icon icon icon
icon icon icon

భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అవుతుంది

గణాంకాలపరంగా అనివార్యమైన ఒక అంశాన్ని ఎన్నికల వాగ్దానంగా మలచి అతిశయోక్తులతో చెప్పడంలో ప్రధాని మోదీ ఆరితేరారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పి.చిదంబరం విమర్శించారు.

Published : 29 Apr 2024 03:55 IST

అందులో మేజిక్‌ ఏమీలేదు
కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం

కోల్‌కతా: గణాంకాలపరంగా అనివార్యమైన ఒక అంశాన్ని ఎన్నికల వాగ్దానంగా మలచి అతిశయోక్తులతో చెప్పడంలో ప్రధాని మోదీ ఆరితేరారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పి.చిదంబరం విమర్శించారు. ప్రధాన మంత్రి పదవిలో ఎవరున్నా సరే మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయమని తెలిపారు. అత్యధిక జనాభా కలిగిన దేశంగా మనం ఆ స్థాయికి చేరడంలో మేజిక్‌ ఏమీ ఉండదని పేర్కొన్నారు. అయితే, ఎంత సమయంలో ఆ స్థాయిని అందుకుంటామనేది ముఖ్యమని ‘పీటీఐ’ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి అన్నారు. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఆధారంగా మన దేశం ఇప్పుడు ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీ దేశాలు మనకన్నా ముందున్నాయి. ‘జీడీపీ పరంగా 2004లో భారత్‌ ప్రపంచంలో 12వ స్థానంలో ఉంది. 2014 నాటికి ఏడో స్థానానికి చేరుకుంది. 2024లో ఐదో స్థానంలో నిలిచింది. ఇప్పుడు కూడా ప్రధానిగా ఎవరున్నా.. మూడో స్థానానికి చేరుకుంటుంది. ఇందులో ఎటువంటి మాయాజాలం లేదు. మనకున్న జనాభాతోనే ఇది సాధ్యమవుతుంది’’ అని చిదంబరం పేర్కొన్నారు. అయితే, ఒక దేశ ప్రజల మెరుగైన జీవన ప్రమాణాలకు నిజమైన కొలమానం జీడీపీ కాబోదని, తలసరి ఆదాయమే అసలైన గీటురాయని చిదరంబరం అభిప్రాయపడ్డారు. భారతీయుల తలసరి ఆదాయం(2,731 అమెరికా డాలర్లు) గ్లోబల్‌ ర్యాంకుల పరంగా 136వ స్థానంలో ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) 2024 అంచనాలను ఉటంకిస్తూ గుర్తు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img