icon icon icon
icon icon icon

రాయ్‌బరేలీ, అమేఠీలకు ఇంకా ఖరారుకాని కాంగ్రెస్‌ అభ్యర్థులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేఠీ లోక్‌సభ స్థానాల కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది.

Published : 28 Apr 2024 04:52 IST

మరికొన్ని రోజులు పడుతుందన్న మల్లికార్జున ఖర్గే

గువాహటి: ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేఠీ లోక్‌సభ స్థానాల కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. శనివారమే పోటీదారుల పేర్లు ప్రకటించే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఇందుకు మరికొన్ని రోజుల సమయం పడుతుందని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. అస్సాంలోని గువాహటిలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇందుకోసం మీరు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. క్షేత్రస్థాయి నుంచి అభ్యర్థుల పేర్లు నా దగ్గరకు రావాలి. సంబంధిత నోటిఫికేషన్‌పై నేను సంతకం చేయాలి. తర్వాత పేర్లను ప్రకటిస్తాం’’ అని బదులిచ్చారు. అమేఠీకి బదులుగా కేరళలోని వయనాడ్‌ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేస్తుండటాన్ని భాజపా విమర్శించడంపై స్పందిస్తూ.. ‘‘నియోజకవర్గాలను మార్చడంపై మా పార్టీని ప్రశ్నిస్తున్న వారు.. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ, ఎల్‌కే ఆడ్వాణీలు ఎన్నిసార్లు సీట్లు మార్చుకున్నారో కూడా చెప్పాలి’’ అని కమలదళం నేతలను ప్రశ్నించారు.


అబద్ధాల ముఠాకు మోదీ సర్దార్‌

బార్‌పేట: తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను ముస్లింలీగ్‌ ఎన్నికల ప్రణాళికతో భాజపా పోల్చడంపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. మోదీ అబద్ధాలిక పనిచేయవని అన్నారు. ఆయన ఇక్కడ ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ.. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ప్రభుత్వ విభాగాల్లో 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. అబద్ధాల ముఠాకు సర్దార్‌గా మోదీని అభివర్ణించారు. ‘‘ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ చెప్పారు. నల్లధనాన్ని వెలికితీసి ఒక్కో పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి అబద్ధాలిక ఏ మాత్రం పనిచేయవు’’ అని ఖర్గే పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img