icon icon icon
icon icon icon

తొలి రెండుదశల్లో 8% మంది మహిళలే పోటీ

రాజకీయాల్లో మహిళల సంఖ్య పెరగడం, మహిళా సాధికారత వంటి అంశాలపై చేస్తున్న ప్రకటనలు ఏమాత్రం వాస్తవ రూపం దాల్చడం లేదు. ఇప్పటికీ రాజకీయ రణరంగంలో అతివలకు దక్కుతున్న అవకాశాలు అంతంతమాత్రమే.

Published : 29 Apr 2024 04:03 IST

సాధికారత డొల్లతనాన్ని తెలియజేస్తోందన్న రాజకీయ విశ్లేషకులు
నిర్మాణాత్మక సంస్కరణల అవసరం ఉందని వెల్లడి

దిల్లీ: రాజకీయాల్లో మహిళల సంఖ్య పెరగడం, మహిళా సాధికారత వంటి అంశాలపై చేస్తున్న ప్రకటనలు ఏమాత్రం వాస్తవ రూపం దాల్చడం లేదు. ఇప్పటికీ రాజకీయ రణరంగంలో అతివలకు దక్కుతున్న అవకాశాలు అంతంతమాత్రమే. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల తొలి రెండు దశల్లో పోటీచేసిన 2,823 (తొలి దశలో 1,625, రెండో దశలో 1,198) మంది అభ్యర్థుల్లో కేవలం 8% మంది మహిళలకే టికెట్లు దక్కడం ఇందుకు నిదర్శనం. మొదటి దశలో 135 మంది మహిళలు, రెండో దశలో 100 మంది మహిళలు మొత్తంగా రెండు దశలు కలిపితే 235 మంది మహిళలే ఎన్నికల బరిలో నిలిచారు. ఇక తొలిదశలో పోటీచేసిన 135 మంది మహిళల్లో అత్యధికంగా తమిళనాడు రాష్ట్రం నుంచి 76 మంది ఉన్నారు. రెండో దశలో బరిలో నిలిచిన 100 మంది మహిళల్లో  ఒక్క కేరళ నుంచే 24 మంది పోటీచేశారు. పార్టీల వారీగా చూస్తే కాంగ్రెస్‌ పార్టీ మొదటి, రెండు దశల్లో కలిపి 44 మంది అతివలకు అవకాశం ఇవ్వగా, భాజపా 69 మందికి అవకాశం కల్పించింది. రాజకీయ పార్టీల ఈ తీరుపై విశ్లేషకులు మండిపడుతున్నారు. ఈ మేరకు దిల్లీ వర్సిటీకి చెందిన జీసస్‌ అండ్‌ మేరీ కళాశాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సుశీలా రామస్వామి మాట్లాడుతూ.. మహిళా అభ్యర్థుల సంఖ్యను పెంచేందుకు రాజకీయ పార్టీలు పటిష్ఠ చర్యలు చేపట్టాలన్నారు. ‘‘మరింత మంది మహిళా అభ్యర్థులను బరిలో నిలిపేందుకు రాజకీయ పార్టీలు మరింత చురుగ్గా వ్యవహరించాలి’’ అని వ్యాఖ్యానించారు.  ‘‘దేశ ఓటర్లలో మహిళలు దాదాపు సగం మంది ఉన్నారు. అదే సమయంలో అభ్యర్థుల్లో వారి సంఖ్య తక్కువగా ఉండడం, రాజకీయ రణక్షేత్రంలో మహిళల పూర్తిస్థాయి ప్రాతినిధ్యానికి ఉన్న అడ్డంకులపై విస్తృత ప్రశ్నలను లేవనెత్తుతోంది’’ అని అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అహ్మద్‌ అన్సారీ తెలిపారు. రాజకీయాల్లో మహిళా భాగస్వామ్యం పెంపుదలకు నిర్మాణాత్మక సంస్కరణల ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img