icon icon icon
icon icon icon

ఈసీపై విశ్వాసం ఉంచండి

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సమస్యాత్మకంగా మారిన డీప్‌ఫేక్‌ వీడియోల అంశాన్ని ఎన్నికల సంఘం(ఈసీ) సమర్థంగా పరిష్కరించగలదన్న విశ్వాసాన్ని దిల్లీ హైకోర్టు వ్యక్తం చేసింది.

Published : 03 May 2024 06:14 IST

ఎన్నికల మధ్యలో కొత్త విధానం తీసుకురాలేం : దిల్లీ హైకోర్టు

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సమస్యాత్మకంగా మారిన డీప్‌ఫేక్‌ వీడియోల అంశాన్ని ఎన్నికల సంఘం(ఈసీ) సమర్థంగా పరిష్కరించగలదన్న విశ్వాసాన్ని దిల్లీ హైకోర్టు వ్యక్తం చేసింది. దీని కోసం ఎన్నికల మధ్యలో కొత్త విధానాన్ని తాము సూచించలేమని తెలిపింది. డీప్‌ఫేక్‌ వీడియోలపై సత్వరమే చర్యలు తీసుకోవడంతో పాటు వాటి వ్యాప్తిని అడ్డుకునేలా ఈసీకి ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయవాదుల బృందం పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై గురువారం విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మన్మోహన్‌, జస్టిస్‌ మన్మీత్‌ అరోడా ధర్మాసనం...ఈ సమస్యపై ఈసీ తగిన చర్యలు తీసుకుంటుందని, ఆ రాజ్యాంగ సంస్థపై నమ్మకం ఉంచాలని పేర్కొంది. ప్రస్తుత సమయంలో ఈసీ అధికార పరిధుల్లో కోర్టు జోక్యం తగదని తెలిపింది. ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది మాట్లాడుతూ...డీప్‌ ఫేక్‌ వీడియోల సమస్యపై ఈసీకి సమగ్రమైన ఫిర్యాదు చేస్తే చట్టప్రకారం మే 6వ తేదీలోగా తగిన చర్యలు తీసుకుంటుందని వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, నటులు అమీర్‌ఖాన్‌, రణవీర్‌సింగ్‌ తదితరులపై వచ్చిన డీప్‌ఫేక్‌ వీడియోల వ్యాప్తిని నిలిపివేయించామని, నిందితులపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో పదేపదే ఫేక్‌ వీడియోలు పెడుతున్న నిందితులపై చర్యలతో పాటు వారి పేర్లనూ అందరికి తెలిసేలా వెల్లడించాలని ధర్మాసనం సూచించింది. పిటిషనర్లు కూడా ఈసీని సంప్రదించాలని చెబుతూ విచారణను ముగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img