పని చేసిన ప్రదీప్‌ సీఎంకు సవాల్‌ విసిరారు. దీంతో ప్రదీప్‌ను భాజపా బ్రహ్మపుర బరిలో దించింది. ప్రస్తుత ఎన్నికల్లో కండువాలు మార్చిన ప్రదీప్‌, భృగుల మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది.


కేంద్రపాడా ఈసారి ఎవరో?

కేంద్రపాడాలో క్రితంసారి భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త బైజయంత్‌ పండా మళ్లీ అభ్యర్థి అయ్యారు. నవీన్‌ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా గుర్తింపు ఉన్న బైజయంత్‌ గతంలో బిజదలో అగ్రనేత, 2014 నుంచి 2019 వరకు కేంద్రపడ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన బైజయంత్‌కు తర్వాత కాలంలో సీఎంతో సంబంధాలు సన్నగిల్లాయి. భాజపాలో చేరిన ఆయన గతసారి పోటీచేసి ఓడిపోయారు. ఈసారి మళ్లీ బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ నుంచి బిజదలోకి వచ్చిన అంశుమన్‌ మహంతిని నవీన్‌ నిలబెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img