icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌ వస్తే మీ పిల్లల ఆస్తి ముస్లింలకు..

కాంగ్రెస్‌ ‘హస్తం’లో విదేశీ శక్తుల ప్రమేయం కనపడుతోందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ ఆరోపించారు. ఆ పార్టీ మ్యానిఫెస్టోలో ఇది స్పష్టమవుతోందన్నారు.

Updated : 28 Apr 2024 06:26 IST

కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌

హమీర్‌పుర్‌: కాంగ్రెస్‌ ‘హస్తం’లో విదేశీ శక్తుల ప్రమేయం కనపడుతోందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ ఆరోపించారు. ఆ పార్టీ మ్యానిఫెస్టోలో ఇది స్పష్టమవుతోందన్నారు. ‘‘మీ పిల్లల ఆస్తిని ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. మీ ఆస్తి మీ పిల్లలకే చెందాలా లేక ముస్లింలపరం కావాలా అన్నది మీరే తేల్చుకోవాలి’’ అని ఆయన హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పుర్‌లో జరిగిన ఎన్నికల సభలో ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరుగుదొడ్ల నుంచి ఇళ్ల వరకూ, గ్యాస్‌ సిలిండర్ల నుంచి ఆహార ధాన్యాల వరకూ తాము ముస్లింలకు సమాన హక్కులు కల్పించామన్నారు. వీటిని మతం కోణంలో చూడలేదని చెప్పారు. మతం, ప్రాంతం ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని కాంగ్రెస్‌ భావిస్తోందని ఆయన ఆరోపించారు. ‘‘దేశాన్ని ముక్కలుగా చేయాలనుకునే ‘తుక్డే.. తుక్డే ముఠా’ ఆలోచనతీరును కాంగ్రెస్‌ పూర్తిగా ఒంటబట్టించుకుంది. అందువల్ల దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులను సమర్థిస్తారా లేక ఐక్యంగా ఉంచే శక్తులను ఆదరిస్తారా అన్నది ప్రజలే నిర్ణయించుకోవాలి. రాజీవ్‌ గాంధీ ప్రధాన మంత్రి అయినప్పుడు.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి చెందిన 55 శాతం ఆస్తి ప్రభుత్వ ఖజానాకు చెందాలన్న నిబంధన ఉండేది. అయితే తన ఆస్తిని రక్షించుకోవడానికి రాజీవ్‌ గాంధీ ఆ నిబంధనను మార్చారు’’ అని చెప్పారు. మరోవైపు అనురాగ్‌ ఠాకుర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మండిపడింది. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఆరోపించింది. ఈ మేరకు శనివారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రధాని మోదీ, ఉత్తర్‌ఫ్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల అడుగుజాడల్లో ఠాకుర్‌ నడుస్తున్నారని విమర్శించింది. ఆయనపై తక్షణం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌.. ఎన్నికల సంఘాన్ని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img