icon icon icon
icon icon icon

సంక్షిప్త వార్తలు (7)

రిజర్వేషన్లను భాజపా ఎప్పటికీ తొలగించబోదు. ఇది మోదీ గ్యారంటీ. రామాలయాన్ని నిర్మించినవారు కావాలా, కరసేవకులపై కాల్పులు జరిపించినవారు కావాలా అనేది ప్రజలు తేల్చుకోవాలి. ఇప్పటికే ముగిసిన తొలి రెండు దశల్లోనే భాజపా 100 సీట్లు సాధిస్తుంది.

Updated : 29 Apr 2024 06:13 IST

ఇప్పటికే మాకు 100 సీట్లు
- యూపీ ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా

రిజర్వేషన్లను భాజపా ఎప్పటికీ తొలగించబోదు. ఇది మోదీ గ్యారంటీ. రామాలయాన్ని నిర్మించినవారు కావాలా, కరసేవకులపై కాల్పులు జరిపించినవారు కావాలా అనేది ప్రజలు తేల్చుకోవాలి. ఇప్పటికే ముగిసిన తొలి రెండు దశల్లోనే భాజపా 100 సీట్లు సాధిస్తుంది. మోదీ తప్ప మరెవరైనా దేశాన్ని సమర్థంగా నడపగలరా? విపక్షానికి ప్రధాని అభ్యర్థి ఎవరు?


మాది అభివృద్ధి పథం

- అహ్మదాబాద్‌లో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

రికొత్త, పురోగామి భారత్‌ను తీర్చిదిద్దడానికి పక్కా గ్యారంటీ మా మ్యానిఫెస్టో. కాంగ్రెస్‌ది మాత్రం అంతా విభజనవాదం, బుజ్జగింపు రాజకీయం. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ పార్టీ.. పేదరికాన్ని మాత్రం నిర్మూలించలేకపోయింది. మేం 8-9 ఏళ్లలోనే 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం. కాంగ్రెస్‌కు నాయకత్వం, విధానం లేవు.


భాజపాకు సహకరిస్తున్న కాంగ్రెస్‌, సీపీఎం

- మాల్దా జిల్లాలో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ

శ్చిమ బెంగాల్‌ లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు కాంగ్రెస్‌, సీపీఎం సహకరిస్తున్నాయి. ఆ పార్టీలకు ఓటు వేస్తే భాజపాకు వేసినట్లే. ఎన్నికల తర్వాత ‘ఇండియా’ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో మా పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. మా ప్రభుత్వంపై కాంగ్రెస్‌, సీపీఎం కుట్రలు చేస్తున్నాయి. గెలుపుపై భయంతోనే మోదీ ఇప్పుడు మహిళల మంగళసూత్రాల గురించి మాట్లాడుతున్నారు. మాకు ప్రతి మతం ముఖ్యం.


అసత్యమేవ పరాజయతే

- ఎక్స్‌ వేదికగా, యూపీ సభల్లో సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌

బద్ధాలే పునాదిగా ఉన్నవారికి ఓటమి తప్పదు. అసత్యమేవ పరాజయతే. యూపీలో రిజర్వేషన్లను తొలగించిన భాజపా ఇప్పుడు వాటిని ఎవరు తొలగించినా ఊరుకోబోమని నిస్సిగ్గుగా చెబుతోంది. ఆ విషయాన్ని ఓటర్లు నిలదీయాలి. తప్పుడు ప్రకటనలు యూపీ ఓటర్లను మరింత ఆగ్రహానికి గురిచేస్తాయి. మూడోదశలో భాజపాకు ఒక్క స్థానమూ రాదు. రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నవారిని ప్రజలు మార్చేస్తారు.


మంగళసూత్రం ధరించని ప్రియాంక.. నెహ్రూ ఆత్మ కన్నీరుపెడుతుంది

- మధ్యప్రదేశ్‌లోని గునాలో ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌

ప్రియాంక గాంధీ వంటి నకిలీగాంధీలు ఓట్ల కోసం తమ ఇంటిపేరు వాడుకుంటున్నారు. మంగళసూత్రమైనా ధరించని మునిమనవరాలు ప్రియాంక తమ కుటుంబంలో పుట్టిందని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆత్మ తప్పకుండా కన్నీరుపెడుతుంది. సాధారణంగా ఆడపిల్లకి పెళ్లయ్యాక అత్తవారి ఇంటిపేరే వర్తిస్తుంది. ఓట్లయావ ఉన్న కొందరు మాత్రం ఈరోజుకీ గాంధీ పేరు వాడుకుంటున్నారు. అసలైన గాంధీ వారసులు ఎక్కడున్నారు?


దిల్లీలో బలహీన ప్రభుత్వమే మమతకు కావాలి

- పశ్చిమబెంగాల్‌లోని బహరంపుర్‌లో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటును మేం కోరుకుంటున్నాం. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మాత్రం దిల్లీ గద్దెపై బలహీన ప్రభుత్వం ఉండాలని ఆశిస్తున్నారు. అవినీతి, వేధింపులు, వివక్ష, బుజ్జగింపు రాజకీయాలకు మమతా బెనర్జీ ప్రభుత్వం మారుపేరుగా మారిపోయింది. ఈ రాష్ట్రంలో భాజపా 35 నుంచి 42 వరకు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది.


ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే  భాజపా గెలుపు సులువుకాదు

- యూపీలోని మురేనాలో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి

ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా సాగితే, ఈవీఎంలను తారుమారు చేయకపోతే భాజపా గెలుపు అంత సులభం కాదు. దర్యాప్తు సంస్థల్ని గతంలో కాంగ్రెస్‌ రాజకీయమయం చేసినట్లే ఇప్పుడు భాజపా చేస్తోంది. పేదవారికి ఉచితంగా రేషన్‌ ఇవ్వడం కంటే వారికి ఉపాధి కల్పించడం అసలైన పరిష్కారం. ఇప్పటికీ దేశ సరిహద్దులు సురక్షితంగా లేకపోవడం ఆందోళనకరం. భాజపా, కాంగ్రెస్‌లు అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img