icon icon icon
icon icon icon

రాజ్యాంగ పీఠిక పూర్వరూపాన్ని పునరుద్ధరిస్తాం

రాజ్యాంగ పీఠికలో ‘లౌకిక’ పదాన్ని చేర్చడం ద్వారా రాజ్యాంగంపై కాంగ్రెస్‌ పార్టీ దాడికి పాల్పడిందని భాజపా ధ్వజమెత్తింది. తాము కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తే పీఠిక పూర్వరూపాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించింది.

Published : 04 May 2024 03:37 IST

‘లౌకిక’ పదాన్ని చేర్చి అంబేడ్కర్‌ ఆత్మను కాంగ్రెస్‌ గాయపరచింది
దళిత, ఓబీసీల రిజర్వేషన్లకు ఆ పార్టీ వ్యతిరేకం
ఏఎంయూ, జామియా మిల్లియా ఇస్లామియాల్లో దళిత కోటాకు కృషి చేస్తాం
రిజర్వేషన్లకు మోదీ మహా రక్షకుడు: భాజపా

దిల్లీ: రాజ్యాంగ పీఠికలో ‘లౌకిక’ పదాన్ని చేర్చడం ద్వారా రాజ్యాంగంపై కాంగ్రెస్‌ పార్టీ దాడికి పాల్పడిందని భాజపా ధ్వజమెత్తింది. తాము కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తే పీఠిక పూర్వరూపాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించింది. భాజపా ప్రధాన కార్యదర్శి దుశ్యంత్‌ కుమార్‌ గౌతమ్‌ శుక్రవారం దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దళితులు, వెనకబడిన వర్గాల రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ వ్యతిరేకమని మండిపడ్డారు. రాజ్యాంగానికి పీఠిక ఆత్మ వంటిదని అంబేడ్కర్‌ తరచూ చెప్పేవారని, అయినప్పటికీ వాళ్లు (కాంగ్రెస్‌ పాలకులు) అందులో ‘లౌకిక’(సెక్యులర్‌) పదాన్ని చేర్చారని ఆక్షేపించారు. ‘భాజపా తిరిగి అధికారంలోకి వస్తే పీఠిక పూర్వస్థితిని పునరుద్ధరిస్తారా?’ అన్న విలేకరుల ప్రశ్నకు దుశ్యంత్‌ అవునని సమాధానం ఇచ్చారు. ‘‘పీఠికలో ‘లౌకిక’ పదాన్ని చొప్పించకూడదు. ఆ చర్య అంబేడ్కర్‌ ఆత్మను క్షోభకు గురి చేసింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ), జామియా మిల్లియా ఇస్లామియాల్లో దళితులకు రిజర్వేషన్లు దక్కేందుకు కృషి చేస్తామని తెలిపారు.

రిజర్వేషన్లు ఇష్టం లేదని నెహ్రూయే చెప్పారు

షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, ఓబీసీలకు ఇస్తున్న రిజర్వేషన్లకు అంతం పలికేందుకు, రాజ్యాంగంలో మార్పులు చేసేందుకే భాజపా 400పైగా లోక్‌సభ స్థానాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందన్న కాంగ్రెస్‌ ఆరోపణలపై దుశ్యంత్‌ స్పందించారు. 1961, జూన్‌ 27న ఆనాటి ప్రధాని నెహ్రూ అప్పటి సీఎంలకు రాసిన లేఖలో ఏ తరహా రిజర్వేషన్లను తాను ఇష్టపడనని, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా సమ్మతం కాదని స్పష్టంచేశారని గుర్తు చేశారు. జమ్మూకశ్మీర్‌కు 370 ప్రత్యేక అధికరణాన్ని కల్పించడం ద్వారా అక్కడ దళితులకు, బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా కాంగ్రెస్‌ అడ్డుకుందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు ప్రధాని మోదీ మహా రక్షకుడని పేర్కొన్నారు. తాను బతికున్నంత కాలం దళితులు, బీసీల రిజర్వేషన్లలో ఎవ్వరూ జోక్యం చేసుకోలేరని బహిరంగంగా స్పష్టం చేశారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img