icon icon icon
icon icon icon

మహారాజులను అవమానించి.. నిజాముల అరాచకాలపై మౌనమా?

‘‘భారతదేశంలోని రాజులు, మహారాజులు పేదల భూములను ఆక్రమించారని కాంగ్రెస్‌ యువరాజు (రాహుల్‌) ఆరోపించారు. తద్వారా ఛత్రపతి శివాజీ మహారాజ్‌, కిత్తూర్‌ రాణి చెన్నమ్మ వంటి మహానుభావులను అవమానించారు.

Updated : 29 Apr 2024 06:10 IST

కర్ణాటక సభల్లో రాహుల్‌పై మోదీ ధ్వజం

ఈనాడు, బెంగళూరు: ‘‘భారతదేశంలోని రాజులు, మహారాజులు పేదల భూములను ఆక్రమించారని కాంగ్రెస్‌ యువరాజు (రాహుల్‌) ఆరోపించారు. తద్వారా ఛత్రపతి శివాజీ మహారాజ్‌, కిత్తూర్‌ రాణి చెన్నమ్మ వంటి మహానుభావులను అవమానించారు. ఓటుబ్యాంకుగా మారిన బుజ్జగింపు రాజకీయాల కోసమే అటువంటి ప్రకటనలు చేశారు. దేశ చరిత్రలో నవాబులు, నిజాంలు, సుల్తానులు, బాద్‌షాలు చేసిన దౌర్జన్యాలపై మాత్రం ఆయన నోరు మెదపలేదు’’ అని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర కన్నడ జిల్లా సిరసితోపాటు బెళగావి, దావణగెరె, హొసపేటెల్లో ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్‌పై మాటల దాడిని కొనసాగించారు. ఓటుబ్యాంకును దృష్టిలో ఉంచుకొని దేశ చరిత్ర, స్వాతంత్య్ర పోరాటాలకు సంబంధించిన పుస్తకాలను కాంగ్రెస్‌ రాయించిందన్నారు. మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు అణచివేతల గురించి రాహుల్‌ మరచిపోయారన్న మోదీ.. అప్పట్లో ఎన్నో దేవాలయాలను అపవిత్రం చేసి, ధ్వంసం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘యువరాజు, ఆయన సోదరి (ప్రియాంకాగాంధీ) కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దేశసంపదను ‘ఎక్సరే’ తీస్తామంటున్నారు. ఈ ఆలోచన వదులుకోవాలని కాంగ్రెస్‌ను హెచ్చరిస్తున్నా. మోదీ బతికుండగా దీన్ని అనుమతించడు’’ అని ప్రధాని తెలిపారు. ఉగ్రవాదులను వారి ఇళ్లలోకి చొరబడి చంపే కొత్త భారతాన్ని నేడు మనం చూస్తున్నామన్నారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న భారతదేశం బలపడటం కొన్ని దేశాలకు, సంస్థలకు ఇష్టం లేదని.. భారత్‌లో అవినీతితో కూడిన బలహీన ప్రభుత్వం ఏర్పడాలని వారు కోరుకొంటున్నట్లు ప్రధాని తెలిపారు.  


రాముణ్ని కాదన్నవారికి ప్రజల నుంచీ తిరస్కారమే  

యోధ్య రామమందిర నిర్మాణాన్ని చివరిదాకా అడ్డుకొని ప్రతిష్ఠాపన మహోత్సవ ఆహ్వానాన్ని తిరస్కరించిన వారందరినీ, ఈ ఎన్నికల్లో దేశం తిరస్కరించబోతోందని మోదీ చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ సర్కారు ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో అసాంఘిక శక్తులు మళ్లీ క్రియాశీలం అయ్యాయని తెలిపారు. హుబ్బళ్లిలో ఇటీవల ఓ విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యాన్ని మోదీ ఖండించారు. పేలుడుతో బెంగళూరు దద్దరిల్లితే గ్యాస్‌ సిలిండరు  పేలిందని కాంగ్రెస్‌ ప్రభుత్వం బుకాయించిందన్నారు. ‘‘కేఫ్‌లో పేలింది బాంబా? కాంగ్రెస్‌ నేతల మెదళ్లా! ఈ పేలుడుకు పాల్పడినవాళ్లంతా పీఎఫ్‌ఐ కార్యకర్తలని తేలింది’’ అని మండిపడ్డారు. భాజపా హయాంలో ఇటువంటి సంస్థలను నిషేధించగా, కాంగ్రెస్‌ వయనాడ్‌లో గెలుపు కోసం వారి సహకారం తీసుకుంటోందని ప్రధాని తెలిపారు. సభల్లో మాజీ సీఎంలు  యడియూరప్ప, కుమారస్వామి, జగదీశ్‌ శెట్టర్‌, బసవరాజ్‌ బొమ్మై పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img