icon icon icon
icon icon icon

తెలంగాణ, అస్సాంలలో భాజపా రహస్య ఒప్పందాలు: ప్రియాంక

అస్సాంలో మాఫియా రాజ్యమేలుతోందని, ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అనేక కుంభకోణాల్లో ఇరుక్కుపోయారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు.

Published : 02 May 2024 04:41 IST

ధుబరీ: అస్సాంలో మాఫియా రాజ్యమేలుతోందని, ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అనేక కుంభకోణాల్లో ఇరుక్కుపోయారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్‌ని ఓడించడానికి భాజపాకి తెలంగాణలో మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీతో రహస్య ఒప్పందం ఉందని, అదే రీతిలో ఆలిండియా యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఏఐయూడీఎఫ్‌)కు చెందిన బహ్రుద్దీన్‌ అజ్మల్‌తోనూ అస్సాంలో బిశ్వశర్మకు అవగాహన ఉందని చెప్పారు. బుధవారం అస్సాంలోని ధుబరీ జిల్లా బలాజన్‌లో ఎన్నికల సభలో ఆమె ప్రసంగించారు. భూములు, ఇసుక, పోకచెక్కలు, బొగ్గు సహా అన్ని రంగాల్లో మాఫియాయే నడుస్తోందని చెప్పారు. అభివృద్ధి తప్ప అన్ని స్కాంలూ ఇక్కడే జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే శర్మపై అనేక ఆరోపణలు ఉన్నాయని, భాజపాలో చేరాక అవన్నీ వాషింగ్‌మెషీన్‌లో శుభ్రమైపోయాయని వ్యంగ్యంగా అన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ, అస్సాంలో బిశ్వశర్మ కేవలం కోటీశ్వరుల కోసమే ప్రభుత్వాలు నడుపుతున్నారని, మహిళల భద్రతను గాలికి వదిలేశారని విమర్శించారు. పదేళ్లలోనే ప్రపంచంలో ధనిక పార్టీగా భాజపా మారిందని, 70 ఏళ్లలో కాంగ్రెస్‌ కూడా అంత ఆర్జించలేదని చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ తిరిగే మోదీ మన దేశంలో, కనీసం వారణాసి నియోజకవర్గంలోనైనా ఒక్క ఇంటిని సందర్శించారా అని ప్రశ్నించారు. శ్వేత, హరిత విప్లవాలను కాంగ్రెస్‌ తీసుకువస్తే భాజపా మాత్రం విద్వేష విప్లవం తెచ్చిందని దుమ్మెత్తిపోశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img