icon icon icon
icon icon icon

ప్రజలను నమ్మించి మోసం చేసిన మోదీ

ప్రజలను మోదీ నమ్మించి మోసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం కర్ణాటకలోని సేడం, గుర్మిట్కల్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘గత పదేళ్లలో ప్రజలకు మోదీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు.

Updated : 30 Apr 2024 22:32 IST

కర్ణాటక ప్రచార సభల్లో రేవంత్‌రెడ్డి

ఈనాడు-హైదరాబాద్‌, బెంగళూరు: ప్రజలను మోదీ నమ్మించి మోసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం కర్ణాటకలోని సేడం, గుర్మిట్కల్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘గత పదేళ్లలో ప్రజలకు మోదీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. నల్లధనాన్ని తెచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తామని చెప్పి మోసం చేశారు. 40 కోట్ల మంది పేదలతో బ్యాంకు ఖాతాలు తెరిపించిన మోదీ.. వారి ఖాతాల్లో ఒక్క పైసా కూడా వేయలేదు. భాజపాను ఓడించి, ప్రజలకు అండగా ఉండే కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలి. మీ కోసం కొట్లాడేవారికే ఓటువేయండి. భాజపా నేతలకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకే మోదీ 400 సీట్లు కావాలంటున్నారు. రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్‌కు ఓటు వేయండి. మోదీ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్‌ గాంధీ పోరాటం చేస్తున్నారు. కర్ణాటకలో 25 మంది కాంగ్రెస్‌ ఎంపీలను గెలిపించి.. మోదీని గద్దె దించడానికి సహకరించాలి. మోదీకి గుజరాత్‌ అండగా ఉన్నట్లే.. ఖర్గేకు కర్ణాటక అండగా నిలవాలి. కాంగ్రెస్‌లో ఓ సాధారణ కార్యకర్త కూడా ఏఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టవచ్చని మల్లికార్జున ఖర్గే నిరూపించారు. ఇవి కర్ణాటక, గుజరాత్‌ మధ్య జరుగుతున్న ఎన్నికలు. మొన్న కర్ణాటకలో, నిన్న తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. రేపు కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఐదు గ్యారంటీ హామీలను ప్రభుత్వం అమలు చేసింది. తెలంగాణలోనూ ఆరు గ్యారంటీల్లోని హామీల్లో ఐదింటిని అమలు చేస్తున్నాం. గత లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి 25 మంది భాజపా అభ్యర్థులను ఎంపీలుగా ప్రజలు గెలిపిస్తే.. కర్ణాటకకు మోదీ ఇచ్చింది ఒకే ఒక్క క్యాబినెట్‌ మంత్రి పదవి. గుజరాత్‌లో 26 మంది ఎంపీల్లో ఏడుగురికి మంత్రి పదవులు దక్కాయి. ఇది కర్ణాటకకు జరిగిన అన్యాయం. కరవు వచ్చినా ఆయన ఇచ్చిందేమీ లేదు. కనీసం బెంగళూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదు’’ అని విమర్శించారు.

ప్రజ్వల్‌ రేవణ్ణ వ్యవహారంపై ఏం బదులిస్తారు: ప్రియాంక

దేశానికి ఎంతో మంది ప్రధానులు వచ్చారని.. వారంతా సత్యమార్గంలో నడిచారని, మోదీ మాత్రం ఏమీ చేయలేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తప్పుపట్టారు. సేడం సభలో ఆమె ప్రసంగించారు. మహిళల మంగళసూత్రాల గురించి ప్రధాని మోదీ పదే పదే మాట్లాడుతున్నారని.. ఎంతో మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఎన్‌డీఏ నేత ప్రజ్వల్‌ రేవణ్ణ తరఫున ప్రచారం చేసిన మోదీ, అమిత్‌ షాలు నేడు ఏం బదులిస్తారని ప్రశ్నించారు. క్రీడాకారులను వేధించినా, మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడినా మోదీ మౌనంగా ఉంటారని మండిపడ్డారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ మోదీ, అమిత్‌షాలు నిత్యం కాంగ్రెస్‌ను విమర్శించటం తప్ప ప్రజలకు ఏం చేశారో చెప్పరన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img