icon icon icon
icon icon icon

రాజ్యాంగ ప్రతిని సభలకు తీసుకువెళ్లండి: రాహుల్‌

బహిరంగ సభలకు వెళ్లేటప్పుడు, నామినేషన్ల దాఖలు సమయంలో రాజ్యాంగ ప్రతులను వెంట తీసుకువెళ్లాలని కాంగ్రెస్‌ అభ్యర్థులను ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ కోరారు.

Updated : 01 May 2024 05:54 IST

దిల్లీ, భిండ్‌: బహిరంగ సభలకు వెళ్లేటప్పుడు, నామినేషన్ల దాఖలు సమయంలో రాజ్యాంగ ప్రతులను వెంట తీసుకువెళ్లాలని కాంగ్రెస్‌ అభ్యర్థులను ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ కోరారు. కాంగ్రెస్‌ ఉన్నంతకాలం భాజపా గానీ, ప్రపంచంలో మరే శక్తిగానీ రాజ్యాంగాన్ని లాక్కొనిపోజాలదని, ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలని సూచించారు. సోమవారం గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌లలోని సభలకు, మంగళవారం మధ్యప్రదేశ్‌లోని భిండ్‌కు రాజ్యాంగ ప్రతులతో రాహుల్‌ హాజరయ్యారు. ‘ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం గర్వకారణం. పేదలకు అదొక వరం. పవిత్రమైన రాజ్యాంగాన్ని మీతోపాటు తీసుకువెళ్లండి. దానిని మనం పరిరక్షిస్తామని వాడవాడలా చాటండి’ అని ‘ఎక్స్‌’లో సూచించారు.

భాజపా వస్తే అంతే..

భిండ్‌లో జరిగిన సభలో రాహుల్‌ మాట్లాడుతూ- భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని ముక్కలుగా చించి అవతల పారేస్తుందని హెచ్చరించారు. పేదలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు స్వాతంత్య్ర పూర్వం లేని హక్కులు 1950 నుంచి లభించడానికి రాజ్యాంగమే కారణమని అన్నారు. భాజపా నెగ్గితే ఆ హక్కులతో పాటు భూమిపై అధికారం, ఉపాధి హామీ చట్టం, పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు కూడా మాయమైపోతాయని హెచ్చరించారు. దేశాన్ని 25 మంది కుబేరులు నడపాలని భాజపా కోరుకుంటోందని చెప్పారు. అంబేడ్కర్‌తో కలిసి కాంగ్రెస్‌ నేతలు బ్రిటిష్‌వారితో పోరాడి రాజ్యాంగాన్ని సాధించినట్లు గుర్తుచేశారు. ‘రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకం కానిపక్షంలో ప్రభుత్వరంగాన్ని ఎందుకు ప్రైవేటుపరం చేస్తున్నారు? అగ్నివీర్‌ పథకాన్ని ఎందుకు తీసుకువచ్చారు? ఇవన్నీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదా?’ అని ప్రశ్నించారు. పేదలు, రైతులు, కూలీలు, చిరు వ్యాపారులు తీసుకున్న రుణాలను రద్దు చేయకుండా ఓ 25 మందికి చెందిన రూ.16 లక్షల కోట్ల అప్పుల్ని ఎలా మాఫీ చేశారని నిలదీశారు. అయోధ్య రామాలయ వేడుకలో పేదలు, రైతులెవరూ కనిపించలేదని, వచ్చినవాళ్లంతా ఈ 25 మంది లాంటి ధనికులు, ప్రముఖులేనని చెప్పారు. రామాలయం, పార్లమెంటు నూతన భవనాల ప్రారంభోత్సవాల్లో రాష్ట్రపతి కాకుండా ప్రధాని ఒక్కరే కనిపించడమేమిటన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి విపక్ష కూటమి పోరాడుతోందని చెప్పారు. ప్రస్తుత ఎన్నికలు సాధారణ రాజకీయ తంతు కాదని, ఇది రెండు సిద్ధాంతాల మధ్య పోరు అని అభివర్ణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img