icon icon icon
icon icon icon

కళంకిత కాంగ్రెస్‌ కలలు కంటోంది

కళంకిత నేపథ్యం ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని లాక్కోవాలని కలలు కంటోందని, ముగిసిన రెండు దశల లోక్‌సభ ఎన్నికల పోలింగులో ‘ఇండియా’ కూటమి ఇప్పటికే ఓడిపోయిందన్న విషయాన్ని గ్రహించడం లేదని ప్రధాని మోదీ అన్నారు.

Updated : 30 Apr 2024 22:29 IST

ఇండియా కూటమిలో నాయకత్వ యుద్ధం
ఫేక్‌ వీడియోలతో భాజపాపై దుష్ప్రచారం
మహారాష్ట్ర, కర్ణాటక సభల్లో ప్రధాని మోదీ

పుణె, సోలాపుర్‌, సతారా: కళంకిత నేపథ్యం ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని లాక్కోవాలని కలలు కంటోందని, ముగిసిన రెండు దశల లోక్‌సభ ఎన్నికల పోలింగులో ‘ఇండియా’ కూటమి ఇప్పటికే ఓడిపోయిందన్న విషయాన్ని గ్రహించడం లేదని ప్రధాని మోదీ అన్నారు. సోమవారం మహారాష్ట్ర, కర్ణాటక ప్రచారసభల్లో ఆయన మాట్లాడారు. సోలాపుర్‌ ర్యాలీలో మోదీ ప్రసంగిస్తూ.. దేశ ప్రజలు ఇప్పటికే పదేళ్లు తనను పరీక్షించారని, మరోవైపు విపక్ష ఇండియా కూటమిలో నాయకత్వ సంక్షోభం ఉందన్నారు. దీని కోసం జరిగిన మహాయుద్ధంలో దేశాన్ని దోచుకునేలా అయిదేళ్లకు అయిదుగురు ప్రధానమంత్రుల ఫార్ములాతో ఓ ఒప్పందానికి విపక్షాలు వచ్చాయన్నారు. ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకోలేనివారి చేతికి దేశ పరిపాలన పగ్గాలు అందించి, మళ్లీ ఆ తప్పు చేస్తారా? అని మోదీ ప్రశ్నించారు. ఉద్ధవ్‌ ఠాక్రే పార్టీని ఉద్దేశించి విమర్శలు చేస్తూ.. నాయకత్వానికి తమ కూటమిలో పలువురు నేతలు ఉన్నట్లు ‘నకిలీ’ శివసేన చెబుతోందని, వారి లక్ష్యమంతా ‘మలాయ్‌’ (వెన్న/అవినీతికి సూచికగా) తినడమేనని ఎద్దేవా చేశారు.  పుణె సభలో మాట్లాడిన మోదీ ఎన్సీపీ సీనియర్‌ నేత శరద్‌ పవార్‌ పేరెత్తకుండా రాజకీయాల్లో అస్థిరతల యుగానికి నాంది పలికిన ‘సంచార ఆత్మ’గా ఆయనను అభివర్ణించారు. కాంగ్రెస్‌ను వీడుతున్నవారంతా ఆ పార్టీ ఇప్పుడు మావోయిస్టుల నియంత్రణలోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారన్నారు.

పెద్ద సంఘటన సృష్టిస్తారేమో!

భాజపా సారథ్యంలోని తమ సర్కారును ప్రత్యర్థులు నేరుగా ఎదుర్కొనలేక, కృత్రిమమేధను దుర్వినియోగం చేస్తూ నకిలీ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నట్లు ప్రధాని ఆరోపించారు. పశ్చిమ మహారాష్ట్ర సతారా జిల్లా కరాడ్‌ ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. ‘‘వచ్చే నెల ఓ పెద్ద సంఘటన సృష్టించాలని వీరంతా చూస్తున్నారు. ఇటువంటి వీడియోలపై అధికారులకు ఫిర్యాదు చేయండి’’ అని ప్రజలను కోరారు. ఈ వీడియోల వెనుక ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని ఈసీని తాను కోరుతున్నట్లు ప్రధాని చెప్పారు.


కర్ణాటక ఖజానా ఖాళీచేసిన వసూల్‌ గ్యాంగ్‌

ఈనాడు, బెంగళూరు: ఓటుబ్యాంకు రాజకీయాల కోసం మతప్రాతిపదికన రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తోందని, తాను అలా జరగనివ్వనని ప్రధాని మోదీ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు భాజపా వైపు ఉన్నందున మైనార్టీలను బుజ్జగించాలని హస్తం పార్టీ చూస్తోందన్నారు. కర్ణాటకలోని బాగల్‌కోటె ఎన్నికల ప్రచారసభలో మాట్లాడిన ఆయన.. స్థానిక కాంగ్రెస్‌ ప్రభుత్వం స్వల్పకాలంలోనే రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌.. ప్రభుత్వాన్ని నడపటం లేదని, వసూల్‌ గ్యాంగ్‌ను నడుపుతోందని తీవ్రస్థాయిలో ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img