icon icon icon
icon icon icon

రాహుల్‌ను ప్రధాని చేయాలని పాకిస్థాన్‌ తహతహ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని ఉద్దేశించి ప్రధాని మోదీ పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ యువరాజును భారత్‌కు తదుపరి ప్రధాని చేయాలని పొరుగు దేశం పాకిస్థాన్‌ తహతహలాడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు.

Updated : 03 May 2024 06:39 IST

గుజరాత్‌ సభల్లో మోదీ

ఆనంద్‌, సురేంద్రనగర్‌, జూనాగఢ్‌ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని ఉద్దేశించి ప్రధాని మోదీ పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ యువరాజును భారత్‌కు తదుపరి ప్రధాని చేయాలని పొరుగు దేశం పాకిస్థాన్‌ తహతహలాడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందుకోసం పాక్‌ నేతలు ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తున్నారని తెలిపారు. గురువారం గుజరాత్‌లోని ఆనంద్‌, సురేంద్రనగర్‌, జూనాగఢ్‌ ఎన్నికల సభల్లో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీ పాక్‌కు ‘భక్తురాలు’ (మురీద్‌) అనే విషయం అందరికీ తెలుసని, ఈ రెండింటి మధ్యనున్న భాగస్వామ్యం ఇప్పుడు బయటపడిందన్నారు. ‘‘దేశంలో కాంగ్రెస్‌ నానాటికీ బలహీనపడుతోంది. ఇక్కడ ఆ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోతుంటే.. అక్కడ పాకిస్థాన్‌ కన్నీళ్లు పెట్టుకుంటోంది’’ అని దుయ్యబట్టారు. భారత్‌లో 26/11 ముంబయి ఉగ్రదాడుల నాటి బలహీన సర్కారు, 2014కు ముందున్న అవినీతి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని శత్రు దేశాలు కోరుకుంటున్నాయని చెప్పారు. పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఫవాద్‌ హుసేన్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో రాహుల్‌గాంధీ గురించి ఓ పోస్ట్‌ పెడుతూ ‘రాహుల్‌ ఆన్‌ ఫైర్‌’ అని రాసుకొచ్చారు. ఆ మరుసటిరోజే మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గతంలో ఉగ్రవాదులను ఎగుమతి చేసి, బాంబులు పట్టుకొన్న ఆ దేశం చేతుల్లో ఇపుడు బొచ్చె ఉందని ప్రధాని విమర్శించారు.   ఖర్గే ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ సభలో దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్‌ ఇపుడు హిందువుల నడుమ విభేదాలు సృష్టించాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ‘‘కాంగ్రెస్‌ రాజకుటుంబానికి సవాలు చేస్తున్నా. ఆర్టికల్‌ 370 పునరుద్ధరణ, సీఏఏ రద్దు, ట్రిపుల్‌ తలాఖ్‌ నిషేధం రద్దు వంటి అంశాలు మీ రహస్య అజెండాలో ఉంటే ముందుకువచ్చి చెప్పండి. మీరెంత ధైర్యవంతులో చూస్తాను’’ అని మోదీ అన్నారు. సర్దార్‌ పటేల్‌ లేకపోతే జూనాగఢ్‌ కూడా పాకిస్థాన్‌కు వెళ్లిపోయేదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఎవరూ నివాసం లేరని కచ్‌ ఎడారిని ఇతర దేశాలకు ఇచ్చేస్తుందని, ఎవరూ అడగకపోతే హిమాయల శిఖరాలను సైతం అమ్మేస్తుందని మోదీ విరుచుకుపడ్డారు.


 ఓట్‌ జిహాద్‌ అంటే ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ మేనకోడలు, సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు మరియా ఆలం ఓట్‌ జిహాద్‌కు పిలుపునివ్వడంపైనా మోదీ మండిపడ్డారు. ‘‘ఇప్పటివరకు లవ్‌ జిహాద్‌, ల్యాండ్‌ జిహాద్‌ గురించి విన్నాం. ఇండియా కూటమి నేతలు ఓట్‌ జిహాద్‌ గురించి చెబుతున్నారు. మదర్సాలో కాకుండా బాగా చదువుకున్న ముస్లిం కుటుంబానికి చెందిన మహిళ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే. దీన్ని ఏ ఒక్క కాంగ్రెస్‌ నాయకుడూ ఖండించలేదే?’’ అని ప్రధాని ప్రశ్నించారు. ‘‘రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకొని నృత్యం చేయడం కాదు, దాని విశిష్టత తెలుసుకోవాలంటే మోదీ దగ్గరకు రా’’ అని రాహుల్‌కు సవాలు విసిరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img