icon icon icon
icon icon icon

‘మహా’ ఉత్కంఠ!

మహారాష్ట్రలో మూడో విడత సార్వత్రిక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. వదినా మరదళ్ల సవాల్‌తో సెగలు కక్కుతున్న బారామతి, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ వారసులు బరిలో నిలిచిన సతారా, కొల్హాపుర్‌లతోపాటు మొత్తంగా 11 స్థానాలకు ఈ దశలో పోలింగ్‌ జరగనుంది.

Updated : 28 Apr 2024 07:02 IST

మూడో విడతలో మహారాష్ట్రలో 11 స్థానాలకు పోలింగ్‌
జాబితాలో బారామతి, కొల్హాపుర్‌, రత్నగిరి-సింధుదుర్గ్‌
మహాయుతి, మహా వికాస్‌ అఘాడీ మధ్య హోరాహోరీ
ఈనాడు ప్రత్యేక విభాగం


మహారాష్ట్రలో మొత్తం లోక్‌సభ స్థానాలు - 48
మూడో విడతలో పోలింగ్‌ జరిగేవి 11
బరిలో మొత్తం అభ్యర్థులు 258
ఓటింగ్‌ తేదీ మే 7


మహారాష్ట్రలో మూడో విడత సార్వత్రిక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. వదినా మరదళ్ల సవాల్‌తో సెగలు కక్కుతున్న బారామతి, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ వారసులు బరిలో నిలిచిన సతారా, కొల్హాపుర్‌లతోపాటు మొత్తంగా 11 స్థానాలకు ఈ దశలో పోలింగ్‌ జరగనుంది. వీటిలో- సతారా, కొల్హాపుర్‌, బారామతి, సాంగ్లీ, సోలాపుర్‌, మాధా, హాట్కణంగ్లే పశ్చిమ మహారాష్ట్రలోనివి కాగా.. లాతూర్‌, ఉస్మానాబాద్‌ మరాఠ్వాడా ప్రాంతంలోని స్థానాలు. రాయ్‌గడ్‌, రత్నగిరి-సింధుదుర్గ్‌ నియోజకవర్గాలు కొంకణ్‌ ప్రాంతంలో ఉన్నాయి. మెజార్టీ సీట్లలో పోరు ప్రధానంగా మహాయుతి (ఎన్డీయే), మహా వికాస్‌ అఘాడీ (ఇండియా) కూటముల మధ్యే హోరాహోరీగా ఉంది.


బారామతి: ఎవరిదో పైచేయి

మూడో విడతలో అందరి దృష్టీ ప్రధానంగా బారామతిపైనే కేంద్రీకృతమైంది. ఇక్కడ సిట్టింగ్‌ ఎంపీ సుప్రియా సూలే ఎన్సీపీ (ఎస్పీ) తరఫున బరిలో నిలిచారు. పార్టీ అధినేత శరద్‌ పవార్‌ కుమార్తె ఈమె. పవార్‌ సోదరుడి కుమారుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సతీమణి సునేత్రా పవార్‌ ఎన్సీపీ తరఫున ఈ స్థానంలో పోటీ చేస్తున్నారు. అజిత్‌ నిరుడు ఎన్సీపీని చీల్చిన సంగతి తెలిసిందే. బారామతి పవార్‌ కుటుంబానికి కంచుకోట. ఇక్కడ సూలే 2009 నుంచి ఎంపీగా ఉన్నారు. అంతకుముందు వరుసగా ఆరుసార్లు శరద్‌ పవార్‌ విజయం సాధించారు. ఇప్పుడు సూలే ఓడితే.. ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లవుతుంది. పార్టీ శ్రేణులపై పట్టు కోల్పోయే ముప్పు కూడా ఉంటుంది. అందుకే కుమార్తె విజయం కోసం శరద్‌ పవార్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.


ఉస్మానాబాద్‌ : కుటుంబ పోరు

ఈ స్థానంలోనూ కుటుంబ పోరు కనిపిస్తోంది. భాజపా  తరఫున ఎమ్మెల్యే రాణా జగ్జీత్‌సిన్హ్‌ పాటిల్‌ సతీమణి అర్చనా పాటిల్‌ పోటీ చేస్తున్నారు. జగ్జీత్‌సిన్హ్‌ సమీప బంధువైన సిట్టింగ్‌ ఎంపీ ఓంప్రకాశ్‌ రాజె నింబాల్కర్‌కు శివసేన (యూబీటీ) టికెట్‌ ఇచ్చింది.


