icon icon icon
icon icon icon

ఓట్‌ జిహాద్‌కు ఎస్పీ నేత పిలుపు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఇండియా కూటమి అభ్యర్థి నావల్‌ కిశోర్‌ శాక్యను గెలిపించేందుకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకురాలు మరియా ఆలం ‘ఓట్‌ జిహాద్‌’కు పిలుపునిచ్చారు.

Published : 01 May 2024 05:42 IST

ఫరూఖాబాద్‌లో ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి

ఫరూఖాబాద్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఇండియా కూటమి అభ్యర్థి నావల్‌ కిశోర్‌ శాక్యను గెలిపించేందుకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకురాలు మరియా ఆలం ‘ఓట్‌ జిహాద్‌’కు పిలుపునిచ్చారు. భాజపా ప్రభుత్వాన్ని తప్పించేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో మైనారిటీ వర్గానికి ఇది తప్పనిసరని స్పష్టంచేశారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు సల్మాన్‌ ఖుర్షీద్‌కు మేనకోడలు అయిన ఆలం సోమవారం కాయమాగంజ్‌లో ఎన్నికల ర్యాలీలో ఆయన సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మనమంతా చేతులు కలపాల్సిన సమయమని, లేకుంటే ఈ సంఘీ ప్రభుత్వం మన ఉనికినే తుడిచిపెట్టేస్తుందని హెచ్చరించారు. ‘‘రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నట్లు అందరూ చెబుతున్నారు. కానీ, మానవత్వానికి కూడా ముప్పు పొంచి ఉందని నేను చెబుతాను’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పుడు మానవత్వంపైనా దాడి జరుగుతోంది. మీరు దేశాన్ని, దేశ సౌందర్యాన్ని, మిశ్రమ సంస్కృతిని పరిరక్షించాలని భావిస్తే.. ఎవరివల్లా ప్రభావితం అవకుండా అత్యంత తెలివిగా ఓటు వేయండి’’ అని ఆలం చెప్పారు. సల్మాన్‌ ఖుర్షీద్‌ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమం వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

జిహాదీల మద్దతుతో ఇండియా కూటమి పోటీ: భాజపా

దిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకురాలు మరియా ఆలం ఓట్‌ జిహాద్‌ పిలుపుపై భాజపా మంగళవారం మండిపడింది. వారు (ప్రతిపక్ష పార్టీలు) జిహాదీల మద్దతుతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని వ్యాఖ్యానించింది. మరియా ప్రకటనను ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి, చర్యలు తీసుకోవాలని కోరింది. ‘‘జిహాదీలను రక్షించడం నుంచి.. వారు ఇప్పుడు ఓట్‌ జిహాద్‌కు మారిపోయారు. కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, ఇండియా కూటమి మొత్తం జిహాదీలకు అండగా నిలిచాయి. ఇప్పుడు వారు ఎన్నికల్లో కూడా జిహాద్‌ను చూస్తున్నారు’’ అని మంగళవారమిక్కడ భాజపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహబాజ్‌ పూనావాలా వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img