icon icon icon
icon icon icon

ఉగ్రదాడులు జరిగితే వారి ఇళ్లలోకి వెళ్లి కొడతాం

ముంబయి ఉగ్రదాడులు జరిగాక అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పాకిస్థాన్‌కు డోసియర్స్‌ (దాడుల వివరాలతో పత్రాలు) పంపిందని, భాజపా పాలనలోని నయా భారత్‌ ఉగ్రవాదుల ఇళ్లలోకి వెళ్లి కొడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

Updated : 01 May 2024 05:51 IST

 ‘ప్రేమ దుకాణం’లో ఫేక్‌ వీడియోల విక్రయాలు
మహారాష్ట్ర సభల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

లాతూర్‌, ధారాశివ్‌, సోలాపుర్‌: ముంబయి ఉగ్రదాడులు జరిగాక అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పాకిస్థాన్‌కు డోసియర్స్‌ (దాడుల వివరాలతో పత్రాలు) పంపిందని, భాజపా పాలనలోని నయా భారత్‌ ఉగ్రవాదుల ఇళ్లలోకి వెళ్లి కొడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మీడియాలోని కొంతమంది మిత్రులు ఇలా ఒక్కో డోసియర్‌ ఇచ్చినపుడల్లా అప్పట్లో అదే పెద్దవార్తగా పొంగిపోయేవారన్నారు. మహారాష్ట్రలో వరుసగా రెండోరోజు మంగళవారం లాతూర్‌, ధారాశివ్‌, మాల్‌శిరస్‌ (సోలాపుర్‌) ఎన్నికల ర్యాలీలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్‌ సారథ్యంలోని విపక్ష కూటమి కాషాయదళాన్ని ఎదుర్కొనలేక కృత్రిమమేధతో రూపొందించిన ఫేక్‌ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తోందన్నారు. ‘మొహబ్బత్‌ కీ దుకాన్‌’ (రాహుల్‌ నినాదమైన ప్రేమ దుకాణం)లో ఈ నకిలీ వీడియోలను అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. ఇటువంటి అబద్ధాల దుకాణం మూతపడాలన్నారు. కొంతమంది ప్రధాని పదవిని ఇన్‌స్టాల్‌మెంట్ల కింద మార్చాలని చూస్తున్నారని విపక్షాలను మోదీ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ, సమస్యలు కవల పిల్లల్లాంటివని, ఆ పార్టీ దేశానికి ఇచ్చింది పేదరికం తప్ప మరేదీలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా భోజన టేబుళ్లపై చిరుధాన్యాలు చేరేలా చూస్తానని, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ శ్వేతసౌధంలో తనకు ఇచ్చిన అధికారిక విందు మెనూలోనూ ఇవి ఉన్నట్లు ప్రధాని తెలిపారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన కింద రైతుల ఖాతాలకు రూ.3 లక్షల కోట్లు బదిలీ చేశామని, ఇందులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదన్నారు.

శరద్‌ పవార్‌ను శిక్షించే సమయం వచ్చింది..

మహారాష్ట్ర పర్యటనలో తొలిరోజు ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ను ‘సంచార ఆత్మ’గా అభివర్ణించిన ప్రధాని మోదీ రెండోరోజైన మంగళవారం కూడా ఈ దాడిని కొనసాగించారు. రిమోట్‌ కంట్రోల్‌ సర్కారులో ఆయన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసి చెరకు రైతులకు బకాయిలు కూడా ఇప్పించలేదన్నారు. ‘‘పదిహేనేళ్ల కిందట ఓ దిగ్గజ నేత (శరద్‌ పవార్‌) ఇక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ సందర్భంగా ఈ కరవు పీడిత ప్రాంతానికి నీరు తెస్తానని అస్తమించే సూర్యుడి ముందు ప్రమాణం చేసినట్లు చెబుతారు. మరి.. నీరు తెచ్చారా? ఆయనను శిక్షించే సమయం ఆసన్నమైంది. 2014 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు వంద నీటిపారుదల ప్రాజెక్టులు ఏళ్లతరబడి పెండింగులో ఉన్నాయి. ఇందులో మహారాష్ట్రకు చెందినవే 35. గత పదేళ్లలో మేము ఆ వందలో 66 ప్రాజెక్టులను పూర్తిచేశాం’’ అని ప్రధాని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img