icon icon icon
icon icon icon

ఆరు దశాబ్దాల తర్వాత స్వగ్రామంలో ఓటేయనున్న జనం

ఆరు దశాబ్దాలుగా జల దిగ్బంధంలో చిక్కుకుని ఎన్నికలకు దూరమైన జనం ఈసారి సొంత గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Updated : 28 Apr 2024 06:58 IST

ఒడిశాలో ఏర్పాట్లు

మల్కాన్‌గిరి, న్యూస్‌టుడే: ఆరు దశాబ్దాలుగా జల దిగ్బంధంలో చిక్కుకుని ఎన్నికలకు దూరమైన జనం ఈసారి సొంత గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి పరిధి రలెగెడ, పాపరమెట్ల, ధులిపుట్‌, గాజలమాముడి, జోడాంబో, జంత్రి, బడపడా, బడపదర్‌, నకామాముడి పంచాయతీల ప్రజలను (సుమారు 20వేల మంది) ఆరు దశాబ్దాల క్రితం బలిమెలలో జలాశయ నిర్మాణం దృష్ట్యా గురుప్రియ నది ఆవలకు తరలించారు. అందరికీ ఇళ్లు, స్థలాలు అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా అమలు కాలేదు. వీరు నది ఆవల అటవీ ప్రాంతంలో ఉండిపోవడంతో నేతలు, అధికారులు అటువైపు వెళ్లేందుకు వీలులేక ఎవరూ చొరవ చూపలేదు. దీంతో ఆరు దశాబ్దాలుగా ప్రజలు ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయారు. ఈ గ్రామాలకు చేరుకోవాలంటే నదిపై నాటు పడవ, మోటర్‌ బోట్ల సాయంతో వెళ్లాల్సిందే.

మావోయిస్టుల ప్రభావం

ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువ. 1998లో మల్కాన్‌గిరి జిల్లా కలిమెల సమితిలో మొదటిసారి కమిటీలు వేసిన మావోయిస్టులు.. చిత్రకొండ సమితిలోని 9 గ్రామ పంచాయతీలను ఆక్రమించుకున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు హెలికాప్టర్‌ సాయంతో పోలింగ్‌ అధికారులు బ్యాలెట్‌ బాక్సులను తరలించి ఓటు వేయించేవారు. అతి తక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకునేవారు. కొన్నిసార్లు నాటు పడవ, మోటారు బోటు సహాయంతో బ్యాలెట్‌ బాక్సులు, ఈవీఎం యంత్రాలను తీసుకెళ్తే మావోయిస్టులు వాటిని ఎత్తుకెళ్లేవారు. 2011లో అప్పటి కలెక్టరు ఆర్‌.వినీల్‌ కృష్ణ ఈ గ్రామాల అభివృద్ధి కోసం ప్రయత్నం చేసి ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఆ సమయంలో ఆయనను మావోయిస్టులు కిడ్నాప్‌ చేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 10 రోజుల తర్వాత వారి డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇవ్వడంతో వదిలి పెట్టారు. 2018లో ఈ ప్రాంతంలో గురుప్రియ వంతెన నిర్మాణం జరిగింది. బి.ఎస్‌.ఎఫ్‌. క్యాంపులు, పోలీస్‌ స్టేషన్ల సంఖ్య పెరిగింది. రహదారులు నిర్మాణమై వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి.


ఓకేచోట 23 బూత్‌లు

వంతెన నిర్మాణం తర్వాత మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో గత పంచాయతీ ఎన్నికల్లో జంత్రి గ్రామంవద్ద 23 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. దీంతోపాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో అధిక శాతం ఓట్లు నమోదయ్యాయి. యంత్రాంగం ఈ సారి ప్రతి గ్రామంలోనూ పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేసింది. పోలీసులు, బి.ఎస్‌.ఎఫ్‌. జవాన్లను రక్షణ కోసం మోహరించనున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ 60ఏళ్ల తర్వాత వారి స్వగ్రామంలోనే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img

నియోజకవర్గ సమాచారం