icon icon icon
icon icon icon

మహిళలకు మోదీ క్షమాపణ చెప్పాలి

హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ 400 మంది మహిళలపై లైంగిక దాడికి తెగించాడు. ఆయన తరఫున సభ నిర్వహించి, ఓట్లడిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని మహిళలకు క్షమాపణ చెప్పాలి’అని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ డిమాండు చేశారు.

Published : 03 May 2024 04:38 IST

రాహుల్‌గాంధీ డిమాండ్‌
ప్రజ్వల్‌కు ప్రధాని ఓట్లడగటంపై విమర్శలు

ఈనాడు, బెంగళూరు : ‘హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ 400 మంది మహిళలపై లైంగిక దాడికి తెగించాడు. ఆయన తరఫున సభ నిర్వహించి, ఓట్లడిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని మహిళలకు క్షమాపణ చెప్పాలి’అని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ డిమాండు చేశారు. ఆయన గురువారం కర్ణాటకలోని శివమొగ్గ, రాయచూరుల్లో ఎన్నికల ప్రచారం చేశారు. శివమొగ్గలో మాట్లాడుతూ ప్రజ్వల్‌ రేవణ్ణపై నమోదైన కేసు సాధారణమైనది కాదన్నారు.  ఇది ప్రపంచం విస్తుపోయే అతిపెద్ద మానహనన నేర సంఘటనని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి నేత తరఫున ఓట్లు అడిగిన ప్రధాని మోదీ- ప్రజ్వల్‌కు వేసే ఓటు తనకు వేసినట్లేనని ప్రకటించారని గుర్తుచేశారు. ఆయన ఇలా ఓటు అడిగిన విషయం దేశంలోని ప్రతి మహిళకూ తెలుసన్నారు. జనతాదళ్‌(ఎస్‌)తో పొత్తు సమయంలోనూ, మోదీ ప్రచారానికి వచ్చినప్పుడూ ప్రజ్వల్‌పై వచ్చిన ఆరోపణలన్నీ భాజపా నేతలకు తెలుసని నిందించారు. తమకు ఏమీ తెలియనట్లు ప్రజ్వల్‌ తరఫున ఓట్లడగటం మహిళలపై భాజపాకు ఉన్న నిబద్ధత ఏమిటో తెలియజేసిందన్నారు. ప్రపంచంలో ఏ నేతా ఇన్ని అత్యాచారాలకు పాల్పడిన అభ్యర్థి కోసం ఓట్లు అడగలేదని రాహుల్‌ విమర్శించారు.

అమిత్‌ షా రాజీనామా చేయాలి

ప్రజ్వల్‌ దేశం విడిచి పోయేందుకు సహకరించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. ఆయన వద్ద హోం, కస్టమ్స్‌, గూఢచారి సంస్థలున్నా ఈ కేసుపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు.

జేపీ నడ్డా కూడా పదవిని వీడాలి

సమానత్వం కోసం డిమాండ్‌ చేసిన వాళ్లను నక్సలైట్లని పిలిచిన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తక్షణమే రాజీనామా చేయాలని రాహుల్‌ గాంధీ డిమాండు చేశారు. దళితులు, గిరిజనులు, వెనుకబడినవాళ్లంతా సమానత్వం కోసం పోరాటం చేస్తుంటారని వివరించారు. వీరంతా నక్సలైట్లతో సమానం అన్నారంటే ఇది రాజ్యాంగంపై దాడి కాక ఇంకేమిటని రాహుల్‌ ప్రశ్నించారు. భాజపా ఎప్పుడూ రాజ్యాంగాన్ని రక్షిస్తామని ప్రకటనలు చేస్తుంటుందని, మరోవైపు ఆ పార్టీ అధ్యక్షుడు సమానత్వంపై దాడి చేస్తుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img