icon icon icon
icon icon icon

‘మత’ రిజర్వేషన్ల ఉద్దేశం లేదని లిఖిత గ్యారంటీ ఇవ్వగలరా?

కాంగ్రెస్‌ మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అనుకుంటోందని, ఆ పార్టీ సారథ్యంలోని ‘ఇండియా’ కూటమికి అటువంటి ఉద్దేశం లేకపోతే లిఖితపూర్వక గ్యారంటీ ఇవ్వగలరా? అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సవాలు విసిరారు.

Updated : 02 May 2024 06:29 IST

కాంగ్రెస్‌ యువరాజుకు ఇదే నా సవాల్‌
గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని

బనాస్‌కాంఠా, హిమ్మత్‌నగర్‌ (గుజరాత్‌): కాంగ్రెస్‌ మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అనుకుంటోందని, ఆ పార్టీ సారథ్యంలోని ‘ఇండియా’ కూటమికి అటువంటి ఉద్దేశం లేకపోతే లిఖితపూర్వక గ్యారంటీ ఇవ్వగలరా? అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సవాలు విసిరారు. బుధవారం గుజరాత్‌లోని డీసా, హిమ్మత్‌నగర్‌ పట్టణాల ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మాట్లాడారు. మోదీ, భాజపా ఉన్నంతవరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాల విద్య, ఉద్యోగాల రిజర్వేషన్లు సురక్షితమన్నారు. ‘‘కాంగ్రెస్‌ యువరాజుకు (రాహుల్‌ను ఉద్దేశించి) నేను సవాలు చేస్తున్నా. ఆయన పార్టీ, వారి మద్దతుదారులు మతం పేరిట ఎన్నడూ రిజర్వేషన్లను దుర్వినియోగం చేయబోమని, రాజ్యాంగంతో ఆడుకోబోమని గ్యారంటీ ఇవ్వాలి. జనరల్‌ కేటగిరీలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పేదల రిజర్వేషన్లు ముట్టుకోబోమని రెండో గ్యారంటీ కూడా ఇవ్వాలి. ఈ రెండు గ్యారంటీలను కాంగ్రెస్‌ లిఖితపూర్వకంగా ఇవ్వాలి. అలా వారు ఎప్పటికీ చేయరు’’ అని ప్రధాని తెలిపారు. ‘‘మూడోవిడత కూడా మోదీ అధికారంలోకి వస్తే దేశం రగిలిపోతుందని కాంగ్రెస్‌ యువరాజు చెబుతున్నారు. వాస్తవానికి ఇపుడు కాంగ్రెస్‌ రగులుతోంది. ఎందుకంటే వారి కలలన్నీ ఇప్పటికే బూడిదగా మారిపోయాయి’’ అన్నారు.

400 స్థానాల మద్దతున్నా రాజ్యాంగం జోలికి వెళ్లలేదే!

రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని భాజపాపై కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారం పూర్తిగా కల్పితగాధ అని ప్రధాని కొట్టిపారేశారు. ‘‘రాజ్యాంగాన్ని మార్చేందుకే మోదీ 400 స్థానాలు అడుగుతున్నట్లు వాళ్లు (విపక్షాలు) అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. వాళ్లకు తెలియదేమో.. ఇపుడు రద్దుకానున్న లోక్‌సభలో ఎన్డీయేకు దాదాపు 360 మంది ఎంపీలు ఉన్నారు. బయట నుంచి మద్దతు ఇచ్చిన బీజేడీ, వైకాపా స్థానాలతో కలిపి 400కు ఎప్పుడో చేరుకున్నాం. కానీ, మేమొచ్చింది రాజ్యాంగాన్ని మార్చే పాపం చేయడానికి కాదు’’ అని మోదీ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ‘ప్రేమ దుకాణం’ ఎప్పుడో ఫేక్‌ వీడియోల ఫ్యాక్టరీగా మారిపోయిందన్నారు. ‘‘చాయ్‌వాలా అని నన్ను తేలిగ్గా తీసుకున్నారు. ధైర్యముంటే ఎదురుగా వచ్చి పోరాడండి. వారి యువరాజు మోదీ వర్గాన్ని, ఓబీసీలను ‘దొంగలు’ అన్నారు. దీనికి దేశమంతా స్పందించి వారిని 40 స్థానాలకు పరిమితం చేసింది. ప్రస్తుత ఎన్నికల్లో మెజార్టీకి కావాల్సిన కనీస స్థానాలకు కూడా పోటీ చేయని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటుచేయడం గురించి మాట్లాడుతోందని ప్రధాని ఎద్దేవా చేశారు.


వారణాసిలో 13న మోదీ నామినేషన్‌!

లఖ్‌నవూ: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నుంచి వరుసగా మూడోసారి భాజపా తరఫున పోటీ చేస్తున్న ప్రధాని మోదీ నామినేషను దాఖలుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మే 13న మోదీ నామినేషను పత్రాలు సమర్పించనున్నట్లు యూపీ భాజపా వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా నిర్వహించే భారీర్యాలీకి ముందు కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని దర్శించుకోనున్నట్లు సమాచారం. వారణాసిలో చివరివిడత కింద జూన్‌ 1న పోలింగు జరగనుంది. మే 7న నోటిఫికేషను వెలువడి, నామినేషన్ల సమర్పణకు 14వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఇక్కడ మోదీకి ప్రత్యర్థిగా యూపీ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్‌రాయ్‌ సైతం వరుసగా మూడోసారి పోటీలో ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img