icon icon icon
icon icon icon

సంక్షిప్త వార్తలు (7)

దిల్లీలో ఆప్‌తో పొత్తు కాంగ్రెస్‌లో అంతర్గత సమస్యలకు దారి తీస్తోంది. వారం వ్యవధిలోనే ఆ పార్టీకి మరో షాక్‌ తగిలింది.

Updated : 02 May 2024 06:31 IST

దిల్లీలో కాంగ్రెస్‌కు ‘ఆప్‌’సోపాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీలో ఆప్‌తో పొత్తు కాంగ్రెస్‌లో అంతర్గత సమస్యలకు దారి తీస్తోంది. వారం వ్యవధిలోనే ఆ పార్టీకి మరో షాక్‌ తగిలింది. రెండు లోక్‌సభ సీట్లలోని ఇద్దరు పరిశీలకులు పార్టీని వీడారు. ఆప్‌తో పొత్తు కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వేర్వేరుగా రాసిన లేఖల్లో వారు పేర్కొన్నారు. పార్టీ పశ్చిమ, ఉత్తర దిల్లీ పార్లమెంట్‌ స్థానాల పరిశీలకులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు నీరజ్‌ బసోయా, నసీబ్‌ సింగ్‌ ఈ లేఖలు రాశారు.


ఖర్గేజీ! కాంగ్రెస్‌ ఓటమికి మిమ్మల్నే నిందిస్తారు

కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దుచేసే ఉద్దేశం మోదీ సర్కారుకు లేదు. అలా చేయాలని ఎవరైనా అనుకున్నా, పార్లమెంటులో మా సభ్యుడు ఒక్కరున్నా కూడా అడ్డుకుంటాం. పదేపదే బిగ్గరగా, బాహాటంగా అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్‌ నైజం. ఒక్క (గాంధీ) కుటుంబం కోసం అబద్ధాలు చెబుతూ పోవద్దని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గేకు నా సూచన. ఆ కుటుంబం ఎవరినీ పట్టించుకోదు. జూన్‌ 4న ఫలితాలు రాగానే అన్నాచెల్లీ (రాహుల్‌, ప్రియాంక) బాగానే ఉంటారు. ఎన్నికల్లో ఓటమికి 80 ఏళ్ల ఖర్గేయే మాటపడాల్సి ఉంటుంది.

ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా


ఓటింగ్‌ శాతం ఆకస్మికంగా ఎలా పెరిగింది?

లోక్‌సభ రెండు దశల పోలింగ్‌లో ఓటింగ్‌ శాతాన్ని ఆలస్యంగా విడుదల చేయడం, అది ఆకస్మికంగా పెరగడం అనుమానాలకు తావిస్తోంది. అంచనాల కంటే అధికారిక ప్రకటనలో ఓటింగ్‌ 5.75 శాతం ఎక్కువగా ఉంది. భాజపాకు అనుకూలంగా ఓటింగ్‌ జరగని చోట్ల ఇలాంటి పెరుగుదల ఉంది. ఇది ఆందోళనకరం. కొన్ని ఈవీఎంల ఆచూకీ చాలా రోజులుగా తెలియడం లేదు. భాజపా వాటిని తారుమారు చేసిందేమో?  

ముర్షిదాబాద్‌ జిల్లా ఎన్నికల ర్యాలీలో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత


పాపాలు చేసిన చేతులతోనే మోదీ పూజలు

దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, పేదల ఆకలి తీర్చకుండా ప్రధాని మోదీ పాపాలు చేస్తున్నారు. ఆ చేతులతోనే దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. ఆయన లక్ష్యం సమాజంలో సౌభ్రాతృత్వాన్ని చెడగొట్టడమే. మోదీ మతిభ్రమించిన వ్యక్తిలా ప్రసంగిస్తుంటారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేసేందుకు కాకుండా, దేశాన్ని ధనికులకు దోచిపెట్టేందుకే ఆయన ప్రధానమంత్రి అయ్యారు.

కర్ణాటకలోని యాద్గిర్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే


గాంధీ ఆశయం నెరవేరుతుంది.. కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోతుంది

మహాత్మాగాంధీ ఆశయాల్లో రెండింటిని ఈ ఎన్నికల్లో దేశప్రజలు నెరవేర్చనున్నారు. మొదటిది.. రాజకీయాల నుంచి కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోతుంది. రెండోది.. ప్రపంచంలో బలమైన దేశంగా భారత్‌ను నిలబెట్టడం. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్‌ని రద్దుచేయాలనేది గాంధీ ఆశయం.

ఈశాన్య దిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌


మత ప్రాతిపదికన విభజించకండి

ముస్లింలు ఎవరి హక్కులనూ లాక్కొనిపోరు. ఇతర మతాలను గౌరవించాలని అల్లా ప్రబోధించారు. అన్ని మతాలనూ సమానంగా చూస్తారనే ఉద్దేశంతోనే దేశవిభజన సమయంలో ముస్లిం ఆధిపత్య జమ్మూకశ్మీర్‌ భారత్‌తో ఉండాలని నిర్ణయించుకుంది. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. ఇండియా కూటమికి వ్యతిరేకులంతా దేశానికి వ్యతిరేకులు.

రాజౌరీ జిల్లాలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా


డీప్‌ఫేక్‌తో కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం

భయపెట్టడం, గందరగోళపరచడం, వదంతులు వ్యాప్తిచేయడం, ఇప్పుడు డీప్‌ఫేక్‌.. అన్నిరకాలుగా దుష్ప్రచారానికి కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. అత్యయిక పరిస్థితి విధించి, ప్రజాస్వామ్యాన్ని చెరబట్టింది ఆ పార్టీయే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మేం హక్కులు కల్పిస్తే కాంగ్రెస్సే వాటిని లాక్కొనిపోయింది. 400 సీట్ల లక్ష్యాన్ని చేరుకోవడంలో యూపీ కీలకంగా నిలుస్తుంది. రాముడిని తిరిగి తీసుకువచ్చినవారికి ప్రజలు మళ్లీ అధికారమిస్తారు.  

లఖ్‌నవూలో పీటీఐ వార్తాసంస్థతో కేంద్ర మంత్రి అనురాగ్‌ఠాకుర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img