icon icon icon
icon icon icon

ముక్కలైన నాన్న మృతదేహాన్ని నాడు ఇంటికి తెచ్చుకున్నాం

దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన తనతండ్రి.. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా ఆనాడు ఇంటికి తీసుకురావాల్సి వచ్చిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆవేదన వ్యక్తంచేశారు.

Published : 28 Apr 2024 04:53 IST

ఎన్నికల సభలో ప్రియాంక భావోద్వేగం

వల్సాద్‌: దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన తనతండ్రి.. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా ఆనాడు ఇంటికి తీసుకురావాల్సి వచ్చిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం గుజరాత్‌లోని వల్సాద్‌లో ధరంపుర్‌ గ్రామంలో ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. తన నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్‌గాంధీలతో పాటు పలువురు ప్రధానులను తాను చూశానని, ప్రస్తుత పీఎం నరేంద్రమోదీ అంతగా ప్రజలకు అబద్ధాలు చెప్పేవారిని చూడలేదని ప్రియాంక చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఇంటింటినీ ఎక్స్‌రే తీసి, మహిళల మంగళసూత్రాలనూ లాక్కొని ముస్లింలకు పంపిణీ చేస్తుందని మోదీ చెప్పడాన్ని ఖండించారు. ‘మా ఇంటినుంచి వచ్చినవారే కాకుండా మన్మోహన్‌సింగ్‌ను చూసినా ప్రధానిగా మన దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. కాంగ్రెసేతర నేతలను పరిశీలిస్తే వాజ్‌పేయీ కూడా ఎంతో హుందాఅయిన వ్యక్తి. మోదీలా అబద్ధాలు చెప్పే ప్రధానిని మొదటిసారి చూస్తున్నా. ప్రజల ముందు మాట్లాడుతున్నప్పుడు నిజాలు చెప్పాలనే ఆలోచనైనా ఆయనకు లేదు. మంగళసూత్రాలను లాక్కొని మరొకరికి ఇచ్చేయడం సాధ్యమేనా? కాంగ్రెస్‌ ప్రకటించిన న్యాయ మ్యానిఫెస్టోతో ఆయనకు ఇబ్బందేమిటి? ఆయనలో నమ్మకం సడలిపోయిందా’ అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేలా రాజ్యాంగాన్ని మార్చేసే ఉద్దేశంతోనే మోదీ 400 సీట్ల లక్ష్యం పెట్టుకున్నారని ఆరోపించారు.

అధిక ధరలకు మోదీ మారుపేరు

ప్రధాని మోదీ అంటే అధిక ధరలకు మారుపేరు అని ప్రియాంక విమర్శించారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఒంటిచేత్తో మోదీ ఆపగలరని భాజపా నాయకులు అభివర్ణిస్తున్నారని, అలాంటప్పుడు దేశంలో పేదరికాన్ని ఆయన ఎందుకు తొలగించలేకపోతున్నారని ఆమె ప్రశ్నించారు. ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనే ప్రజలు అనేక బాధలు పడుతున్నారని చెప్పారు. ప్రధాని ఈ ప్రాంతానికి వస్తే దీనిపై నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కోసమే గ్యాస్‌ సిలిండర్ల ధరలు తగ్గించారే కానీ ప్రజల పట్ల సానుభూతితో కాదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img