icon icon icon
icon icon icon

రిజర్వేషన్లకు మీరే వ్యతిరేకం

దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లపై వ్యతిరేకతతో ఉండేది భాజపాయేనని, ఆ విషయంలో కాంగ్రెస్‌పై అనవసరంగా ప్రధాని నరేంద్రమోదీ, భాజపా నేతలు పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఆరోపించారు.

Published : 28 Apr 2024 05:33 IST

భాజపా ఆరోపణల్ని తిప్పికొట్టిన కాంగ్రెస్‌

దిల్లీ: దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లపై వ్యతిరేకతతో ఉండేది భాజపాయేనని, ఆ విషయంలో కాంగ్రెస్‌పై అనవసరంగా ప్రధాని నరేంద్రమోదీ, భాజపా నేతలు పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఆరోపించారు. 1950 నుంచి రిజర్వేషన్లు అమలవుతున్నాయంటే దానికి కాంగ్రెస్‌ ప్రభుత్వాలే కారణమని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల కోటాను లాక్కొనిపోతుందని ప్రధాని చెప్పడం శుద్ధ అబద్ధమని మండిపడుతూ రమేశ్‌ వీడియో సందేశం విడుదల చేశారు. ‘రిజర్వేషన్‌ నిబంధనను అంబేడ్కర్‌, నెహ్రూ, పటేల్‌, ఇతర కాంగ్రెస్‌ నేతలు రాజ్యాంగంలో చేర్పించారు. ప్రధానిగా పీవీ నరసింహారావు ఉన్నప్పుడు ఓబీసీలకు కేంద్ర ఉద్యోగాల్లో 27% కోటా కల్పించారు. మన్మోహన్‌ ప్రధానిగా ఉన్నప్పుడు ఉన్నత విద్యాసంస్థల్లో వీరికి 27% కోటాను తీసుకువచ్చారు. మహిళా రిజర్వేషన్లలోనూ ఓబీసీ మహిళలకు కోటా ఉండాలనేది కాంగ్రెస్‌ డిమాండ్‌. దానిపై మోదీయే కిమ్మనలేదు’ అని జైరాం వివరించారు.

ప్రభుత్వ కపటానికి హద్దుల్లేవు

వేలం వేయకుండా 2జి స్పెక్ట్రం కేటాయించేందుకు అనుమతివ్వాలని సుప్రీంకోర్టును మోదీ సర్కారు కోరడం భాజపా కపటబుద్ధికి పరాకాష్ఠ అని రమేశ్‌ విమర్శించారు. 2జి కుంభకోణం జరిగిందని ఆరోపించినవారే ఇప్పుడు ఇలా అడగడమేమిటని ప్రశ్నించారు. మోదీ హయాంలో కుంభకోణాలపై ఇండియా కూటమి సర్కారు దర్యాప్తు జరిపిస్తుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img