icon icon icon
icon icon icon

సంక్షిప్త వార్తలు (3)

కర్ణాటకలో కాంగ్రెస్‌ ఓబీసీ కోటా నుంచి 4% రిజర్వేషన్లను ముస్లింలకు కేటాయించింది. గతంలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ.. ఎస్సీ-ఎస్టీ, ఓబీసీల కోటా నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు కట్టబెట్టేందుకు నాలుగుసార్లు చట్టాన్ని తీసుకొచ్చింది.

Updated : 01 May 2024 05:58 IST

రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉందిగా..

కర్ణాటకలో కాంగ్రెస్‌ ఓబీసీ కోటా నుంచి 4% రిజర్వేషన్లను ముస్లింలకు కేటాయించింది. గతంలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ.. ఎస్సీ-ఎస్టీ, ఓబీసీల కోటా నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు కట్టబెట్టేందుకు నాలుగుసార్లు చట్టాన్ని తీసుకొచ్చింది. మేమేమీ ముస్లింలకు వ్యతిరేకం కాదు. కానీ మన దేశంలో మతపరమైన రిజర్వేషన్లకు తావులేదని రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉన్న సంగతిని అర్థం చేసుకోవాలి.

కర్ణాటకలోని శివమొగ్గలో నిర్వహించిన సభలో భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా


అవును.. ఈ ఆత్మ సంచరిస్తోంది!

నా వేలు పట్టుకొని రాజకీయాల్లోకి వచ్చానని కొన్నేళ్ల కిందట పుణెలో మోదీ చెప్పారు. ఇప్పుడేమో నన్ను సంచార ఆత్మగా అభివర్ణిస్తూ.. మహారాష్ట్రలో అస్థిరతకు కారణమవుతున్నానని విమర్శిస్తున్నారు. నిజమే! ఈ ‘ఆత్మ’ అస్థిరంగా ఉండి సంచరిస్తోంది.. కానీ స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. రైతుల కష్టాలను పాలకుల కళ్లకు కట్టడం కోసం. ద్రవ్యోల్బణం దెబ్బకు సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను బయటపెట్టడం కోసం. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు ఇంతకంటే వంద రెట్లు అవిశ్రాంతంగా సంచరించేందుకు నేను సిద్ధంగా ఉన్నా.

 పుణెలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌


భాజపా మళ్లీ గెలిస్తే దేశం 15 ఏళ్లు వెనక్కి వెళ్తుంది

భాజపా నేతలు కుల ప్రాతిపదికన ప్రజలను రెచ్చగొడతారు. వారి మనోభావాలతో ఆడుకుంటారు. అసలు విషయాల నుంచి అందరి దృష్టిని మళ్లిస్తారు. ఆ పార్టీ నేతలు దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నారో ప్రతిఒక్కరికీ అర్థమవుతోంది. పోషకాహార లేమి, ఆకలికి సంబంధించిన అంతర్జాతీయ ర్యాంకింగ్‌లలో భారత స్థానం ఏంటో అందరూ చూస్తున్నారు. భాజపా మళ్లీ గెలిస్తే.. దేశం 15 ఏళ్లు వెనక్కి వెళ్తుంది.

 పీటీఐ వార్తాసంస్థ ముఖాముఖిలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్‌ యాదవ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img