icon icon icon
icon icon icon

ప్రజ్వల్‌పై చర్యల్లో జాప్యమెందుకు?

మహిళలపై లైంగికదాడి విషయంలో ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై కర్ణాటక ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రశ్నించారు.

Updated : 01 May 2024 05:46 IST

అది కర్ణాటక సర్కారు పనికదా!
మహిళల్ని కించపరిస్తే సహించేది లేదు: అమిత్‌ షా

గువాహటి: మహిళలపై లైంగికదాడి విషయంలో ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై కర్ణాటక ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రశ్నించారు. మహిళల్ని కించపరిస్తే భాజపా సహించబోదని స్పష్టంచేశారు. ఆయన మంగళవారం గువాహటిలో విలేకరులతో మాట్లాడారు. ‘ఎన్డీయే భాగస్వామ్యపక్ష అభ్యర్థి ఈ ఘటనలో ఉన్నట్లు కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. నా ప్రశ్న ఒకటే. కర్ణాటకలో అధికారంలో ఉన్నదెవరు? కాంగ్రెస్‌ సర్కారే కదా! జరిగిన ఘటన వారి దృష్టికి వచ్చి ఉండాలి కదా! మరి ఈరోజు వరకు కర్ణాటక ప్రభుత్వం ఏం చేస్తోంది? దర్యాప్తునకు మేం సుముఖమే. రేవణ్ణ విషయంలో మీడియాలో వచ్చిన కథనాలు ఎంతో బాధాకరం. శాంతిభద్రతల అంశం రాష్ట్ర పరిధిలోనిది కావడంతో మేమెలాంటి చర్యలు చేపట్టలేం’ అని తేల్చిచెప్పారు.

అబద్ధాలు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌

రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్లను రద్దు అంటూ తమపై కాంగ్రెస్‌ అనేక అబద్ధాలు ప్రచారం చేస్తోందని షా మండిపడ్డారు. ఓటర్లను తాము మైనారిటీ, మెజార్టీ అనే కోణంలో చూడబోమని స్పష్టంచేశారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కోతపెట్టింది కాంగ్రెస్‌ పార్టీయేనని, కర్ణాటకలోనూ ఎలాంటి సర్వే లేకుండానే 4% కోటాను మైనారిటీలకు ఆ పార్టీ ప్రభుత్వమే ఇచ్చిందని విమర్శించారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగం ప్రకారం చెల్లదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అలాంటి కోటాను రద్దుచేస్తామన్నారు. అసహనంతోనే కాంగ్రెస్‌ పార్టీ నకిలీ వీడియోలు తయారు చేస్తోందని, తమ మాటలు వక్రీకరించి దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ‘రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు తీసుకున్న నాటినుంచి రాజకీయాలను మరింత దిగజార్చేపనిలో ఉన్నారు. నకిలీ వీడియో దృశ్యాలను ప్రచారం చేసి, ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేయడం ఆమోదయోగ్యం కాదు. ఏ పార్టీ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడకూడదు’ అని అమిత్‌ షా అన్నారు.

సొంతసీట్లను వదిలి పారిపోతున్నారు

రాహుల్‌, ప్రియాంక ఎన్నికల బరిలో ఉంటారా, లేదా అనేది తెలియదని, ధైర్యం లేక ఆ పార్టీ అగ్రనేతలు సొంత సీట్లను వదిలిపారిపోయిన పరిస్థితి ఉందని షా అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో మత ప్రాతిపదికన చట్టాలు ఉండడం సబబు కాదని, అందుకే తాము ఉమ్మడి పౌరస్మృతి అమలుకు అనుకూలంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. పశ్చిమబెంగాల్‌లోని తూర్పు బర్ధమాన్‌ జిల్లాలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ- చొరబాటుదారుల ఓటుబ్యాంకు దెబ్బతింటుందనే భయంతోనే ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అయోధ్యలో వేడుకకు హాజరుకాలేదని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img