icon icon icon
icon icon icon

ఎంపీ ప్రజ్వల్‌పై ఎట్టకేలకు వేటు

మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను జనతా దళ్‌ (సెక్యులర్‌) అధినాయకత్వం మంగళవారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.

Updated : 01 May 2024 05:50 IST

జనతా దళ్‌ కీలక నిర్ణయం
బాధిత మహిళలను విచారిస్తున్న సిట్‌

ఈనాడు, బెంగళూరు: మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను జనతా దళ్‌ (సెక్యులర్‌) అధినాయకత్వం మంగళవారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ‘మహిళలపై ప్రజ్వల్‌ లైంగిక దాడికి పాల్పడినట్లు కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయి. ఈ వ్యవహారం పార్టీ ప్రతిష్ఠకు, నేతల గౌరవానికి మచ్చ తెచ్చేలా ఉంది. ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో విచారణ జరుపుతోంది. పార్టీ నిబంధనల ప్రకారం ప్రజ్వల్‌ రేవణ్ణను తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నాం’ అని జేడీఎస్‌ మహా ప్రధాన కార్యదర్శి కె.ఆర్‌.శివకుమార్‌ ఓ ప్రకటన జారీ చేశారు. ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హెచ్‌.డి.రేవణ్ణపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మరోవైపు ఈ కేసులో 24 గంటల్లోపు విచారణకు హాజరు కావాలని రేవణ్ణ, ప్రజ్వల్‌కు సిట్‌ తాఖీదులు జారీ చేసింది. సిట్‌ సీనియర్‌ ఏడీజీపీ బి.కె.సింగ్‌ నేతృత్వంలోని 18 మంది అధికారుల బృందం ఆధారాల సేకరణలో నిమగ్నమైంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియోలను ఎఫ్‌ఎస్‌ఎల్‌ పరిశీలనకు పంపినట్లు అధికారులు వెల్లడించారు. హాసనలోని హొళెనరసీపుర స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితురాలితో పాటు వీడియోల్లో కనిపిస్తున్న మహిళలను గుర్తించిన సిట్‌.. వారి నుంచి వివరాలు సేకరించి, కేసును అధ్యయనం చేయనున్నట్లు తెలిపింది.

ఎన్నికల వేళ కుట్ర: కుమారస్వామి

ఎన్నికల సమయంలో ఇలాంటి వీడియోలను విడుదల చేయడం రాజకీయ కుట్రలో భాగమని జనతా దళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. ఆయన మంగళవారం హుబ్బళ్లిలో విలేకరులతో మాట్లాడుతూ ఇలాంటి ఘటన గతంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడి విషయంలోనూ జరిగిందని గుర్తుచేశారు. ‘నాడు ప్రధాని మోదీ, నాటి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ సహకారంతో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆ మాత్రం కృతజ్ఞత లేని కాంగ్రెస్‌.. ప్రజ్వల్‌ విషయంలో భాజపాను కూడా దోషిగా చిత్రీకరించే ప్రయత్నం సరికాదు. ప్రజ్వల్‌ దోషిగా తేలితే పార్టీ నుంచి శాశ్వతంగా తొలగించేందుకు వెనకాడం. రాష్ట్ర ప్రభుత్వం ఈ వీడియోల్లో ఉన్న మహిళలకు రక్షణ కల్పించే ప్రయత్నం చేయలేదు. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్‌ కాకుండా చూడాల’ని కోరారు. ఈ వీడియోల వెనుక కాంగ్రెస్‌ నాయకుడొకరు ఉన్నారంటూ పరోక్షంగా డీకే శివకుమార్‌నుద్దేశించి ఆరోపించారు. కుమారస్వామి వ్యాఖ్యలపై స్పందించిన శివకుమార్‌.. తాను ఏదైనా తేల్చుకోవాలంటే నేరుగా ఎన్నికల్లోనే తలపడతానని, ఇలాంటి చిల్లర వీడియోలతో రాజకీయం చేయనని బదులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img