icon icon icon
icon icon icon

విపక్ష కూటమికి మూడంకెలూ కష్టమే

లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష కూటమి మూడంకెలకు చేరుకోవడం కూడా కష్టమేనని, ప్రభుత్వ ఏర్పాటు దరిదాపులకు వచ్చే అవకాశం లేని ఈ పార్టీలు అయిదేళ్లలో అయిదుగురు ప్రధానులను తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు.

Published : 28 Apr 2024 04:54 IST

ఔరంగజేబు ఆరాధకులతో ‘నకిలీ’ శివసేన దోస్తీ
మహారాష్ట్ర, గోవా ర్యాలీల్లో ప్రధాని మోదీ

కొల్హాపుర్‌, వాస్కో: లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష కూటమి మూడంకెలకు చేరుకోవడం కూడా కష్టమేనని, ప్రభుత్వ ఏర్పాటు దరిదాపులకు వచ్చే అవకాశం లేని ఈ పార్టీలు అయిదేళ్లలో అయిదుగురు ప్రధానులను తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపుర్‌, గోవాలోని వాస్కోలలో శనివారం ఎన్నికల ర్యాలీలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. కర్ణాటక, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ పార్టీ ఇలాగే అయిదేళ్లలో ఇద్దరు ముఖ్యమంత్రులు మారే రొటేషన్‌ ఒప్పందాలు చేసిందన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఓబీసీలకు కేటాయించిన 27 శాతం రిజర్వేషన్ల కోటాలోకి ముస్లింలను చొప్పించిన కర్ణాటక మోడల్‌ను దేశమంతా విస్తరించాలని యోచిస్తున్నట్లు ప్రధాని ఆరోపించారు. దక్షిణ భారతాన్ని కొత్త దేశంగా ప్రకటించాలని కర్ణాటక, తమిళనాడు ఇండియా కూటమి నేతలు మాట్లాడుతున్నారని, ఛత్రపతి శివాజీ మహరాజ్‌ గడ్డపై పుట్టిన ప్రజలు దీన్ని అనుమతిస్తారా? అని ప్రశ్నించారు. ఇక్కడి నకిలీ శివసేన నేతలు ఔరంగజేబును ఆరాధించేవారితో చేతులు కలిపారని, బాలాసాహెబ్‌ ఠాక్రే బతికుండి దీన్ని చూస్తే కుంగిపోయేవారని ఉద్ధవ్‌ ఠాక్రే పార్టీని ఉద్దేశించి మోదీ విమర్శలు చేశారు. ఇప్పటిదాకా జరిగిన రెండు దశల ఎన్నికల్లోనూ ఎన్డీయే ఆధిక్యంలో ఉన్నట్లు తెలిపారు. వచ్చే ఏడాదికల్లా పేదలకు మూడు కోట్ల పక్కా గృహాలు నిర్మిస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని చెప్పారు.

ఈవీఎంలను తప్పుబట్టిన కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాలి

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్ల (ఈవీఎంలు) పనితీరును తప్పుబట్టిన కాంగ్రెస్‌ పార్టీ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశానికి క్షమాపణ చెప్పాలని మోదీ డిమాండ్‌ చేశారు. గోవాలోని వాస్కో ఎన్నికల సభలో ప్రధాని మాట్లాడుతూ.. పలు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో భాజపాకు గోవా మోడల్‌ లాంటిదన్నారు. పౌరుల ఆకాంక్షలను నెరవేర్చే ఎన్డీయే సిద్ధాంతాలకు, స్వార్థ లక్ష్యాలతో తమ కుటుంబాల రక్షణకు పనిచేస్తున్న ఇండియా కూటమికి మధ్య జరుగుతున్న పోరాటంగా తాజా ఎన్నికలను ప్రధాని అభివర్ణించారు. గోవా మత్స్యకారులకు బీమా కవరేజీ పెంచుతామన్నారు. ‘‘కాంగ్రెస్‌ ‘యువరాజు’ మీ సంపద తనిఖీకి విదేశాల నుంచి ఎక్స్‌రే మిషను తెస్తారట. ఆ తర్వాత మీ సంపదను ఇతరులకు పంచుతారు. కాంగ్రెస్‌కు ఇష్టమైన ఆ ఓటుబ్యాంకు ఏదో మీకందరికీ తెలుసు’’ అని ప్రధాని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img