icon icon icon
icon icon icon

కంటి శస్త్రచికిత్స కారణంగానే ప్రచారానికి దూరంగా రాఘవ్‌ చడ్డా

తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్‌ చడ్డాకు తీవ్ర కంటి సమస్య ఉండడంతో చికిత్స చేయించుకోవడానికి ఆయన లండన్‌ వెళ్లారని దిల్లీ మంత్రి, ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ తెలిపారు.

Published : 01 May 2024 05:43 IST

దిల్లీ: తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్‌ చడ్డాకు తీవ్ర కంటి సమస్య ఉండడంతో చికిత్స చేయించుకోవడానికి ఆయన లండన్‌ వెళ్లారని దిల్లీ మంత్రి, ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ తెలిపారు. వెంటనే చికిత్స తీసుకోకపోతే ఆయన కంటిచూపు కోల్పోవాల్సి వస్తుందని వైద్యులు చెప్పారని చెప్పారు. ఆరోగ్యం కుదుటపడ్డాక చడ్డా ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని వెల్లడించారు. కొంతకాలంగా రాఘవ్‌ చడ్డా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన ఈ మేరకు స్పందించారు.

కేజ్రీవాల్‌ను మరోసారి కలిసిన మాన్‌

తిహాడ్‌ జైల్లో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ మంగళవారం మరోసారి కలిశారు. కేజ్రీవాల్‌ ఆరోగ్యంగానే ఉన్నారని.. ఇన్సులిన్‌ తీసుకుంటున్నారని వెల్లడించారు. అనంతరం మాన్‌ మీడియాతో మాట్లాడుతూ..‘‘లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం చురుగ్గా ప్రచారం నిర్వహించాలి. ప్రజలు తన గురించి ఆందోళన చెందొద్దని, ఎన్నికల సమయంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు’’ అని తెలిపారు. కేజ్రీవాల్‌ అరెస్టయి జైలుకు వెళ్లాక సీఎం భగవంత్‌ మాన్‌ ఆయన్ను కలవడం ఇది రెండోసారి.

 సిసోదియాకు బెయిల్‌ నిరాకరణ

దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాకు దిల్లీ కోర్టు మంగళవారం బెయిల్‌ నిరాకరించింది. ఈ మేరకు సీబీఐ, ఈడీల ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా స్పష్టం చేశారు. బెయిలిచ్చేందుకు ఈ కోర్టు సరైన వేదిక కాదని పేర్కొన్నారు. అవినీతి, మనీలాండరింగ్‌ కేసులకు సంబంధించి ప్రస్తుతం సిసోదియా తిహాడ్‌ జైల్లో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img