కొల్హాపుర్‌: కాంగ్రెస్‌కు వీబీఏ, ఎంఐఎం మద్దతు

ఇక్కడ కాంగ్రెస్‌ తరఫున శ్రీమంత్‌ శాహూ ఛత్రపతి మహరాజ్‌ బరిలో దిగారు. ఈయన ఛత్రపతి శివాజీ వారసుల్లో ఒకరు. సీఎం ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన.. సంజయ్‌ మండ్లిక్‌కు టికెట్‌ ఇచ్చింది. ప్రకాశ్‌ అంబేడ్కర్‌ నాయకత్వంలోని వీబీఏ, అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం ఈ స్థానంలో శ్రీమంత్‌ శాహూకు మద్దతు ప్రకటించాయి.


సాంగ్లీ: త్రిముఖ పోటీ

మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) తరఫున రెజ్లర్‌ చంద్రహార్‌ పాటిల్‌, భాజపా నుంచి సిట్టింగ్‌ ఎంపీ సంజయ్‌కాకా పాటిల్‌ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌పై తిరుగుబావుటా ఎగరేసిన విశాల్‌ పాటిల్‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. దీంతో త్రిముఖ పోటీ నెలకొంది. 1976-85 మధ్య మూడుసార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వసంత్‌దాదా పాటిల్‌ మనవడు విశాల్‌.


సోలాపుర్‌ (ఎస్సీ): ఎమ్మెల్యేల పోరు

ఇక్కడ భాజపా రామ్‌ సాత్పుతేకు టికెట్‌ ఇవ్వగా, కాంగ్రెస్‌ ప్రణీతి శిందేను బరిలో దించింది. వీరిద్దరూ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలే. మాజీ సీఎం, కేంద్ర మాజీ హోంమంత్రి సుశీల్‌కుమార్‌ శిందే కుమార్తె ప్రణీతి.


  • సతారాలో ఛత్రపతి శివాజీ వారసుల్లో ఒకరైన శ్రీమంత్‌ ఛత్రపతి ఉదయన్‌రాజె భోసలే భాజపా తరఫున బరిలో నిలిచారు. భోసలే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇక్కడ ఎన్సీపీ (ఎస్పీ) తరఫున మాజీమంత్రి శశికాంత్‌ శిందే పోటీ చేస్తున్నారు.

  • రత్నగిరి-సింధుదుర్గ్‌లో పోరు ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ భాజపా తరఫున కేంద్రమంత్రి, మాజీ సీఎం నారాయణ్‌ రాణె బరిలో ఉన్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన వినాయక్‌ రౌత్‌ (శివసేన-యూబీటీ) నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.

  • హాట్కణంగ్లేలో శివసేన (యూబీటీ) నుంచి సత్యజీత్‌ పాటిల్‌, శివసేన తరఫున ధైర్యశీల్‌ మానే పోటీ చేస్తున్నారు. ఇక్కడ మాజీ ఎంపీ రాజు శెట్టి (స్వాభిమానీ పక్ష) బరిలో దిగడంతో త్రిముఖ పోటీ ఉంది.
  • మాధాలో సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌సిన్హ్‌ నాయక్‌-నింబాల్కర్‌ (భాజపా), ఎన్సీపీ (ఎస్పీ) నేత ధైర్యశీల్‌ మోహితె-పాటిల్‌  హోరాహోరీగా తలపడుతున్నారు.
  • లాతూర్‌ (ఎస్సీ) భాజపా సిట్టింగ్‌ ఎంపీ సుధాకర్‌ శృంగారే, కాంగ్రెస్‌ అభ్యర్థి శివాజీరావ్‌ కాల్గే నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నారు.
  • రాయ్‌గడ్‌లో ఎన్సీపీ రాష్ట్రాధ్యక్షుడు,  సిట్టింగ్‌ ఎంపీ సునీల్‌ తట్‌కరే బరిలో ఉన్నారు. శివసేన (యూబీటీ) నుంచి అనంత్‌ గీతే పోటీ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img