icon icon icon
icon icon icon

జేడీఎస్‌ నుంచి ప్రజ్వల్‌ను తొలగిస్తాం

మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్‌లపై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్రంలో జనతాదళ్‌(ఎస్‌)తో కలసి ఎన్నికల్లో పోటీ చేసిన ఎన్డీయేకు ఈ పరిణామం ఇబ్బందిగా మారింది.

Updated : 30 Apr 2024 22:30 IST

ఆ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి వెల్లడి
కర్ణాటక రాజకీయాల్లో లైంగిక దౌర్జన్యం కేసు దుమారం

ఈనాడు, బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్‌లపై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్రంలో జనతాదళ్‌(ఎస్‌)తో కలసి ఎన్నికల్లో పోటీ చేసిన ఎన్డీయేకు ఈ పరిణామం ఇబ్బందిగా మారింది. ఇక్కడి 28 ఎంపీ స్థానాలకు భాజపా 25, జేడీఎస్‌ 3 స్థానాల్లో పోటీ చేశాయి. ఎన్డీయే కూటమి అభ్యర్థిగా హాసన నుంచి పోటీ చేసిన సిటింగ్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి, మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణలపై లైంగిక దౌర్జన్యం కేసు నమోదవడం తెలిసిందే. ప్రస్తుతం విదేశాలకు వెళ్లిపోయిన ప్రజ్వల్‌ కోసం గాలింపు చర్యలు మొదలయ్యాయి. ఈ కేసును సిట్‌ విచారణ చేపడుతోంది. వారిద్దరి వల్ల పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటోందని జేడీఎస్‌ నేతలు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజ్వల్‌ రేవణ్ణను పార్టీ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నానంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి సోమవారం ప్రకటించారు. ఇదే అంశంపై మంగళవారం అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు లైంగిక దౌర్జన్యం ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తలు పలుచోట్ల ఆందోళనలకు దిగారు. దేవేగౌడ, కుమారస్వామి ఇంటి ముందు సైతం నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక సోమవారం ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘కేవలం పది రోజుల కిందటే ఎన్డీయే అభ్యర్థి ప్రజ్వల్‌ కోసం మోదీ ప్రచారం చేశారు. ఆ నేతను కొనియాడారు. నేడు అదే అభ్యర్థి మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయారు’ అని విమర్శించారు. ఈ వ్యవహారంతో ఎన్డీయేకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు.

ఇదంతా కుట్ర: రేవణ్ణ

లైంగిక దౌర్జన్యం కేసులో తమను అరెస్టు చేయకుండా విచారణ చేసేలా ఆదేశాలివ్వాలని హెచ్‌డీ రేవణ్ణ న్యాయస్థానంలో అర్జీ వేసుకునేందుకు సన్నాహాలు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ అనంతరం విదేశాలకు వెళ్లాలని ప్రజ్వల్‌ ముందుగా నిర్ణయించుకున్నారని, కేసు నమోదు కావడంతో పరారయ్యారనేది అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఐదేళ్ల కిందటి ఘటనపై ఆమె ఇప్పుడు ఫిర్యాదు చేయడం వెనుక రాజకీయ కుట్రకోణం ఉందని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img