icon icon icon
icon icon icon

శత్రువులే మిత్రులైన వేళ!

మహారాష్ట్రలో విచిత్ర పరిస్థితి నెలకొంది. మిత్రులు శత్రువులుగా.. శత్రువులు మిత్రులుగా మారుతున్నారు. రాష్ట్రంలో పార్టీలు చీలిపోయి రెండు కూటముల్లో చేరిపోవడంతో ఎవరు ఎటు ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది.

Updated : 30 Apr 2024 22:46 IST

మహారాష్ట్రలో విచిత్ర పరిస్థితి

ముంబయి: మహారాష్ట్రలో విచిత్ర పరిస్థితి నెలకొంది. మిత్రులు శత్రువులుగా.. శత్రువులు మిత్రులుగా మారుతున్నారు. రాష్ట్రంలో పార్టీలు చీలిపోయి రెండు కూటముల్లో చేరిపోవడంతో ఎవరు ఎటు ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది.

  • నాందేడ్‌లో చికలికర్‌ ఒకప్పుడు శివసేన ఎమ్మెల్యే. చవాన్‌కు బద్ధ శత్రువు. చికలికర్‌ 2019లో భాజపాలో చేరారు. నాందేడ్‌లో ఆయన చవాన్‌ను ఓడించారు. ప్రస్తుతం చవాన్‌ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన చికలికర్‌ తరఫున ఈసారి ప్రచారం చేస్తున్నారు.
  • మావల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ కుమారుడు పార్థ్‌ పవార్‌ను శివసేన నేత శ్రీరంగ్‌ బర్నే ఓడించారు. శరద్‌ పవార్‌ కుటుంబంలో ఓటమి చవిచూసిన తొలి వ్యక్తిగా పార్థ్‌ పవార్‌ నిలిచారు. 2024కు వచ్చేసరికి అజిత్‌ పవార్‌ భాజపా కూటమిలో చేరి తన కుమారుడిని ఓడించిన బర్నే తరఫున ప్రచారం చేస్తున్నారు. బర్నే శిందే నేతృత్వంలోని శివసేన తరఫున బరిలోకి దిగారు.
  • శివసేనలో ఉన్న సినీ, టీవీ నటుడు అమోల్‌ కోల్హేను ఎన్సీపీలోకి తీసుకొచ్చిన అజిత్‌ పవార్‌ 2019లో శిరూర్‌ నుంచి పోటీ చేయించారు. ఆయన అప్పటి సిటింగ్‌ శివసేన ఎంపీ అధల్‌రావ్‌ పాటిల్‌ను ఓడించారు. కోల్హే ఇప్పుడు శరద్‌ పవార్‌ పార్టీలో ఉన్నారు. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా శిరూర్‌ సీటు అజిత్‌ వర్గానికి దక్కింది. దీంతో కోల్హేను ఓడించేందుకు శివసేనలో ఉన్న అధల్‌రావ్‌ను ఎన్సీపీ తరఫున అజిత్‌ పోటీ చేయిస్తున్నారు. ఇప్పుడు కోల్హేకు వ్యతిరేకంగా అజిత్‌ ప్రచారం చేయాల్సి వస్తోంది. గత ఎన్నికల్లో అధల్‌రావ్‌కు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేశారు.
  • ముంబయి దక్షిణ మధ్య నియోజకవర్గంలో శిందే శివసేన తరఫున రాహుల్‌ శివాలే పోటీ చేస్తున్నారు. ఆయన శివసేన నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం శిందే వర్గంలో ఉన్నారు. ఈ సీటులో ఉద్ధవ్‌ పార్టీ తరఫున అనిల్‌ దేశాయ్‌ పోటీ చేస్తున్నారు. దేశాయ్‌కు మద్దతుగా కాంగ్రెస్‌ నేత వర్ష గైక్వాడ్‌ ప్రచారం చేస్తున్నారు. వర్ష తండ్రి ఏక్‌నాథ్‌ గైక్వాడ్‌ను 2014లో శివాలే ఓడించారు.
  • బారామతిలో పవార్‌ కుటుంబంలోనే పోరు సాగుతోంది. తన సోదరి సుప్రియా సూలే తరఫున గత కొన్ని దశాబ్దాలుగా ప్రచారం చేస్తూ వస్తున్న అజిత్‌ పవార్‌ ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా రంగంలోకి దిగారు. ఇక్కడ తన సతీమణి సునేత్రా పవార్‌ను పోటీకి నిలిపారు. ఈ విషయంలో కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. అజిత్‌ చిన్న తమ్ముడైన శ్రీనివాస్‌, ఆయన కుటుంబ సభ్యులు సుప్రియా సూలేకు మద్దతు తెలిపారు.
  • బీడ్‌లో ఎంపీ ప్రీతమ్‌ ముండేను మార్చి ఆమె సోదరి పంకజ ముండేకు భాజపా టికెట్‌ ఇచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పంకజను ఆమె కజిన్‌ ధనంజయ్‌ ముండే ఓడించారు. ధనంజయ్‌ ఇప్పుడు అజిత్‌ పవార్‌ పార్టీతో ఉన్నారు. దీంతో ఆయన పంకజ తరఫున ప్రచారం చేయాల్సి వస్తోంది.
  • రాయ్‌గఢ్‌లో గత ఎన్నికల్లో శివసేన ఎంపీ అనంత్‌ గీతేను ఎన్సీపీకి చెందిన సునీల్‌ తత్కారే ఓడించారు. అప్పట్లో కాంగ్రెస్‌ తత్కారేకు మద్దతుగా నిలిచింది. ఇప్పుడు తత్కారే అజిత్‌ వర్గంలో ఉన్నారు. గీతే ఉద్దవ్‌తోనే ఉన్నారు. ఇప్పుడు గీతే తరఫున కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img