icon icon icon
icon icon icon

రాజులు కావాలనుకుంటున్నారు

భాజపా, ఆరెస్సెస్‌లు మన దేశాన్ని మునుపటి కాలంనాటి రాజ్యంగా మార్చేసి తమ నేతల్ని రాజులుగా చేద్దామనుకుంటున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. దీనికోసమే అవి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని అనుకుంటున్నాయని చెప్పారు.

Updated : 29 Apr 2024 06:05 IST

భాజపా, ఆరెస్సెస్‌లపై రాహుల్‌ ధ్వజం

దమణ్‌: భాజపా, ఆరెస్సెస్‌లు మన దేశాన్ని మునుపటి కాలంనాటి రాజ్యంగా మార్చేసి తమ నేతల్ని రాజులుగా చేద్దామనుకుంటున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. దీనికోసమే అవి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని అనుకుంటున్నాయని చెప్పారు. ‘ఒకే దేశం.. ఒకే భాష.. ఒకే నేత’ అనే ప్రతిపాదన నిర్హేతుకమని చెప్పారు. కేంద్రపాలిత ప్రాంతమైన దమణ్‌, దీవ్‌, దాద్రానగర్‌ హవేలీలో ప్రచారం నిమిత్తం ఆదివారం దమణ్‌ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అన్ని వ్యవస్థల్నీ నాశనం చేసి.. తమ నేతల్ని రాజులుగా మార్చేసి, 20-22 మంది కుబేరులకు సాయపడడమే భాజపా ఉద్దేశమని చెప్పారు. ఆరెస్సెస్‌ గతంలోనూ రిజర్వేషన్‌ కోటాలను వ్యతిరేకించిందని చెప్పారు.  ‘మనకు ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును, రిజర్వేషన్లను ఇచ్చింది రాజ్యాంగమే. అందుకే దానిని మేం కాపాడాలనుకుంటున్నాం.  రాజ్యాంగాన్ని నాశనం చేయడం ఆరెస్సెస్‌-భాజపా ధ్యేయం. అన్ని ప్రాంతాల అస్తిత్వం, సంస్కృతి, చరిత్ర, భాషల్ని కాపాడాలని మేం చెబుతుంటే.. సంఘ్‌ మాత్రం ఒకే నేత ఉండాలంటోంది’ అని రాహుల్‌ చెప్పారు.

ఒడిశాను దోచుకున్నారు

కటక్‌, భువనేశ్వర్‌-న్యూస్‌టుడే: కోటీశ్వరుల కోసం కేంద్రంలో ప్రభుత్వాన్ని మోదీ నడిపిస్తుంటే, ఒడిశాలో ఎంపిక చేసుకున్న కొద్దిమంది కోసం ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సర్కారు పనిచేస్తోందని రాహుల్‌ ఆరోపించారు. జమిలి ఎన్నికలు జరగబోతున్న ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కటక్‌ జిల్లా సాలెపుర్‌ సభలో ఆయన ప్రసంగించారు. భాజపా, బిజూ జనతాదళ్‌ (బిజద) ఎన్నికల్లో ఒకదానిపై ఒకటి తలపడుతున్నా నిజానికి అవి పరస్పరం కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో కూడా ఇలాగే భారాస, భాజపా కలిసి పనిచేశాయని, వాటిని గద్దెదించి తమ ప్రభుత్వం అక్కడ కొలువుదీరిందని గుర్తుచేశారు. నవీన్‌ పట్నాయక్‌ పేరుకే సీఎం. రాష్ట్రాన్ని నడిపేదంతా ఆయన సహాయకుడు   వి.కె.పాండియన్‌. అంకుల్‌జీ (మోదీ), నవీన్‌ కలిసి ఒడిశాకు పాన్‌ (పీ-పాండియన్‌, ఏ-అమిత్‌షా, ఎన్‌-నరేంద్రమోదీ, ఎన్‌-నవీన్‌ పట్నాయక్‌) ఇచ్చారు. వారంతా మీ సంపద దోచుకున్నారు. గనుల కుంభకోణంలో రూ.9 లక్షల కోట్లు, భూముల స్కాం ద్వారా రూ.20,000 కోట్లు, మొక్కలు నాటే పేరుతో రూ.15,000 కోట్లు దోచేశారు. ఒడిశాలో, కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కొలువుదీరగానే ఆ డబ్బును ప్రజలకు ఇవ్వడం ప్రారంభిస్తాం’ అని రాహుల్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img